రామయ్య భూములపై ‘డ్రోన్’ నజర్
భద్రాచలం,వెలుగు: ఏపీలో విలీనమైన ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి భూములను కాపాడేందుకు దేవస్థానం రంగంలోకి దిగింది. పురుషోత్తముడు అనే భక్తుడు సర్వే నెంబరు 1 నుంచి 101 వరకు ఉన్న 980 ఎకరాల భూమిని భద్రాద్రి రామయ్యకు విరాళంగా ఇచ్చారు. ఇపుడు ఆ భూములను ఏపీలోని అధికార పార్టీ నేతలు, మాఫియా కలిసి కబ్జా చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు ఇల్లు నిర్మించుకొని, ఇతరులను కూడా కబ్జాలకు ప్రోత్సహిస్తున్నాడు. దీనిపై దేవస్థానం ఈవో శివాజీ నేతృత్వంలో సిబ్బందిపలుమార్లు ఎటపాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఏపీలోని అధికార పార్టీ నేతలు వాటిని తొక్కిపెడుతున్నారు. కబ్జాదారులు, అధికార పార్టీ నేతలు దేవస్థానం సిబ్బందిని తిడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూముల రక్షణకు దేవస్థానం డ్రోన్ కెమెరాల సాయంతో భూమి మొత్తం రికార్డు చేయిస్తోంది. తమ వద్ద ఉన్న ఆధారాలతో పాటు ఫొటోలు, వీడియోలు కూడా కోర్టుకు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు.
పేట్రేగిపోతున్న మాఫియా..
ఏపీలోని ఓ ప్రజాప్రతినిధి అండదండలతో కబ్జాకోరులు, మాఫియా పేట్రేగిపోతోంది. అడ్డగోలుగా ఆక్రమణలకు పాల్పడడమే కాకుండా దేవస్థానం సిబ్బందివెళ్తే రాముడు లేడు.. దేవుడు లేడు.. భూములు కావాలంటే రాముడినే వచ్చి అడగమనండి.. అంటూ ఎగతాళి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. గోశాల నిర్మాణ ప్రదేశాల్లోకి కూడా వీరు చొరబడి బెంబేలెత్తిస్తున్నారు. 1867లో బ్రిటీషు వారి వద్ద పురుషోత్తముడు అనే భక్తుడు ఈ భూములు కొన్నట్లు రికార్డులు ఉన్నాయి. వాటిని రాముడికి ఆయన విరాళంగా ఇచ్చాడు. పాసు పుస్తకాలు కూడా భద్రాద్రి రాముడి పేరు మీదనే ఉన్నాయి. అయినా రాముడి భూములను యథేచ్ఛగా అక్రమించుకుంటోంది. అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో ఏపీ అధికారులు కూడా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో న్యాయపోరాటం కోసం సిద్ధమైన శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం స్వామి భూముల రక్షణ కోసం
నడుం బిగించింది.
ఈజీఎస్ పనులపై ఓపెన్ ఫోరం
ములకలపల్లి, వెలుగు: ఈజీఎస్ కింద మండలంలో రెండున్నరేండ్లుగా జరిగిన పనులపై గురువారం ఎంపీడీవో ఆఫీస్ వద్ద అధికారులు ఓపెన్ ఫోరం నిర్వహించారు. ఎంపీపీ నాగమణి, జడ్పీటీసీ సున్నం నాగమణితో పాటు సర్పంచులు హాజరై కూలీలు లేకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. అధికారుల తీరును నిరసిస్తూ గ్రామసభ నుంచి బహిష్కరించారు. రూ.23 కోట్ల పనులు నిర్వహించగా, కొన్ని గ్రామ పంచాయతీల్లో భారీగా అక్రమాలు జరిగాయని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. సోషల్ ఆడిట్ తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామసభ అర్థరాత్రి వరకు కొనసాగింది. అడిషనల్ డీఆర్డీవో ఆర్వీ సుబ్రహ్మణ్యం, సోషల్ ఆడిటర్ అనూష, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఏపీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
టేకులవాగు ఆయకట్టుకు సాగు నీళ్లు ఇవ్వాలి
చండ్రుగొండ,వెలుగు: టేకులవాగు ప్రాజెక్టు ఆయకట్టు పొలాలకు సాగు నీరు అందించాలని కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం టేకులవాగు ప్రాజెక్టును సందర్శించగా, రైల్వే లైన్ నిర్మాణం కారణంగా ఆయకట్టు పొలాలకు సాగు నీరు అందడం లేదని రైతులు, ఎల్ హెచ్ పీఎస్ లీడర్లు కంప్లైంట్ చేశారు. సాగు నీరందించేందుకు అవసరమైన పనుల ప్రపోజల్స్ ఇవ్వాలని ఇరిగేషన్ డీఈ కృష్ణ, ఏఈ నర్శింహారావులను ఆదేశించారు. రైల్వే లైన్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన పలువురు బాధితులు నష్టపరిహారం ఇప్పించాలని కోరగా, సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆర్డీవో వెంట ఎంపీపీ పార్వతి, తహసీల్దారు రవికుమార్, ఆర్ఐ ముత్తయ్య, ఎల్ హెచ్ పీఎస్ లీడర్లు జ్యోతి, రాంబాబు, రాజేశ్ నాయక్, రాముడు, బీలూ ఉన్నారు.
