ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

వైరా, వెలుగు: రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన సీఎం  కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. వైరా మండలం గొల్లపూడి గ్రామంలోని పులిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రజా గోస సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బైక్​ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ బచావో యాత్ర చేపట్టారని అన్నారు. కమ్యూనిస్టులు కమర్షియల్ లిస్టులు అయ్యారన్నారు. జిల్లా అధ్యక్షుడు గల్ల సత్యనారాయణ, శ్యామ్ రాథోడ్, నెల్లూరు కోటేశ్వరరావు పాల్గొన్నారు. 
 

ప్రజల మనిషి మాజీ ఎమ్మెల్యే భూపతిరావు

భద్రాచలం, వెలుగు: పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు ప్రజల మనిషిగా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కోసం ఉద్యమించారని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక టూరిజం హోటల్​లో గురువారం మాజీ ఎమ్మెల్యే భూపతిరావు సంస్మరణ సభలో వారు పాల్గొని మాట్లాడారు. భూమి,భుక్తి  కోసం జరిపిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని, పేద ప్రజల కోసం ఇంటి స్థలాలు ఇప్పించడానికి జైలుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. ఎంపీ మాలోత్​ కవిత, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డా.మిడియం బాబూరావు, ఎంఆర్​పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆయన కుమారుడు హైకోర్టు జడ్జి భీమపాక నగేశ్​ను పరామర్శించారు.

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆరోగ్యవంతమైన సమాజం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్​ అనుదీప్​ అన్నారు. చుంచుపల్లి మండలం బాబుక్యాంప్​ హైస్కూల్​లో జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా గురువారం స్టూడెంట్స్​కు అల్బెండజోల్​ టాబ్లెట్లను వేసి ప్రోగ్రామ్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది నుంచి 19 ఏండ్ల వయసు కలిగిన విద్యార్థులందరికీ అల్బెండజోల్   మాత్రలను వేయాలన్నారు. జిల్లాలో 3,22,333 మందిని ఇప్పటి వరకు గుర్తించినట్లు తెలిపారు. నులి పురుగుల నివారణలో అల్బెండజోల్​ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. నులిపురుగులు కడుపులో ఉంటే తరచూ అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. అనంతరం స్కూల్​లో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహాన్ని కలెక్టర్​ ఆవిష్కరించారు. జడ్పీ వైస్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్, ఎంపీపీ బాదావత్​ శాంతి, సర్పంచ్​ బాబూరావు, డీఎంహెచ్​వో దయానందస్వామి, వరలక్ష్మి, ప్రోగ్రాం ఆఫీసర్​ నాగేంద్ర ప్రసాద్  పాల్గొన్నారు. 

సింగరేణి నిధులన్నీ పక్కదారి పడుతున్నయ్ 

సత్తుపల్లి, వెలుగు: సింగరేణి లాభాల్లో ప్రభావిత ప్రాంతాలకు ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయని, ఈ నిధులన్నీ సక్రమంగా ఖర్చు చేసే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపైనే ఉంటుందని ఐఎన్టీయూసీ నేషనల్​ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్  క్యాంప్  ఆఫీసులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలోనే రాష్ట్రంలో సింగరేణి గనుల‌‌‌‌ విస్తరణ జరిగిందని కొనియాడారు. రానున్న రోజుల్లో సత్తుపల్లి ఓపెన్​కాస్ట్​ గనుల్లో ఐఎన్టీయూసీ జెండా ఎగరేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, ఐఎన్టీయూసీ నేతలు కలిసి ప‌‌‌‌నిచేయాలని సూచించారు. నాయకులు నున్నా రామకృష్ణ, రావి నాగేశ్వరరావు, గాదె చెన్నకేశవరావు, ఐ. కృష్ణ, ఆల్బర్ట్, డాక్టర్ శంకర్ నాయక్, జి.యాకయ్య, మానుకోట ప్రసాద్, ఫజల్ బాబా, కంభంపాటి కాంతారావు, సమద్, ఖలీల్, యూసఫ్ పఠాన్, జానీ ఖాన్, మారబోయిన ప్రసాద్, వాసు 
పాల్గొన్నారు.

భట్టికి కాంగ్రెస్​ నేతల సన్మానం

వైరా, వెలుగు: సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్​ నాయకులు సన్మానించారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంట్ భవనానికి అంబేద్కర్  పేరు పెట్టాలని, పోలీస్​ రిక్రూట్​మెంట్​లో కటాఫ్ మార్కులు తగ్గించాలని మాట్లాడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మాలోత్ రాందాస్ నాయక్, దాసరి దానియేలు, జేబీ శౌరి, పమ్మి అశోక్, పణితి శ్రీను, వేల్పుల భారత్  ఉన్నారు.  

