యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వేర్వేరుగా గుట్టకు వచ్చారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయంలో ప్రత్యేక పూజలు, ముఖ మంటపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఏఈవో రామ్మోహన్ స్వామివారి ప్రసాదం, శేష వస్త్రాలు అందజేశారు. వారి వెంట డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు కాంటేకార్ పవన్‌కుమార్, తహశీల్దార్ రాములునాయక్ పాల్గొన్నారు. అలాగే ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి, రుద్రాభిషేకం, లక్షబిళ్వార్చన నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 15 ఏళ్ల తర్వాత నారసింహుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
కార్తీక పూజల్లో పాల్గొన్న భక్తులు
కార్తీక సోమవారం కావడంతో భక్తులు యాదగిరిగుట్టకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు జరిపించుకొని, కార్తీక దీపాలు వెలిగించారు. సత్యనారాయణ వ్రతాల్లో సోమవారం ఒక్కరోజే 584 మంది పాల్గొన్నారు. కొండపై గల శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వపత్రాలతో అర్చన చేశారు. సోమవారం పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.27,00,489 ఇన్‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. గర్భగుడి దివ్య విమాన గోపుర బంగారు తాపడం కోసం ఎన్‌ఆర్‌ఐ పైళ్ల అర్జున్‌రెడ్డి సంగీత దంపతులు రూ. 50 వేలు విరాళంగా ఇచ్చారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రయాణికుల వస్తువులే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రెమా రాజేశ్వరి సోమవారం వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొత్తతారాపురికి చెందిన తాజ్ మహ్మద్ అలియాస్ తాజ్, ఖాయిల్‌కు చెందిన సర్ఫరాజ్ సాల్మని అలియాస్ పప్పు, సరాఫత్ కాలనీకి చెందిన తన్వీర్, అహ్మద్‌నగర్‌కు చెందిన వసీం, కలంద్ రోడ్డుకు చెందిన షహజాద్, చున్గీవలీకి చెందిన షాహిద్, బారరీకి చెందిన మహమ్మద్ రిజ్వాన్, కిర్తల్ వాసి గుఫ్రాన్, మియామహ్మద్ నగర్‌కు చెందిన ఆకలీమ్ ముఠాగా ఏర్పడి బస్టాండ్లు, బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులు, డబ్బులను చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 7న విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్ వద్ద అగింది. దీంతో నిందితులు ఆ బస్సులోకి ఎక్కి లగేజీ స్టాండ్‌లో ఉన్న ఓ ప్రయాణికుడి బ్యాగ్ నుంచి రూ. 30 లక్షలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత ఆ ప్రయాణికుడు బ్యాగ్ చూసుకోగా అందులో డబ్బులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే హయత్‌నగర్ పీఎస్‌లో కంప్లైంట్ చేయగా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చిట్యాల పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. పోలీసులు రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 6న సాయంత్రం నార్కట్‌పల్లి శివారులోని కనకదుర్గ హోటల్, దాబా వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్కట్‌పల్లి సీఐ, చిట్యాల ఎస్సై సిబ్బందితో కలిసి వెళ్లి 9 మందిని పట్టుకొని విచారించగా బస్సులో చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. వీరిలో తాజ్, సర్ఫరాజ్‌పై నల్గొండ, నార్కట్‌పల్లి, కోదాడ, షాద్‌నగర్, హైదరాబాద్‌తో పాటు ఏపీలో పలు కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి రూ. 10 లక్షలు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేస్తున్నట్లు చెప్పారు.
సమావేశంలో నల్గొండ డీఎస్పీ వి.నరసింహారెడ్డి, సీసీఎస్ డీఎస్పీ మొగిలయ్య, సీఐలు జితేందర్‌రెడ్డి, శివరాంరెడ్డి, చిట్యాల ఎస్సై ధర్మ, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
వచ్చే నెలలో మాలల అలయ్ బలయ్
నల్గొండ అర్బన్, వెలుగు : వచ్చే నెలలో నిర్వహించే మాలల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గుండమల్ల చెన్నయ్య పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండలో ఆ సంఘం అధ్యక్షుడు లకుమాల మధుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు, అగ్రవర్ణాలు మాలలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలులో, పదవుల కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను పలువురు కార్యకర్తలు సన్మానించారు. సమావేశంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యనమల సత్యం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జంగాల లక్ష్మమ్మ, ప్రధాన కార్యదర్శి బంగి ఆనందరావు, నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు లకుమల్ల లింగయ్య, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు చింతమల్ల పాండురంగయ్య పాల్గొన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేకల భద్రాద్రిని పరామర్శించారు. భద్రాద్రి తల్లి అన్నమ్మ ఇటీవల చనిపోవడంతో ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు .
