మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో శాటిలైట్ ద్వారా సర్వే చేయిస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి ముంపు సమస్యను పరిష్కరిస్తామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్చెప్పారు. మంగళవారం పట్టణంలోని పాలకొండ, క్రిస్టియన్‌పల్లి, పాత పాలమూరు, బీకే రెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, హనుమాన్‌పుర, బండమీదిపల్లి, మేకలబండ, రామయ్య బౌలి, గౌడ్స్ కాలనీ, హబీబ్‌నగర్, గణేశ్‌నగర్, బోయపల్లి, న్యూ మోతినగర్, ఓల్డ్ మోతినగర్, క్రిస్టియన్ కాలనీ, పాల్సాబ్ గుట్టకు చెందిన లబ్ధిదారులకు కొత్త పింఛన్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటి ప్రవాహం సాఫీగా ఉండేలా యంత్రాంగం లెవెల్స్ చెక్ చేస్తోందని చెప్పారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసులో హన్వాడ మండలం కొనగంటిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చెన్నయ్య , మహబూబ్‌నగర్ మండలం ధర్మాపూర్ ఎంపీటీసీ రవీందర్‌రెడ్డితో పాటు 150 మంది కాంగ్రెస్, బీజేపీ లీడర్లు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయండి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. మంగళవారం రెవెన్యూ మీటింగ్ హాల్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు, షెడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు ఫైర్ ఇంజన్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్ సౌకర్యం కల్పించాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటల పాటు విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. మహబూబ్ నగర్, అమ్మాపూర్, కొత్తకోట, అమ్మాపూర్ రోడ్లపై ఎక్కడైన గుంతలు ఉంటే పూడ్చాలని ఆర్అండ్‌బీ అధికారులను ఆదేశించారు. జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్ రావు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
రైల్వే గేట్ల స్థానంలో అండర్ పాస్‌లు
అలంపూర్, వెలుగు: రైల్వే గేట్లు తొలగించి అండర్ పాస్‌లు ఏర్పాటు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ శరత్ చంద్రయాన్ చెప్పారు. మంగళవారం జోగులాంబ రైల్వే స్టేషన్ పరిశీలనకు వచ్చిన ఆయనకు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాన రోడ్లపై రైల్వే గేట్లు ఉన్న చోట వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, అండర్ పాసులతో ఆ సమస్య తీరుతుందన్నారు. రూ. 5కోట్ల నుంచి 6 కోట్ల ఎస్టిమేషన్లతో నిర్మాణాలు చేసేలా ప్లాన్ రెడీ చేశామని చెప్పారు. రైల్వే శాఖ పరిధిలో ఉన్న భూమిలోనే వీటిని ఏర్పాటు చేస్తామని రైతుల నుంచి స్థలాన్ని సేకరించాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌లో రోడ్డులో ఆర్‌యూబీకి బదులుగా ఆర్‌వోబీని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. జోగులాంబ టెంపుల్‌కు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారని, వారిని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేయాలని కోరారు.
భూసేకరణ పనులు స్పీడప్ చేయాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: సాగునీటి ప్రాజెక్టులు, నేషనల్ హైవే, రైల్వే కింద చేపట్టిన భూసేకరణ పనులను స్పీడప్ చేయాలని కలెక్టర్ ఎస్ .వెంకటరావు ఆదేశించారు. మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్‌ఎల్‌ఐ కింద పునరాస కేంద్రాలకు సంబంధించిన భూసేకరణపై నివేదిక ఇవ్వాలని సూచించారు. కోయిల్ సాగర్ భూసేకరణలో వేగం పెంచాలని, అవార్డు పాస్ చేసేందుకు సేల్స్ వివరాలను కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కె.సీతా రామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్ పాల్గొన్నారు.
ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి
గద్వాల టౌన్, వెలుగు: వేధింపులు, దాడులకు ఆడపిల్లలు భయపడొద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సీనియర్ సివిల్ జడ్జి కవిత దేవి సూచించారు. మంగళవారం ప్రపంచ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బాలికల హైస్కూల్లో మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్‌కు జడ్జి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు స్టూడెంట్ దశ నుండే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు సాధన చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పేరెంట్స్, టీచర్లకు ధైర్యంగా చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ వరలక్ష్మి దేవి, లీగల్ సర్వీసెస్ మెంబర్స్, టీచర్స్ పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జోడోయాత్రనారాయణపేట, మక్తల్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ చెప్పారు. నారాయణ పేట సీవీఆర్ భవన్, మక్తల్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన భారత్ జోడో యాత్ర సన్నాహక సమావేశంలో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నా రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లురవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోడో యాత్ర ఈనెల 23 న జిల్లాలో ప్రవేశిస్తుందని, ప్రతి నియోజకవర్గం నుంచి 25 వేలకు తగ్గకుండా నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని సూచించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రంలోనూ అదే స్థాయిలో సక్సెస్ చేయాలని కోరారు. మత రాజకీయాలతో ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కార్యకర్తలు పోరాటం చేయాలన్నారు. ఈ నెల 15న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో సన్నాహక సమావేశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, డీసీసీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్, వాకిటి శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు చిట్టెం అభిజయ్ రెడ్డి , సంజీవ్ ముదిరాజ్, సుగప్ప ముదిరాజ్, నేతలు గౌస్, సుధాకర్, సదాశివ రెడ్డి, నరహరి, బాలరెడ్డి, శ్రీనివాస్, కౌన్సిలర్ సలీం, లిఖి రఘు, యువజన కాంగ్రెస్ అద్యక్షుడు కోట్ల రవీందర్ రెడ్డి, వార్ల విజయ్ కుమార్ పాల్గొన్నారు.