క్రీడాస్ఫూర్తిని చాటాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని టీబీజీకేఎస్​ కొత్తగూడెం ఏరియా వైస్​ ప్రెసిడెంట్​ ఎండీ రజాక్​ సూచించారు. కొత్తగూడెం ఏరియా వర్క్​ పీపుల్, స్పోర్ట్స్​ అండ్​ గేమ్స్​ ఆధ్వర్యంలో రుద్రంపూర్​ జయశంకర్​ గ్రౌండ్​లో నిర్వహించిన హాకీ పోటీలను ఆయన ప్రారంభించారు. వీకే–7గ్రూప్, పీవీకే–5ఇంక్లన్​ గ్రూప్​ మధ్య జరిగిన పోటీలో పీవీకే–5 గ్రూప్​ విజయం సాధించింది. స్పోర్ట్స్​ కో ఆర్డినేటర్​ జి రాజశేఖర్​ పాల్గొన్నారు. 

విద్యార్థిని ఆచూకీ లభ్యం

బూర్గంపహాడ్, వెలుగు: బూర్గంపహాడ్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న మేఘన ఆచూకీ లభించింది. బుధవారం పాఠశాల నుంచి అదృశ్యం కావడంతో పాఠశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, అధికారులు ఆమె కోసం గాలిస్తుండగా, గురువారం మధ్యాహ్నం హాస్టల్​ పై అంతస్తులో ఉన్న ఆమెను తోటి విద్యార్థినులు గుర్తించారు. పై అంతస్తులో ఎందుకు పడుకుందనే విషయాన్ని మేఘన చెప్పలేకపోతోంది. మోరంపల్లి బంజర పీహెచ్​సీలో ప్రథమ చికిత్స అనంతరం అధికారులు బాలికను పేరెంట్స్​కు అప్పగించారు. ఇదిలాఉంటే ఈ ఘటనపై విచారణ చేపడతామని డీడీ రమాదేవి తెలిపారు. విద్యార్థి ఆచూకీ లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

 కార్యకర్తలకు అండగా ఉంటా

చండ్రుగొండ, వెలుగు : కార్యకర్తలకు అన్ని సమయాల్లో అండగా ఉంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయ్యన్నపాలెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ పకీరారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట జడ్పీ చైర్మన్  కోరం కనకయ్య, వైస్ చైర్మన్ చంద్రశేఖర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, లీడర్లు శేఖర్, భోజ్యానాయ్, పర్సా వెంకటేశ్వర్లు ఉన్నారు.

18న మంత్రికి పౌర సన్మానం

ఖమ్మం టౌన్, వెలుగు: మంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న పువ్వాడ అజయ్​ను ఈ నెల 18న సప్తపది ఫంక్షన్ హాల్ లో పౌర సన్మానం నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు షేక్  అఫ్జల్ హసన్, పులిపాటి ప్రసాద్, చిన్ని కృష్ణారావు, పొన్నం వెంకటేశ్వర్లు, కురువేళ్ల ప్రవీణ్  తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ గాంధీ చౌక్ సెంటర్  నుంచి సప్తపది ఫంక్షన్ హాల్ వరకు కార్లతో ర్యాలీ ఉంటుందని చెప్పారు. అన్నివర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాల లీడర్లు తరలిరావాలని కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షుడు కొప్పు నరేశ్, జనరల్ సెక్రటరీ గోడవర్తి శ్రీనివాసరావు,  గుమ్మడిల్లి శ్రీనివాస్, గోళ్ల రాధాకృష్ణ, అమరాగాని వెంకన్న పాల్గొన్నారు.

అథ్లెట్​కు సన్మానం

పెనుబల్లి, వెలుగు: మండలంలోని మండాలపాడు గ్రామానికి పెండ్ర వికాస్​ గుంటూర్​లో జరిగిన సౌత్​జోన్​ అథ్లెటిక్స్ పోటీల్లో రన్నింగ్​ ట్రాక్​ లైన్​లో గోల్డ్​మెడల్, 60 మీటర్ల రన్నింగ్​లో సిల్వర్​ మెడల్​ సాధించాడు. అతడిని కాంగ్రెస్​ నేతలు నున్నా రామకృష్ణ, కాంగ్రెస్​రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బుక్కా కృష్ణవేణి తదితరులు వికాస్​ను సన్మానించి అభినందించారు. రావి నాగేశ్వరరావు, కృష్ణ, మానుకోట ప్రసాద్​ పాల్గొన్నారు. 

