ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

నెట్​వర్క్​, వెలుగు:  విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని మంత్రి హరీశ్​రావు అన్నారు. శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసు అమరవీరుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కవాతులు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.  సిద్దిపేట పోలీస్ కమిషనరేట్​లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హరీశ్​రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  దేశంలో 264 మంది పోలీసులు విధినిర్వహణలో ప్రాణాలు వదిలారన్నారు. రాష్ట్రంలో అమరులైన పోలీసు  కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.  సీపీ ఎన్.శ్వేత, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు ముజమిల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్​లో ఎస్పీ రోహిణి, అడిషనల్​కలెక్టర్​ ప్రతిమాసింగ్​, అడిషనల్​ఎస్పీ డాక్టర్​బాలస్వామి, సంగారెడ్డిలో ఎస్పీ రమణ కుమార్​, డీఎస్పీలు, సీఐలు,  హుస్నాబాద్​లో మున్సిపల్​చైర్​పర్సన్​రజిత, ఏసీపీ సతీశ్​, నారాయణఖేడ్​లో డీఎస్పీ బాలాజీ, సీఐ రామకృష్ణారెడ్డి, గజ్వేల్​లో ఏసీపీ రమేశ్​, మున్సిపల్​ చైర్మన్​ రాజమౌళి గుప్త పోలీస్​అమరులకు నివాళి అర్పించారు. 

ఈ నెల 26 నుంచి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్ ​జిల్లాలో ఈ నెల  26  న కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు  అడిషనల్​కలెక్టర్ రమేశ్​ తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్​లో ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  జిల్లాలో 384 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో –104, ఫ్యాక్స్​– 270, డీసీఎమ్ఎస్–​6, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్  ద్వారా 4  ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.  ప్రతి కేంద్రంలో టార్పాలిన్లు, ప్యాడీక్లీనర్, తేమను కొలిచే మెషిన్లు, డిజిటల్ కాంటాలు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పంట దిగుబడి బాగా వచ్చే అవకాశముందని, సరిపోను సిబ్బందిని నియమించుకుని రైతులకు ఇబ్బంది లేకుండా వడ్లు కొనుగోళ్లు చేయాలన్నారు.  జిల్లాలో ఉన్న 76 మంది అగ్రికల్చర్​ఆఫీసర్లు రైతులకు వడ్లు ఎప్పుడు కొనుగోలు కేంద్రాలకు తేవాలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.  అంతకు ముందు ప్రజావాణి హాల్​లో రైస్  మిల్లుల యజమానులతో జరిగిన మీటింగ్​లో అడిషనల్​కలెక్టర్​మాట్లాడుతూ గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి  సీఎమ్ఆర్ రైస్​ను ఎఫ్​సీఐకి ఇవ్వాలని, అప్పుడే వడ్లు నిలువ చేసేందుకు మిల్లుల్లో స్థలం ఉంటుందని అన్నారు.  సివిల్​సప్లై ఆఫీసర్​శ్రీనివాస్​, డీసీవో కరుణ, డీఆర్​డీవో శ్రీనివాస్​, మేనేజర్ గోపాల్,  ఆర్డీవో సాయిరామ్​, అగ్రికల్చర్​ఆఫీసర్​ఆశ తదితరులు పాల్గొన్నారు.

ఓటరు నమోదుపై మీటింగ్​

మెదక్​ జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడంలో, ఓటర్ కార్డుకు ఆధార్​ను అనుసంధానం చేయడంలో కృషి చేయాలని జిల్లా అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​అన్నారు. శుక్రవారం పోలింగ్​సెంటర్ల రేషనలైజేషన్​పై రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్​మాట్లాడుతూ ఒక పోలింగ్ బూత్​లో 1,500 ఓటర్ల కంటే ఎక్కువ ఉంటే మరో బూత్​ను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఆ పరిస్థితి లేదన్నారు. ఓటు వినియోగంలో అవకతవకలు అరికట్టడంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించిందన్నారు. జిల్లాలో 4,06,160 మంది ఓటర్లు  ఉన్నారన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలు, తొలగింపుల అనంతరం నవంబర్ 9న డ్రాఫ్ట్ లిస్ట్​ఇస్తామని, 10 నుంచి డిసెంబర్ వరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా  ఓటరు నమోదు ఉంటుందని అడిషనల్​ కలెక్టర్​ వివరించారు. సమావేశంలో మెదక్​ ఆర్డీవో సాయిరామ్​,  స్వీప్ నోడల్ ఆఫీసర్​ రాజిరెడ్డి,  ప్రజాప్రతినిధులు అఫ్జల్, మహమ్మద్ ఇస్మాయిల్,  నర్సింలు,  ఉదయ్​కిరణ్​ పాల్గొన్నారు.
 

