ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, కాంట్రాక్టర్లు, ఏపీ వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేసి కేసీఆర్ కుటుంబం వందల కోట్లు దోచుకుందని బీజెపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం బీజేపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంతో పాటు వివిధ పార్టీల నుంచి వచ్చిన తెలంగాణ ద్రోహులంతా కలిసి రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. ఎనిమిదేండ్లలో రాష్ట్ర రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏ రాజకీయ పార్టీకి లేని విమానం కేసీఆర్‌కు ఎందుకని ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లా ఇన్చార్జినన్నె ఉదయ్‌ప్రతాప్, గెంటెల విద్యాసాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రుద్ర ప్రదీప్, నున్నా రవికుమార్, చంద్రశేఖర్, మారుతి, వీరభద్రం, వెంకటనారాయణ, ఎల్లారావు గౌడ్,రవి రాథోడ్, వీరూగౌడ్, దొడ్డా అరుణ, చావా కిరణ్, ఉపేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
మైనారిటీలంటే లెక్కలేదా?
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆఫీసర్ల తీరుపై జాతీయ మైనార్టీ కమిషన్ మెంబర్ షహజాది ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కొత్తగూడెం కలెక్టరేట్లో శుక్రవారం ఆమె రివ్యూ నిర్వహించారు. సరైన రిపోర్టులు లేకుండా మీటింగ్‌కు రావడం పట్ల అమె అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి తరుచూ ఫోన్లో మాట్లాడడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా చేయాల్సిన పనులు కూడా అధికారులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు రిపోర్టులు తయారు చేసుకొచ్చినట్లు ఉందన్నారు. చిన్న చిన్న పనులు కూడా జిల్లా మైనార్టీ ఆఫీస్‌లో కాకపోవడంతోనే తమ వద్దకు వస్తున్నాయన్నారు. మైనార్టీ రుణాలు, గురుకులాల మెనూ, మజీదుల రిజిస్ట్రేషన్, వక్ఫ్ బోర్డు, షాదీఖానా భూముల ఆక్రమణల విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలోని జామా మజీదుకు పూర్తి స్థాయి కమిటీ వేసేందుకు ఈ నెల 18న ముస్లీంలతో సమావేశం నిర్వహించి రిపోర్టు తనకు పంపాలని మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సంజీవరావును ఆదేశించారు. ప్యూన్ బస్తీలో ఆక్రమణలకు గురైన షాదీఖానా భూమిపై 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రధాన మంత్రి 15 సూత్రాల పథకం అమలుకు కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ వేయాలని సూచించారు. ఆఫీసర్ల పనితీరు సరిగా లేకపోవడంతోనే ప్రభుత్వం నుంచి ఆర్థిక వనరులు రావడం లేదన్నారు. మైనార్టీల సమస్యలంటే లెక్కలేకుండా పోయిందా అంటూ అసహనం వ్యక్తం చేశారు. వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్తో పాటు పలువురు ఆఫీసర్లు మీటింగ్‌కు రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఢిల్లీకి పిలుస్తామని హెచ్చరించారు. ఆర్డీవో స్వర్ణలత మీటింగ్‌కు రాకుండా టూర్ అంటూ వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఆర్డీవోను మీటింగ్‌కు రావాలని ఆదేశించడంతో ఆ తరువాత వచ్చారు. కొత్తగూడెంలో ఖబ్రస్థాన్‌కు స్థలం కేటాయించాలని, లోన్లు రావడం లేదని ముస్లీం పెద్దలు, మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెదృష్టికి తీసుకెళ్లారు. అడిషనల్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, ఏఎస్పీ ఆకాంక్ష యాదవ్, డీఆర్వో అశోక్ చక్రవర్తి, డీఈవో సోమశేఖర శర్మ, ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మి, ఎల్డీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రామాల్లో రాపిడ్ ఫీవర్ సర్వే
ములకలపల్లి,వెలుగు: మంగపేట వీహెచ్సీ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు శుక్రవారం గ్రామాల్లో రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ జ్వరాలు, ఇతర సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని మందులు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని విజయపురి కాలనీతో పాటు సుందరయ్యనగర్, రాజుపేట తదితర గ్రామాల్లో ఫీవర్ సర్వేను నిర్వహించి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి అలవాల కృపానందం కళాబృందం వ్యాధులపై అవగాహన కల్పించారు. వెంకటేశ్వర్లు, గురవయ్య, కె.జాన్, అజయ్, మూస, మరియమ్మ, కోనర్, ఎస్ అంజలి, ముత్యం పాల్గొన్నారు.