బియ్యం పట్టివేత

చండ్రుగొండ, వెలుగు: మండలంలోని తిప్పనపల్లి నుంచి వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్  బియ్యాన్ని పట్టుకున్నట్లు  ఎస్సై విజయలక్ష్మి తెలిపారు. వ్యాన్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ సూరిబాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

ఆర్ఎస్పీని కలిసిన ఎన్ఆర్ఐ

పెనుబల్లి, వెలుగు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్​ను మండలానికి చెందిన ఎన్ఆర్ఐ అలుగోజు నరసింహారావు కలిశారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతంలోని భూ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి పేద రైతులకు న్యాయం చేయాలని ఆర్ఎస్పీని ఆయన కోరారు. 

పద్మశాలీల అభివృద్ధికి కృషి

కూసుమంచి,వెలుగు: పద్మశాలీల అభివృద్ధికి కృషి చేస్తానని మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు లగిశెట్టి వీరబాబు తెలిపారు. ఇటీవల జీళ్లచెరువులో జరిగిన సమావేశంలో వీరబాబును సంఘం మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చెన్నా మోహన్​రావు, సామల సాయి, శ్రీనివాస్, గుడ్ల కోటయ్య పాల్గొన్నారు.

శిక్షణ కేంద్రం ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథపాలెం మండలం చెరువు కొమ్ము తండాలో బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్.ఉప్పల శారద నిర్వహిస్తున్న వీఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి ప్రారంభించారు. బాణోతు జంపా, భుక్యా బాలాజీ, పి.నాగేశ్వరరావు, అజ్మీరా హరిలాల్, ట్రైనర్ అనిత పాల్గొన్నారు.

డ్రోన్ తో మందుల పిచికారీ

కూసుమంచి, వెలుగు: మండలంలోని జక్కేపల్లి గ్రామంలో వరి పొలంలో డ్రోన్లతో మందుల పిచికారీ విధానాన్ని ఏడీఏ విజయచంద్ర రైతులకు వివరించారు. ఏవో వాణి, ఏఈవో సౌజన్య, సింజెంటా కంపెనీ ప్రతినిధులు కృష్ణంనాయుడు, శ్రీనివాస్,​ ప్రసన్నరెడ్డి, నగేశ్ పాల్గొన్నారు. 

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

సత్తుపల్లి, వెలుగు: మండలంలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన ఈర్ల కోటేశ్వరరావు(60) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన ఈర్ల రామకృష్ణ బుధవారం కోటేశ్వరరావుని తిట్టడంతో మస్తాపం చెంది పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య వరలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


డీసీహెచ్ఎస్​గా రవిబాబు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: డీసీహెచ్ఎస్​గా డాక్టర్​ జి. రవిబాబు  నియమితులయ్యారు. జిల్లా ఆసుపత్రిలో ఆర్ఎంవోగా,  సూపరింటెండెంట్​గా విధులు నిర్వహించారు. జిల్లాలోని ఇల్లందు, బూర్గంపహాడ్, పాల్వంచ ఏరియా హాస్పిటల్స్​ను రవిబాబు పర్యవేక్షించనున్నారు. 

కలెక్టర్ ను కలిసిన డీఎఫ్ వో

ఖమ్మం టౌన్, వెలుగు: డీఎఫ్​వోగా బాధ్యతలు తీసుకున్న సిద్ధార్థ్ విక్రమ్ సింగ్  గురువారం కలెక్టర్  వీపీ గౌతమ్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. నిర్మల్  డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఎఫ్డీవోగా పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు.

డ్రైవర్లను వేధించొద్దు

భద్రాచలం, వెలుగు: బదిలీపై వచ్చిన ఆర్టీసీ డ్రైవర్లను టిమ్ సర్వీసుకు వెళ్లాలని వేధిస్తున్నారంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ డీఎం ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. నిరక్షరాస్యులైన డ్రైవర్లను టిమ్స్​ డ్యూటీలు చేయాలనడం భావ్యం కాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బ్రహ్మాచారి అన్నారు. ట్రైనింగ్​ ఇప్పిస్తామని, ఆ తరువాత కూడా ఆ డ్యూటీ లేకుండా చూస్తామని డీఎం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.