సత్తుపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లాలో ఇద్దరికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సభ ఎన్నికల నగారాకు వేదికైందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శుక్రవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చీఫ్ గెస్ట్లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ ప్రకృతికి ఎదురొడ్డి గోదావరి, కృష్ణా జలాలను రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేందుకు సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేశారన్నారు. కరువు కాటకాలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా మారడానికి కేసీఆర్ కార్యదక్షతే కారణమని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని 10 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, దేశ రాజకీయాలకు ఆయన అవసరం ఎంతో ఉందన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు సత్తుపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పునర్నిర్మాణంతో పాటు కల్లూరు బస్ స్టేషన్ నిర్మాణం, తన స్వగ్రామం కందుకూరులో లైబ్రరీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ 2012లో మంజూరైన భద్రాచలం–కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణంలో జాప్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ భద్రాచలం–సత్తుపల్లి రైల్వే లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా మంత్రికి, ఎంపీలకు ఆహ్వానం లేకపోవడమేమిటని నిలదీశారు. ముందుగా వేలాది మంది కార్యకర్తలతో తల్లాడ నుంచి కల్లూరు, పెనుబల్లి మీదుగా సత్తుపల్లి వరకు రోడ్ షో నిర్వహించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, మెచ్చ నాగేశ్వరరావు, రాములు నాయక్, హరిప్రియ, జిల్లా పరిషత్ చైర్మన్లు లింగాల కమల్ రాజు, కోరం కనకయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేశ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు కొత్తూరు ఉమామహేశ్వరరావు, దిండిగాల రాజేందర్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, కుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ పాల్గొన్నారు.
సమావేశానికి దూరంగా తుమ్మల
ఈ సభకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు దూరంగా ఉన్నారు. తనను ఎవరూ ఆహ్వానించలేదని, అందుకే తాను సమావేశానికి దూరంగా ఉన్నట్లు తుమ్మల తెలిపారు. బండి పార్థసారథిరెడ్డి ఆహ్వానించారని, అయితే సభాధ్యక్షుడైన ఎమ్మెల్యేతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడి నుంచి తనకు ఆహ్వానం రాలేదని చెప్పారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనని తెలిపారు.
స్వర్ణ కవచాలతో రామయ్య
భద్రాచలం, వెలుగు: గర్భగుడిలో శ్రీసీతారామచంద్రస్వామి బంగారు కవచాలతో శుక్రవారం భక్తులను అలరించారు. మూలవరులను స్వర్ణ కవచాలతో అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామికి విశేష హారతులు ఇచ్చారు. సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించి ఈ వేడుక జరిపారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం, లక్ష కుంకుమార్చన చేశారు. లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన తర్వాత మంజీరాలు పంపిణీ చేశారు. శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమూర్తులకు ప్రాకార మండపంలో నిత్య కల్యాణం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం అద్దాల మండపంలో స్వామికి దర్బారు సేవ జరిపించి సంధ్యాహారతి ఇచ్చారు.
ఆర్డీవో పూజలు
భద్రాచలం ఆర్డీవోగా రత్న కల్యాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు క్షేత్ర మహత్యం వివరించారు. లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో ఆమెకు ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. ఆమె వెంట తహసీల్దార్ శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు.
పిడమర్తిని అవమానించిన్రు
సత్తుపల్లి, వెలుగు: ఎంపీలకు స్వాగతం పలుకుతూ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిని ఆహ్వానించకుండా అవమానించారని మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్ విమర్శించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ఉద్యమకారులను కించ పరుస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పిడమర్తి రవి, బొమ్మెర రామ్మూర్తి వంటి వారికి ప్రాధాన్యత తగ్గించేందుకు ఎమ్మెల్యే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏఎస్పీ
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏఎస్పీ రోహిత్‌రాజ్ శుక్రవారం ప్రారంభించారు. జేబు దొంగతనాలు, మిస్సింగ్ కేసులను ఛేదించడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు. డిపో మేనేజర్ రామారావు, సీఐ నాగరాజురెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు డిపోలో ఆర్టీసీ ఉద్యోగులందరికీ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ఏఎస్పీ ప్రారంభించారు. ఉద్యోగులకు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.