సీపీఐ నాయకులపై ఏసీపీకి ఫిర్యాదు
ఖమ్మం రూరల్, వెలుగు: గత మూడేండ్లుగా టీఆర్ఎస్ నాయకులపై సీపీఐ నాయకులు, కార్యకర్తలు భౌతికదాడులకు దిగుతూ బెదిరిస్తున్నారని రూరల్ టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం అడిషనల్ సీపీ బోస్‌కు విపతిపత్రం అందజేశారు. మండలంలోని ఏదులాపురం గ్రామంలో అరాచకాలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిత్యం గొడవలు సృష్టిస్తూ ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆరోపించారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ నాయకులు వెంపటి రవికుమార్, ఎస్కే మహబూబ్ అలీ, వెంపటి ఉపేందర్, రామిశెట్టి రమేశ్, వడ్లకొండ భుజంగరావు, నారపాటి రమేశ్, వెంపటి వీరన్న, మెట్టి వీరయ్య, మిరియాల వరుణ్ తేజ్, చక్రాల నాగేశ్వరావు, తమనబోయిన ఫణీంద్ర, పొన్నెకంటి నారాయణ ఉన్నారు.
మునుగోడులో టీఆర్ఎస్దే గెలుపు
ఖమ్మం, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తంచేశారు. మునుగోడులో పార్టీ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి సీఎం కేసీఆర్ తో కలసి పని చేశారని గుర్తు చేశారు. మునుగోడు ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించి, అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు.
మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో ఆందోళన
అశ్వారావుపేట, వెలుగు: వారం రోజులుగా మంచినీళ్లు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో హైవేపై ఆందోళనకు దిగారు. మండలంలోని పేరాయిగూడెం గ్రామపంచాయతీలో వారం రోజులుగా మంచినీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం నేషనల్ హైవేపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఒప్పుకోలేదు. సర్పంచ్ నార్లపాటి సుమతి, సెక్రటరీ శ్రీరాంమూర్తి సిబ్బందితో కలిసి పైప్ లైన్ రిపేర్ చేయించడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
అంగన్వాడీ కేంద్రాల తనిఖీ
పాల్వంచ, వెలుగు: మండలంలోని అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం సీడీపీవో కే కనకదుర్గ తనిఖీ చేశారు. మారుమూల గిరిజన గ్రామాలైన మామిడిగూడెం, బంజరు సత్యనారాయణపురం, రాజాపురం, మందేరి కలపాడు కేంద్రాలను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సెంటర్లను తెరిచి ఉంచాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రిన్సిపాళ్లతో గురుకులాల ఆర్సీవో జూమ్ మీటింగ్
భద్రాచలం,వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో పార్ట్ టైం జేఎల్ఎస్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 10న నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాట్లపై ప్రిన్సిపాళ్లతో ఐటీడీఏ ఏపీవో, గురుకులాల ఆర్సీవో డేవిడ్‌రాజు శుక్రవారం జూమ్‌లో రివ్యూ చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. అభ్యర్థులను మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
‘విగ్రహాలను తొలగించొద్దు’
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన గాంధీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాల తొలగింపును మానుకోవాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావీద్ కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభికి శుక్రవారం వినతిపత్రం అందించారు. డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్పొరేటర్ మంజుల, ముస్తఫా, మిక్కిలినేని నరేందర్ పాల్గొన్నారు.
కాపర్ వైర్ దొంగల అరెస్ట్
అశ్వారావుపేట, వెలుగు: పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్‌ను ఎత్తుకెళ్లిన దొంగలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ బొమ్మెర బాలకృష్ణ తెలిపారు. ఏపీలోని ఏలూరు జిల్లా జీనుగుమిల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషిషన్ పోతురాజు అశోక్, కిరణ్, మరో మైనర్ బాలుడు టూ వీలర్ పై వస్తూ ఎస్సై అరుణ వెహికల్ చెకింగ్ చేస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. వారి నుంచి కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దమ్మపేట, అశ్వరావుపేట, అశ్వాపురం, జూలూరుపాడు, బూర్గంపాడు మండలాల్లో చోరీలు చేశారని, కాపర్ వైర్ విలువ రూ.1.10 లక్షలు ఉంటుందని చెప్పారు. కాపర్ వైర్ ను అశ్వరావుపేటకు చెందిన కాకి మంగిరెడ్డికి అమ్మినట్లు గుర్తించామని అన్నారు.