తొలిమెట్టును తేలిగ్గా తీసుకోవద్దు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: తొలిమెట్టు అమలులో నిర్లక్ష్యంగా ఉండవద్దని రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాసచారి సూచించారు. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు, పాల్వంచ మండలాల్లోని పలు స్కూల్స్‌ను గురువారం ఆయన సందర్శించారు. కొందరు పిల్లల్లో కనీస భాషా, గణిత సామర్థ్యాలు లేకపోవడం బాధాకరమని అన్నారు. తొలిమెట్టు ప్రోగ్రామ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని ఆదేశించారు. విద్యార్థుల ప్రగతిపై టీచర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల సామర్థ్యాలకు పదును పెట్టాలన్నారు. ఆయన వెంట డీఈవో సోమశేఖర శర్మ, జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ నాగరాజ శేఖర్, కో ఆర్డినేటర్ సైదులు, ఎంఈవోలు వెంకట్, శ్రీరామమూర్తి పాల్గొన్నారు.
స్టూడెంట్స్ కు బేసిక్స్ నేర్పకుంటే చర్యలు
చండ్రుగొండ: ఐదో తరగతి వరకు చదివే స్టూడెంట్స్ కు బేసిక్స్ నేర్పకుంటే టీచర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు. గురువారం మండలంలోని దామరచర్ల ప్రైమరీ స్కూల్ లో మనబడి పనులు, తొలిమెట్టు కార్యక్రమాన్ని పరిశీలించారు. మనబడి పనులను స్పీడప్ చేసి నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం చండ్రుగొండ పీహెచ్ సీని విజిట్ చేశారు. మెడికల్ ఆఫీసర్ లేకపోవడంతో డీఎంహెచ్ వో దయానంద స్వామికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోమియోపతి వైద్యశాలను పరిశీలించి మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ పేషెంట్ల కు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకొని అభినందించారు. కలెక్టర్ వెంట పీఆర్ ఈఈ సుధాకర్, డీఈ సత్యనారాయణ, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో అన్నపూర్ణ ఉన్నారు.
పంటలను పరిశీలించిన డీఏవో
కల్లూరు, వెలుగు: మండలంలోని చిన్న కోరుకొండి, లింగాల, పాయపూరు గ్రామాల్లో వరి, పత్తి, మిర్చి పంటలను జిల్లా వ్యవసాయాధికారి ఎం విజయనిర్మల, కృషి విజ్ఞాన కేంద్రం వైరా శాస్త్రవేత్తలు డాక్టర్ హేమంత్ కుమార్, డాక్టర్ రవికుమార్, చైతన్య, ఫణి శ్రీ, ఏవో ఎం రూప పరిశీలించారు. వరి పంటలో బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు, మిర్చిలో కొమ్మ కుళ్ల తెగులు, పత్తిలో రసం పీల్చే పురుగు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, తలమాడు, కాయ కుళ్లు, పోషక లోపాలను గుర్తించారు. ఏఈవోలు కె నరేశ్, కె వెంకటేశ్, ఎస్కే హుస్సేన్, ఎం పవన్ కల్యాణ్, సర్పంచ్ నామారాధమ్మ, రైతులు దేవరపల్లి శ్రీనివాసరావు, మద్దినేని సత్యనారాయణ, కట్టా వెంకటేశ్వరరావు, నామ వెంకటేశ్వరరావు, రావూరి అంజయ్య, మద్దినేని లోకేశ్వరరావు పాల్గొన్నారు.
- కేటీపీఎస్ లో ఉద్యోగాలు ఇవ్వాలి
- రైల్వే ట్రాక్‌పై బాధితుల బైఠాయింపు
పాల్వంచ, వెలుగు: కేటీపీఎస్‌లో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆరుగురు భూ నిర్వాసితులు రైల్వే ట్రాక్‌పై బైఠాయించి నిరసన తెలిపారు. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్‌కు బొగ్గు రవాణా చేసేందుకు 2012లో 17 మంది గిరిజనుల నుంచి భూములు సేకరించిన జెన్కో యాజమాన్యం 11 మందికి ఆర్టిజన్లుగా అవకాశం కల్పించిందని, మిగిలిన తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న కేటీపీఎస్ అధికారులు ఆందోళనకారులకు సర్ది చెప్పి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. గుగులోత్ రవి, గోపి, ఇస్లావత్ కుమార్, జర్పుల హరి, ధర్మసోత్ హరి పాల్గొన్నారు.
