అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే
గుండాల, వెలుగు: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌పార్టీనే అధికారంలోకి వస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. మంగళవారం పార్టీ నాయకు లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంబొయిన ముత్తయ్య, నాగసీతరాములు, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ఖాన్, ఎలురి కోటేశ్వరావు, చీమల వెంకటేశ్వర్లు, నవీన, కొడిశాల రామనాథం, భట్ట విజయగాంధీ, క్రిష్ణారెడ్డి, ఈశ్వర్ గౌడ్, ఈసం పాపరావు పాల్గొన్నారు.
స్ట్రట్ ఇంక్లైన్ గని ప్రమాద మృతులకు నివాళి
ఇల్లందు,వెలుగు: గతంలో మొహరం రోజున ఇల్లందు ఏరియా స్ట్రట్ ఇంక్లైన్ గని ప్రమాదంలో మరణించిన అధికారులు, ఉద్యోగులకు ఇన్చార్జి జీఎం బండి వెంకటయ్య, అధికారులు మంగళవారం 24 ఏరియాలోని స్మృతి వనం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ 1938 మార్చి12న రాత్రి11గంటలకు గనుల మేనేజర్ ఆర్ఎల్ యాండ్రూస్ ఆధ్వర్యంలో పని చేస్తుండగా ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు. పెద్ద బండ కూలి కార్బన్ మోనాక్సైడ్ బయటకు రావడంతో 43 మంది విష వాయువు పీల్చి చనిపోయినట్లు, వీరిలో ఆరుగురు మహిళా ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. మొహరం రోజున ఈ ప్రమాదం జరగడంతో అప్పటి నుంచి వారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా సంస్మరణ సభ నిర్వహించి వారిని స్మరించుకుంటున్నట్లు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా మొహరం పండుగ రోజున యాజమాన్యం సెలవుగా ప్రకటించిందని తెలిపారు. ఇల్లందు ఏరియాలో శుక్రవారం వారాంతపు సెలవు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అధికారుల సంఘం ప్రతినిధి పసుల రమేశ్, డీజీఎం పర్సనల్ జీవీ మోహనరావు, ఎస్ఈ(సివిల్) డాక్టర్ డి.ఆదినారాయణ, ఏజీఎం(ఐఈ) గిరిధరరావు, పర్యావరణ అధికారి ధనుంజయ రెడ్డి, సెక్యూరిటీ ఆఫీసర్ వి అంజిరెడ్డి, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు ఎస్ రంగనాథ్, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, ఉద్యోగులు రమణారెడ్డి, ఎన్వీ రమణ, అమ్మ సుధీర్, ప్రభాకర్, కుమార్ సింగ్, మేకల శంకర్, తిరుపతి పాల్గొన్నారు.
ముగిసిన పవిత్రోత్సవాలు
ఎర్రుపాలెం, వెలుగు: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం పుణ్యక్షేత్రంలో మంగళవారం పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. అర్చన, మండపారాధన, యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి పుష్కరిణిలో స్వామి వారి ప్రతినిధిగా సుదర్శన చక్రానికి చక్రస్నానం చేయించారు. ఈవో జగన్ మోహన్ రావు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల కృష్ణమోహన్ శర్మ పాల్గొన్నారు.
విద్యుత్ చట్టాలను సవరించొద్దు
పాల్వంచ/కామేపల్లి/ఖమ్మం టౌన్, వెలుగు: విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం పాల్వంచలో బిల్లు ప్రతులను దహనం చేశారు. ఐఎఫ్టీయూ ఏరియా ప్రధాన కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, ఉమ, జయ, రాంబాబు, మల్లయ్య, దూలయ్య, గణేశ్, సురేశ్, దేవా, అజయ్ పాల్గొన్నారు. కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంలో న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఖమ్మం సిటీలో న్యూడెమోక్రసీ నాయకులు ఆందోళన చేపట్టారు.
భద్రాద్రిలో ఘనంగా పవిత్రోత్సవాలు వైభవంగా పవిత్రారోపణం
భద్రాచలం, వెలుగు: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం పవిత్రారోపణం వైభవంగా జరిగింది. వేదోక్తంగా సాగిన ఈ వేడుకలో భాగంగా స్వామికి సమస్త నదీ, సముద్ర జలాలతో సహస్రధారలతో అష్టోత్తర కలశ స్నపన తిరుమంజనం చేశారు. ఏడాది కాలంలో స్వామి వారికి నిర్వహించే పూజా కార్యక్రమాల్లో తెలిసీ తెలియక చోటు చేసుకునే దోషాల నివృత్తి కోసం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ముందుగా వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత స్నపన తిరుమంజనం నిర్వహించి పవిత్రాలను స్వామికి సమర్పించారు. మూలవరుల నుంచి ఆలయ శిఖరం వరకు, గుడిలోని ప్రతీ దేవుడి విగ్రహానికి పవిత్రాలను అలంకరించారు.