అట్రాసిటీ కేసులను పెండింగ్​పెట్టొద్దు

సిద్దిపేట రూరల్, వెలుగు:  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పెండింగ్ లో ​పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఆఫీస్​లో ఎస్సీ వెల్ఫేర్​శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్​కు కలెక్టర్​హాజరయ్యారు. జిల్లాలో నమోదైన  అట్రాసిటీ కేసులు, వాటి పరిష్కారం కోసం తీసుకున్న చర్యల గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులను రూపుమాపాలనే ఉద్దేశంతో  జిల్లా అంతటా.. 6 నెలలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు పరిష్కరించాలని ఆదేశించారు.  సీపీ. ఎన్. శ్వేత, అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,  డీఆర్వో చెన్నయ్య, ఆర్డీవోలు పాల్గొన్నారు.

బిల్లుల విషయంలో అపోహలు పెట్టుకోవద్దు..

కాంట్రాక్టర్లు బిల్లుల విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, త్వరగా పనులు పూర్తి చేస్తే వెంటనే నిధులు విడుదలయ్యేలా చూస్తానని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం చేర్యాల, దుళ్మిట్ట, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లో ‘మన ఊరు మన బడి’ పనులపై కలెక్టరేట్  ఆఫీస్​లో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు మన బడి పథకంలో ఎంపికైన స్కూళ్లలో ఇప్పటి వరకు జరిగిన పనులకు 3 రోజుల్లోగా అందరు ఈఈ, డీఈ, ఏఈల పర్యవేక్షణలో రికార్డ్ చేసి  ఆన్​లైన్​చెయ్యాలని అధికారులను ఆదేశించారు. 

పెండింగ్ పనులను పూర్తి చేయించాలి

జహీరాబాద్, వెలుగు: అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం జహీరాబాద్ మున్సిపల్  మీటింగ్ హాల్లో నియోజకవర్గ అభివృద్ధిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్లు, భవనాలు, స్మశాన వాటికలు, ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.  పథకాల అమలులో అలసత్వం పనికిరాదని, పథకాలు పక్కాగా అమలయ్యేలా  చూడాలని ఆదేశించారు. మండలాల వారీగా అభివృద్ధి పనుల పనితీరును సంబంధిత శాఖల అధికారులను  అడిగి తెలుసుకున్నారు.  అడిషనల్​కలెక్టర్లు రాజార్షి షా, వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య,  ఆర్డీవో రమేశ్ బాబు, మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు

‘తపస్’ జిల్లా అధ్యక్షుడిగా ఎల్లం

మెదక్, వెలుగు: తెలంగాణ  ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్​) మెదక్ జిల్లా కొత్త అధ్యక్షుడిగా జిద్ది ఎల్లం, ప్రధాన కార్యదర్శిగా చల్లా లక్ష్మణ్​ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మెదక్ లో జరిగిన యూనియన్​ జిల్లా కార్యవర్గ సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు.  ఈ సందర్భంగా  తపస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్​ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలూ.. తెలంగాణలోనూ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  టీచర్ల సమస్యల  పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విద్యాబోధనలో సమూల మార్పులు తీసుకురావాల్సింది పోయి కనీస సౌకర్యాలు  కల్పించలేని స్థితికి  రాష్ట్ర ప్రభుత్వం దిగజారి పోయిందన్నారు.  తపస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాగి రాములు, రాష్ట్ర కార్యదర్శి దుభాషి భాస్కర్ పాల్గొన్నారు. 