రొయ్య పిల్లలు మాకొద్దు
వైరా, వెలుగు: పభుత్వం సబ్సిడీపై అందిస్తున్న రొయ్య పిల్లల విడుదలను మత్స్యకారులు అడ్డుకున్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ముందుగా వైరా రిజర్వాయర్‌లో బతకమ్మ ఘాట్ వద్ద రొయ్య పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మత్స్యకారులు నాణ్యత లేని రొయ్య పిల్లలను రిజర్వాయర్‌లో వదిలితే తమకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై అధికారులు నాసిరకం చేప, రొయ్య పిల్లలను సప్లై చేస్తున్నారని ఆరోపించారు. రెండు నెలల క్రితం లక్ష చేప పిల్లలని చెప్పారని, వాటిని లెక్కపెడితే 18 వేలే ఉన్నాయని తెలిపారు. శుక్రవారం విడదల చేయడానికి తెచ్చిన 7.18 లక్షల రొయ్య పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్య కారులు ఆరోపించారు. దీంతో కాంట్రాక్టర్ రొయ్య పిల్లలను వెనక్కి తీసుకెళ్లాడు. సొసైటీ ప్రెసిడెంట్ షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు.
వైద్యంతో పాటు పౌష్టికాహారం అందించాలి
భద్రాచలం, వెలుగు: ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యంతో పాటు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శుక్రవారం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న వంట గది షెడ్ పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని వార్డులను తనిఖీ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న మార్చురీలో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. అనంతరం మీటింగ్ హాలులో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.రవిబాబు, డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పీహెచ్‌సీల్లో నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరుగుతుంటే, ఏరియా ఆసుపత్రిలో తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే గైనకాలజిస్టులను నియమించుకోవాలని అన్నారు. ఏజెన్సీలో పని చేసే వైద్యులకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలని, వారందరికీ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రామకృష్ణ, డాక్టర్లు పాల్గొన్నారు.
ఆసుపత్రుల్లో సౌలతులు కల్పిస్తాం
బూర్గంపహాడ్: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వసతులు కల్పిస్తామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం బూర్గంపహాడ్ క్లస్టర్ ఆసుపత్రిలో ఎన్సీడీ క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బూర్గంపహాడ్ ఆసుపత్రిలో కొత్తగా డాక్టర్లను కేటాయించామని, అన్ని రకాల వైద్య పరీక్షలు ఆసుపత్రిలో నిర్వహిస్తారని తెలిపారు. మండల ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీసీహెచ్ఎస్ డా. రవిబాబు, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, సూపరింటెండెంట్ డా.నవీన్, సర్పంచ్ సిరిపురపు స్వప్న, వైద్యులు
పాల్గొన్నారు.
పోడు సర్వే చేయాలి
చండ్రుగొండ, వెలుగు: మండలంలోని సీతాయిగూడెం గ్రామంలో పోడు భూముల సర్వే చేయాలని శుక్రవారం పోడుదారులు డిమాండ్ చేశారు. 2005 కంటే ముందు నుంచి 50 ఎకరాల్లో పోడు భూమి సాగు చేస్తున్నామని తెలిపారు. మూడేండ్ల కింద ప్లాంటేషన్ పేరుతో తమ భూములను బలవంతంగా తీసుకున్నారని వాపోయారు. ఇప్పుడు సర్వే చేయమంటే ప్లాంటేషన్ ఉందనే కారణం చెబుతున్నారని బాధితులు నర్సింహ, వెంకటమ్మ, వెంకటేశ్వర్లు, నాగేశ్వరావు తెలిపారు.
పొంగులేటి పరామర్శ
ఎర్రుపాలెం, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మధిర, ఎర్రుపాలెం మండలాల్లో పర్యటించి పలువురిని పరామర్శించారు. బొమ్మెర రామ్మూర్తి, కోట రాంబాబు, జడ్పీటీసీ కవిత, మాజీ జడ్పీటీసీ శీలం నాగిరెడ్డి, అంకసాల శ్రీనివాసరావు, అక్కమ్మ, మొగిలి అప్పారావు పాల్గొన్నారు.
ప్రతీ వడ్ల గింజను కొంటాం
నేలకొండపల్లి, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పైనంపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 220 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ వీపీ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ ఎన్ మధుసూధన్, డీఆర్డీవో విద్యాచందన, డీసీఎస్ఓ రాజేందర్, డీఎం సీఎస్ సోములు, జడ్పీ వైస్ చైర్ పర్సన్ ఎం ధనలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీపీ రమ్య, సర్పంచ్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
కూసుమంచిలో..
మండలంలోని పాలేరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. డీఆర్డీవో విద్యాచందన, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూ రి శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యద ర్శులు వీరయ్య, ఎండీ ఆసిఫ్ పాషా
పాల్గొన్నారు.