యాదాద్రి, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ – కేవైసీకి రైతుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆఫీసర్లు ఏడాది నుంచి ప్రచారం చేస్తున్నారు. ఈ – కేవైసీ గడువును కేంద్రం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. అయినా రైతులు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో కలిపి సుమారు 45 వేల మంది రైతులు ఈ–కేవైసీ చేసుకోలేదని ఆఫీసర్లు అంటున్నారు.
ఏడాది కింద మారిన రూల్స్
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఏడాది కింద కేంద్రం రూల్స్ మార్చింది. వీటి ప్రకారం ప్రతి రైతు తప్పనిసరిగా ఈ – కేవైసీ చేసుకుంటేనే డబ్బులు వారి అకౌంట్లో జమ అవుతాయి. కొత్త రూల్స్‌పై అగ్రికల్చర్ ఆఫీసర్లకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి స్కీంకు అర్హులైన
రైతులు యాదాద్రి జిల్లాలో 1,08,166 మంది ఉండగా ఇప్పటివరకు 83,743 మంది రైతులు మాత్రమే ఈ –కేవైసీ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా 24,423 మంది అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది. అలాగే సూర్యాపేట జిల్లాలో 1.40 లక్షల మంది రైతులు ఉంటే ఇంకా 21 వేల మంది రైతులు కేవైసీ అప్‌డేట్ చేసుకోలేదు.
రేపు, మాపు అంటున్న రైతులు
ఈ – కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు రైతులకు ఫోన్లు చేస్తున్నా రేపు, మాపు అంటూ జరుపుకున్నారు. కొందరు రైతులు స్థానికంగా ఉండకపోవడం, ఫోన్ నంబర్లు మారడం మరో సమస్యగా మారిందని ఆఫీసర్లు చెబుతున్నారు. జిల్లాలోని మీ – సేవ సెంటర్ల నిర్వాహకులే షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో తిరుగుతూ రైతుల నుంచి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు.
కేవైసీ నమోదు చేసుకోవడమిలా...
రైతులు ఈ– -కేవైసీ స్మార్ట్ ఫోన్‌తో పాటు మీ – సేవ, ఈ – సేవ సెంటర్లలో కూడా చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉన్న రైతులు www.pmkisan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే అందులో ఈ–-కేవైసీ అప్‌డేట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే, ఆ నంబర్ కు లింక్ అయి ఉన్న మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌క్లిక్ చేస్తే ఈ–-కేవైసీ పూర్తవుతుంది.
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట
సూర్యాపేట, వెలుగు : సంస్కృతి సంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం సూర్యాపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అని మతాలు, అన్ని పండుగలను సమానంగా చూస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పండుగలకు ప్రభుత్వమే నిధులు కేటాయిస్తూ దుస్తులు పంపిణీ చేస్తోందని చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గంలో 1000 క్రిస్టియన్ ఫ్యామిలీలకు దుస్తులు అందచేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్‌స్వామి, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, బాబు పాల్గొన్నారు.
మన ఊరు మన బడి’ పనులు కంప్లీట్ చేయాలి
యాదాద్రి, వెలుగు : మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న పనులపై గురువారం కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 251 స్కూల్స్‌లో జరుగుతున్న పనుల పురోగతిని ఇంజినీర్లు కలెక్టర్‌కు వివరించారు.
అలాగే 34 మోడల్ స్కూల్స్‌లో 13 స్కూళ్లలో పనులు కంప్లీట్ అయ్యాయని, మిగిలినవి చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్కూళ్లలో రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేయాలని, శిథిలావస్థలో ఉన్న కట్టడాలను తొలగించాలని సూచించారు. స్కూళ్లలో ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా హెడ్‌మాస్టర్స్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఇంటర్ ఎడ్యుకేషన్‌పై రివ్యూ నిర్వహించగా స్టూడెంట్ల హాజరు శాతం, సిలబస్, ఎగ్జామ్స్ నిర్వహణపై నోడల్ ఆఫీసర్ రమణి వివరించారు. స్టూడెంట్ల హాజరుశాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రివ్యూలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, డీఈవో నారాయణరెడ్డి ఉన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం
హుజూర్‌నగర్, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారానికి బీసీ సంక్షేమ సంఘం పోరాటం చేస్తోందని ఆ సంఘం హుజూర్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాళ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో గురువారం జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పోరాడుతామన్నారు. త్వరలోనే మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు గూడెపు దీప, చేపూరి నరసింహచారి, కర్నె కృష్ణ, కొత్తూరి బ్రహ్మచారి, నందిగామ ముక్కంటి పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలో ప్రసాదాల తయారీ పరిశీలన
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మెషీన్లతో ప్రసాదాల తయారీని గురువారం బ్లెస్‌ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్ ప్రోగాం రాష్ట్ర నోడల్ ఆఫీసర్ జ్యోతిర్మయి, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సుమన్ కల్యాణ్, స్వాతి గురువారం పరిశీలించారు. లడ్డూ, పులిహోర, వడ తయారీలో వాడుతున్న ముడి సరుకులు, పాటిస్తున్న క్వాలిటీని చెక్ చేశారు. ప్రసాదాల తయారీ సిబ్బంది, ఆలయ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీపై ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లను అందజేశారు. ప్రసాదాల తయారీలో వాడే నీళ్లు, ముడి సరుకుల శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించారు. అనంతరం నోడల్ ఆఫీసర్ జ్యోతిర్మయి మాట్లాడుతూ ప్రసాదాల తయారీ, విక్రయాలు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉంటే ‘బోగ్’ సర్టిఫికెట్లను అందించనున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ స్పెషల్ టీం వచ్చి తనిఖీలు చేస్తుందన్నారు. శానిటేషన్, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత ఆధారంగా సర్టిఫికెట్ ఇవ్వనుందని చెప్పారు. వారి వెంట ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌శర్మ, ఏఈవో గజవెల్లి రమేశ్‌బాబు, ఎలక్ట్రికల్ ఈఈ రామారావు, సూపరింటెండెంట్ రాజన్‌బాబు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలి
యాదాద్రి (భువనగిరి), వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలో కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని పద్మశాలి సంఘం అధ్యక్షుడు బింగి భిక్షపతి కోరారు. ఈ మేరకు గురువారం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గర్దాసు బాలయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద చేనేత కార్మికులకు సంఘంలో మెంబర్‌షిప్ ఇవ్వడంతో పాటు, ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందేలా చూడాలని కోరారు. స్పందించిన గర్దాసు బాలయ్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిట్టిపోలు శ్రీధర్, సహాయ కార్యదర్శి ఎలిమినేటి కుమార్, రచ్చ శ్రీరాములు ఉన్నారు.
హమాలీ రేట్లు పెంచాలి
కోదాడ/తుంగతుర్తి, వెలుగు : సివిల్ సప్లై గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలకు ప్రభుత్వం కూలీ రేట్లు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో గోడౌన్స్ వద్ద హమాలీలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలను శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడారు. హమాలీ రేట్లు పెంచాలంటూ ఇప్పటికే చేసుకున్న అగ్రిమెంట్‌ను అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని, కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నాయకులు ఎస్‌కే.లతీఫ్, కొండలు, గౌరీనాయుడు, సాగర్ల శివరాం, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే తుంగతుర్తిలో చేపట్టిన దీక్షల్లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బొంకూరి శ్యాంసుందర్ కార్మికులు మల్లెపాక లక్ష్మయ్య, ఎర్ర రమేశ్, మల్లెపాక ఎల్లయ్య పాల్గొన్నారు.