మర్డర్ కేసు మిస్టరీని ఛేదించిన ఖేడ్ పోలీసులు 

నారాయణ్ ఖేడ్, వెలుగు:  మండలంలోని హనుమంతరావు పేట లో రెండు రోజుల కింద జరిగిన మర్డర్ కేసు మిస్టరీని ‘ఖేడ్’ పోలీసులు ఛేదించారు. డీఎస్పీ బాలాజీ వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన సామల దుర్గమ్మ( 55)  ఒంటరిగా నివసిస్తోంది.   దుర్గమ్మ వద్ద ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లేందుకు అదే గ్రామానికి చెందిన లాల్ రాజ్, సాయిలు, దేవయ్య ప్లాన్​వేసుకున్నారు. ఈ  క్రమంలో ఈ నెల 18న ముగ్గురు కలిసి మద్యం తాగి దుర్గమ్మ  ఇంటికి దొంగతనానికి వెళ్లారు. దుర్గమ్మ ప్రతి ఘటించటంతో గొంతు నులిమి చంపేసి, ఆమె చీరను మెడకు చుట్టి  ఇంట్లోని దూలానికి వేలాడదీసి, నగలు, నగదు దోచుకుని వెళ్లిపోయారు. తల్లిది ఆత్మహత్య కాదని అనుమానించిన కొడుకు రాజశేఖర్ తన తల్లిని ఎవరో హత్య చేశారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు  నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద  నుంచి 2 తులాల బంగారం, రూ. 1,000  క్యాష్​స్వాధీనం చేసుకుని రిమాండ్ కు  పంపారు.  సీఐ రామకృష్ణా రెడ్డి, ఎస్సై వెంకట్ రెడ్డి,  సిబ్బంది ఉన్నారు. 

ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం తగదు

దుబ్బాక, వెలుగు: ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్​రావు టీఆర్ఎస్​లోకి వెళ్తున్నారని సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్​చేయాలని బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్​ మాధవనేని భాను ప్రసాద్​పోలీసులను కోరారు. శుక్రవారం భూంపల్లి పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్​చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్​ సోషల్​ మీడియా కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసం ముందుకెళ్తున్న ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం తగదన్నారు.  ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు మానుకోకుంటే బీజేవైఎం శ్రేణులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నాయకులు శ్రీనిరాములు, పూజారి పెద్దోళ్ల నవీన్​, భూపాల్​, నవీన్​, పర్శరాములు  పాల్గొన్నారు.


వేర్వేరు యాక్సిడెంట్లలో ముగ్గురు మృతి

పుల్కల్/పటాన్​చెరు, వెలుగు:  సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.  పుల్కల్​ఎస్సై గణేశ్​వివరాల ప్రకారం..  చౌటకూర్​మండలం శివ్వంపేట గ్రామానికి చెందిన పోలీస్ చెన్నారెడ్డి (56) తన బైక్ పై సంగారెడ్డి వైపు వెళ్తుండగా.. గ్రామ శివారులో 161 హైవేపై వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో స్పాట్​లోనే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

మరో సంఘటనలో ..

రాయిపాడ్ గ్రామానికి చెందిన తలారి రాములు (52), తలారి రాజు (46), రాధాకృష్ణ (42)లు ముగ్గురు కలిసి బైక్​పై పుల్కల్​గ్రామానికి వెళ్లి సొంత గ్రామానికి వస్తుండగా.. పెద్దారెడ్డిపేట గ్రామ శివారులో గుర్తు తెలియని వెహికల్​వీరి బైక్​ను ఢీకొట్టింది. రాములు స్పాట్​లోనే చనిపోయాడు.  రాజు, రాధాకృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరిని చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
 

పటాన్​చెరులో..

పటాన్​చెరు మండలం.. ఇస్నాపూర్​లో..  లారీని డీసీఎం ఢీకొట్టడంతో ఒకరు స్పాట్​లోనే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురం మండలం వెలిమెలకు చెందిన డీసీఎం సిమెంటు ఇటుకలతో సంగారెడ్డి వైపు  వెళ్తోంది. హైవేపై  ఇస్నాపూర్​ గురుకులం వద్ద ఓ రెడీమిక్స్​లారీ యూటర్న్ తీసుకుంటుండగా  డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది.  డీసీఎం క్యాబిన్ లో ఉన్న  జార్ఖండ్ కు చెందిన ముస్తకా అన్సారి (30) స్పాట్​లోనే చనిపోగా,  డ్రైవర్​ఇస్లావత్ గోపాల్,  క్లీనర్ ఇమ్రాన్ లకు తీవ్రగాయాలయ్యాయి.వారిని బీరంగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రామనాయుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.