కోల్ ఇండియా పోటీల్లో గెలవాలి
మణుగూరు, వెలుగు: సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న కోల్ ఇండియా క్రీడా పోటీల్లో మణుగూరు కార్మికులు విజయం సాధించాలని ఇన్చార్జి ఎస్ఓటు జీఎం ఎండీ రజాక్ పాషా అన్నారు. మణుగూరు భద్రాద్రి స్టేడియంలో నియర్ బై అథ్లెటిక్ పోటీలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియర్ బై పోటీల్లో ఇల్లందు ఏరియా నుంచి సింగరేణి ఉద్యోగులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగం చేస్తూ క్రీడల్లో రాణించడం స్ఫూర్తిదాయకమన్నారు. క్రీడా పోటీల్లో ఎవరు గెలిచినా సింగరేణి సంస్థ గెలిచినట్లేనని, కార్మికులు అదే స్ఫూర్తితో పాల్గొనాలని సూచించారు. డీజీఎం పర్సనల్ రమేశ్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ రామేశ్వరరావు, స్పోర్ట్స్ సూపర్వైజర్ జాన్ వెస్లీ పాల్గొన్నారు.
సింగరేణిలో సేఫ్టీ టీమ్ పర్యటన
మణుగూరు, వెలుగు: మణుగూరు సింగరేణి ప్రాజెక్టులో 53వ రక్షణ వారోత్సవాల సందర్భంగా సేఫ్టీ టీమ్ గురువారం పర్యటించింది. ట్రాన్స్పోర్ట్, కన్వేయర్ జీఎం ఎస్ దామోదర్ రావు ఆధ్వర్యంలో ఏరియా వర్క్ షాప్ ను తనిఖీ చేసిన అనంతరం సింగరేణి సేఫ్టీ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణికి ప్రొడక్షన్, సేఫ్టీ రెండు కళ్లలాంటివని రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని కార్మికులకు సూచించారు. మణుగూరు జీఎం వెంకటేశ్వర్ రెడ్డి, ఏజీఎం ఫిట్జ్ గెరాల్డ్, ఏఎస్వో వెంకటరమణ, డీజీఎం నర్సిరెడ్డి, ఎస్ఈ షేక్ కరీముల్లా, నటరాజ్ ప్రసాద్
పాల్గొన్నారు.
టీఎన్జీవోస్ జిల్లా కమిటీ ఎన్నిక
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: టీఎన్జీవోస్ జిల్లా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా సంగం వెంకటపుల్లయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్లుగా కె. సుధాకర్, డి దస్రు, ఉపాధ్యక్షులుగా ఎం. రమేశ్‌బాబు, నరేందర్‌రెడ్డి, సీహెచ్ శ్రీనివాసరావు, జె మరియన్న, కె కనకదుర్గ, సెక్రటరీగా పి విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీలుగా ఐ నాగేశ్వరరావు, బి గన్యా, బి శ్రీనివాసరావు, ఎం రామారావు, బి సులోచనారాణి, కోశాధికారిగా కె. వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె పోచాల్రావు, ఎ బాలకృష్ణ, జి. రమేశ్, టి ముత్తయ్య, పబ్లిసిటీ సెక్రటరీలుగా ఎస్ శ్రీనివాసరావు, ఎస్ చంద్రమోహన్, ఆఫీస్ సెక్రటరీగా బి నాయి నారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సీహెచ్ శ్రీకాంత్, పి వసంతకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
‘డబుల్’ ఇండ్ల కోసం నిరసన దీక్ష
భద్రాచలం, వెలుగు: మనుబోతుల చెరువు వద్ద నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లను నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మహాజన సోషలిస్టు పార్టీ(ఎమ్మెస్పీ) ఆధ్వర్యంలో గురువారం నిర్మాణంలో ఉన్న డబుల్బెడ్రూం ఇండ్ల వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని కోరారు. సీపీఐ పట్టణ నాయకులు సాయికుమార్, ప్రజాపంథా నాయకులు కెచ్చెల కల్పన సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్‌యాదవ్ దీక్షా శిబిరానికి చేరుకొని మాట్లాడారు. గతంలో మనుబోతుల చెరువు వద్ద ఇండ్ల స్థలాల కోసం ఆందోళన చేసిన వారికి ఇండ్ల కేటాయింపులో అవకాశం ఇవ్వాలని ఆందోళనకారులు కోరారు. అర్హులైన వారికి ఇండ్లు కేటాయిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చి వినతిపత్రం స్వీకరించారు. ఎమ్మెస్పీ నియోజకవర్గ కన్వీనర్ సోమక నరేశ్‌కుమార్, మండల కన్వీనర్ బొడ్డు సత్యనారాయణ పాల్గొన్నారు.