ఇంటింటికీ జెండాల పంపిణీ
ఖమ్మం టౌన్, వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం సిటీలోని కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ వీపీ గౌతమ్ ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ ప్రారంభించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి సీపీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
త్రివర్ణ రంగులతో ముస్తాబు చేయాలి
భద్రాద్రికొత్తగూడెం: స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను త్రివర్ణ రంగులతో ముస్తాబు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వజ్రోత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. అనంతరం జిల్లాకు మంజూరైన రెండు 108 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి జెండా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
హాస్టల్ వర్కర్ల నిరవధిక సమ్మె షురూ
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన హాస్టళ్లలో పని చేసే వర్కర్లు మంగళవారం నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డెయిలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఐటీడీఏ వ్యాప్తంగా హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల ఎదుట వర్కర్లు విధులు బహిష్కరించి ఆందోళనలు చేశారు. 14 నెలలుగా వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. డెయిలీ వేజ్ వర్కర్లకు 6 నెలల వేతన బకాయిలు, ఔట్సోర్సింగ్ కార్మికుల 14 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతీ నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించేలా బడ్జెట్ కేటాయించాలని, కరోనా లాక్డౌన్ కాలానికి వేతనాలు చెల్లించాలని కోరారు. సంఘ నాయకులు బ్రహ్మాచారి, మర్లపాటి రేణుక, వైవీ రామారావు, నాగరాజు, హీరాలాల్, ముత్తయ్య పాల్గొన్నారు.
వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
చండ్రుగొండ, వెలుగు: సంచార జీవనం గడిపే వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పతల ఏడుకొండలు డిమాండ్ చేశారు. మంగళవారం చండ్రుగొండలో సంఘం మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు. అర్హులైన వడ్డెరలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. బ్యాంకుల ద్వారా కులవృత్తుల అభివృద్దికి రుణాలు మంజూరు చేయాలన్నారు. సంఘం మండల అధ్యక్షుడు సాంబశివరావు, రామకృష్ణ, కన్నయ్య, రాందాసు, భూపాల్, వెంకటేశ్, శ్రీను, మారెయ్య పాల్గొన్నారు.
గిరిజన యువకుడికి పీహెచ్డీ పట్టా
కామేపల్లి, వెలుగు: మండలంలోని కొర్రతండాకు చెందిన కొర్రా చీనా ఐఐటీ ధన్ బాద్ లో ‘డిజైన్ ఆఫ్ ఎఫిసియెంట్ టెక్నిక్స్ ఫర్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ బేస్డ్ స్మార్ట్ గ్రిడ్స్’ అంశంలో పీహెచ్డీ పట్టా పొందాడు. కొర్రా బాల్య, బాజ్జు నాలుగవ కొడుకైన చీనా పీహెచ్ డీ పూర్తి చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కామేపల్లిలో ప్రైమరీ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయ, ఏపీఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశాడు. వివిధ హోదాల్లో పని చేస్తూ పీహెచ్డీ పూర్తి చేయడం సంతోషంగా ఉందని, కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని చీనా తెలిపారు.
వరద బాధితులకు చేయూత
పాల్వంచ, వెలుగు: వరదలతో నష్టపోయిన కుటుంబాలకు పాల్వంచలోని బొల్లోరుగూడెం పాఠశాల పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని మామిడివాయి, లక్ష్మీనగరం గ్రామాలకు చెందిన ప్రజలకు రూ 1.25 లక్షల విలువైన నిత్యావసర వస్తువులు, దుప్ప ట్లు, దుస్తులు పంపిణీ చేశారు. విజయలక్ష్మి, మాధవి, రేగడి మధు, వరప్రసాద్, చాపల శ్రీను, హేమనాథన్, సముద్రాల శ్రీను, అజీజ్, నారాయణ, సునీత, విజయ కుమారి, ప్రకాష్ పాల్గొన్నారు.
హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఐటీడీఏ పీవో భేటీ
భద్రాచలం, వెలుగు: భద్రాచలం జూనియర్ కాలేజీ పనితీరు, బోధన ప్రమాణాలను మంగళవారం హైకోర్టు రిటైర్డ్‌జడ్జి నారాయణ, ఇంటర్ బోర్డు మాజీ కమిషనర్ చక్రపాణి పరిశీలించారు. వారిని ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు కలిసి ఐటీడీఏ పరిధిలో గిరిజన విద్యాలయాల్లో సౌకర్యాలు, విద్యాబోధన తదితర విషయాన్ని వారికి వివరించారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతిని వివరించి మెమెంటోలను అందించారు.
హక్కుల కోసం పోరాడాలి
వైరా, వెలుగు: గిరిజన హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా గిరిజనులు ఉపాధికి దూరమై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్ పెంపు తీర్మానాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించాలని కోరారు.