కార్యకర్తలపై చేయి వేస్తే ఊరుకోం
అచ్చంపేట, వెలుగు: టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరుతున్న కార్యకర్తలను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, ఒక్క కార్యకర్తపై చేయి వేసినా కాలుచేయి తీసేస్తామని బీజేపీ నేత దేవని సతీశ్ మాదిగ హెచ్చరించారు. మంగళవారం బల్ముర్ మండలం మహదేవపురంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహదేవ్ పూర్, గట్టు తుమ్మెన్ గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెందిన 35 మంది, నడింపల్లికి 200 మంది పార్టీలో చేరారు. అనంతరం సతీశ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ తీసుకొచ్చి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు బాలాజి, శ్రీనునాయక్, పెద్దయ్య యాదవ్, కుర్మయ్య, అజయ్, అనిల్, హరీశ్, తిరుపతి, వరుణ్, మల్లేశ్, అఖిల్, విష్ణు, అంజి, రామ్ చరణ్, రాఘవేంద్ర, చరణ్, విష్ణు, ప్రవీణ్, అవంచ సైదులు, మల్లయ్య, వెంకటయ్య, బాలరాజు, వెంకటేశ్, రవి పాల్గొన్నారు.
పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి
పెద్దమందడి, వెలుగు: తల్లితండ్రులు పిల్లలు కోరిన చిరు తిండిని అందిస్తున్నారే తప్ప పోషకల విలువలు ఉన్నాయో.. లేదో.. చూడడం లేదని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మంగళవారం మండలంలోని చిన్న మందడి స్కూల్ విద్యార్థులకు అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పౌష్టికాహార లోపంతో ఎదుగుదల ఉండదని, జ్ఞాపకశక్తి తగ్గుతుందన్నారు. ఇది గుర్తించి చిన్నమందడి సర్పంచ్ సూర్య చంద్రారెడ్డి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని అభినందించారు. అనంతరం అంగన్‌వాడీ సెంటర్‌ను సందర్శించారు. కొందరు పిల్లల్లో రక్తహీనత గమనించిన ఆమె.. బాలామృతం అందించడం లేదా..? అని అంగన్వాడీ టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా బాలామృతం ఇవ్వాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో హైజీనిక్ కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, డీఈవో రవీందర్, సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంఈవో జయశంకర్, ఆర్ఐ తిరుపతయ్య పాల్గొన్నారు.
ప్రమాదాలు జరగకుండా చూడాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో రోడ్డు భద్రత జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ల రిపేర్లపై అధికారులను ప్రశ్నించగా.. పీఆర్ రోడ్లకు 21 పనులకు గాను రూ.19.12 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు.
నాలుగింటి టెండర్లు పూర్తి కాగా.. మిగిలిన వాటికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ యేడాది 130 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 141 మంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపై గుంతలు పడ్డాయని వాటిని గుర్తించి రిపేర్లు చేయాలన్నారు. రఘుపతి పేట, తెలకపల్లి రోడ్డుకు మళ్లీ రిపేర్లు చేసేలా ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల ఇంజనీర్లు భద్రతను గాలికి వదిలేసారని అగ్రహం వ్యక్తం చేశారు. రాత్రిపూట కనిపించే సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఎందుకు ఏర్పాటు చేయడం
లేదని డీజీఎం అశోక్ రెడ్డిని ప్రశ్నించారు. ఏర్పాటు చేయకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎమ్మెల్యే దత్తత గ్రామంలో పింఛన్ల పంపిణీ
ఊట్కూర్, వెలుగు: ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దత్తత గ్రామమై ఊట్కూర్ మండలం ఓబ్లాపూర్‌లో మంగళవారం సర్పంచ్ శంకరం, ఉపసర్పంచ్ వెంకటేశ్ గౌడ్ ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 27 మందికి కొత్త పింఛన్లు మంజూరు కాగా.. 24 మందికి అందించామని చెప్పారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని, రూ. 18 లక్షలతో డ్రైనేజీ , బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. సబ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే త్వరలోనే ఓపెన్ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్లప్ప, నేతలు భీమయ్యగౌడ్, వెంకటప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు అరికట్టాలి
గద్వాల, వెలుగు: బాలికలపై లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని గట్టు మండలం ఆలూరులో నిర్వహించిన విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక మాట్లాడుతూ తనకు పెళ్లి చేస్తామని అంటున్నారని, 1098కు ఫోన్ చేసి చేస్తే వాళ్లు వచ్చి పెళ్లి ఆపించారని కలెక్టర్‌కు చెప్పింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల కట్టడికి గ్రామ పెద్దలు సర్పంచ్, అంగన్‌వాడీ టీచర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం స్కూల్‌ను తనిఖీ చేసి.. ఆవరణను క్లీన్ చేయాలని హెచ్‌ఎం భాస్కర్ పాపన్నను ఆదేశించారు. అలాగే అంగన్వాడీ సెంటర్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పిల్లల ఎత్తు, బరువును స్వయంగా కొలిచారు.