ఆధార్ డేటాను అప్‌డేట్ చేసుకోవాలి
యాదాద్రి, వెలుగు : ప్రతి ఒక్కరూ తమ ఆధార్ డేటాను అప్‌డేట్ చేసుకోవాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. 2016 కంటే ముందు ఆధార్ కార్డు పొందిన వారు సంబంధిత పత్రాలతో ఆన్‌లైన్ ద్వారా గానీ, ఆధార్ సెంటర్లను గానీ సంప్రదించాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డును కూడా ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలన్నారు. ఏవో నాగేశ్వరాచారి, ఆధార్ సేవా కేంద్రాల జిల్లా మేనేజర్ నరేందర్ పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
దేవరకొండ, వెలుగు : సీఎం సహాయనిధి పేదలకు అండగా నిలుస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన 93 మందికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను సోమవారం స్థానిక క్యాంప్ ఆఫీస్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను పేదలు వినియోగించుకోవాలని సూచించారు. రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, హన్మంతు వెంకటేశ్‌గౌడ్, జడ్పీటీసీ కేతావత్ బాలు, పున్న వెంకటేశ్వర్లు, లోకసాని తిరుపతయ్య, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
మిర్యాలగూడ, వెలుగు : రాజ్యాంగ సవరణ చేసైనా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాల్లో పేదలకు ఈడబ్ల్యూఎస్ పేరిట రిజర్వేషన్లు ఇచ్చినట్లుగానే బీసీలకు కూడా రిజర్వేషన్లు పెంచాలని కోరారు. రిజర్వేషన్ల అంశంపై కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. ప్రభుత్వాలు వైఖరి మార్చుకొని బీసీ హక్కుల సాధనకు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో అంజియాదవ్, జానపాటి రవి, నర్సింహ, వెంకన్న పాల్గొన్నారు.
కల్లూరిని పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురానికి చెందిన కాంగ్రెస్ లీడర్ కల్లూరి రాంచంద్రారెడ్డి కొడుకు శ్రీపతిరెడ్డి ఇటీవల యాక్సిడెంట్‌లో చనిపోయారు. విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం వెంకటాపురానికి వెళ్లి కల్లూరిని పరామర్శించారు. శ్రీపతిరెడ్డి ఫొటోకు నివాళి అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య, మండల అధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, నాయకులు చీర శ్రీశైలం, ధనావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటది
నల్గొండ అర్బన్, వెలుగు : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు. నల్గొండ మండలం చెన్ను గూడెం, పాతూరులో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం సహకరించకపోయినా రైతుల మేలు కోసం రాష్ట్రమే వడ్లు కొంటోందన్నారు. రైతులు క్వాలిటీ వడ్లు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, నాయకులు బకరం వెంకన్న, గాదె రాంరెడ్డి, సర్పంచ్‌లు గుండెబోయిన శ్రీలత జంగయ్య, చామకూరి తేజశ్విని తిరుమలేశ్, కారింగుల సైదులు పాల్గొన్నారు.
హామీలన్నీ నెరవేర్చుతాం
హుజూర్‌నగర్, వెలుగు : హుజూర్‌నగర్ ఉప ఎన్నిక టైంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం గాంధీ పార్క్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నిక తర్వాతే హుజూర్‌నగర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, ఓరుగంటి నాగేశ్వర్‌రావు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
మిర్యాలగూడ, వెలుగు : వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని నల్గొండ డీసీఎస్‌వో వెంకటేశ్వర్లు సూచించారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, వేములపల్లిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం ఏసీఎస్‌వో నిత్యానందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం వాటర్, టెంట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. రైతులు క్వాలిటీ వడ్లు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయన వెంట సివిల్ సప్లై డీటీ రామకృష్ణారెడ్డి, ఆర్‌ఐ సురేందర్‌సింగ్ పాల్గొన్నారు.
ధర్మం గురించి టీఆర్‌ఎస్ మాట్లాడడం హాస్యాస్పదం
యాదాద్రి, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో అధర్మంగా గెలిచిన టీఆర్‌ఎస్ ధర్మం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్, బీజేపీ క్యాండిడేట్లు వందల మందిని రంగంలోకి దించి మద్యం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసి సర్పంచ్‌లు, ఎంపీటీసీలను కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ఈ ఓటమితో వెనుకడుగు వేసేది లేదని, రెట్టించిన ఉత్సాహంతో సాధారణ ఎన్నికలకు సిద్ధం అవుతామన్నారు. ఆయన వెంట పొత్నక్ ప్రమోద్‌కుమార్, బీసుకుంట్ల సత్యనారాయణ ఉన్నారు.
వచ్చే నెలలో మాలల అలయ్ బలయ్
నల్గొండ అర్బన్, వెలుగు : వచ్చే నెలలో నిర్వహించే మాలల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గుండమల్ల చెన్నయ్య పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండలో ఆ సంఘం అధ్యక్షుడు లకుమాల మధుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు, అగ్రవర్ణాలు మాలలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలులో, పదవుల కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను పలువురు కార్యకర్తలు సన్మానించారు. సమావేశంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యనమల సత్యం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జంగాల లక్ష్మమ్మ, ప్రధాన కార్యదర్శి బంగి ఆనందరావు, నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు లకుమల్ల లింగయ్య, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు చింతమల్ల పాండురంగయ్య పాల్గొన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేకల భద్రాద్రిని పరామర్శించారు. భద్రాద్రి తల్లి అన్నమ్మ ఇటీవల చనిపోవడంతో ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు .
కిటకిటలాడిన శివాలయాలు
కార్తీక సోమవారం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు ఉదయమే ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్తీక దీపాలు వెలిగించారు. నల్గొండ పట్టణంలోని పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు నిర్వహించి, కోనేటిలో దీపాలు వదిలారు. సాయంత్రం ఛాయా సోమేశ్వరాలయం వద్ద ఆలయ నిర్వాహక కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, రుద్రసేన ఆధ్వర్యంలో జ్వాలా తోరణం నిర్వహించారు. అలాగే సూర్యాపేటలోని సంతోషిమాత, రామలింగేశ్వరస్వామి ఆలయాలు, హుజూర్‌నగర్‌లోని భీమలింగేశ్వర ఆలయం, తుంగతుర్తి నియోజకవర్గంలోని శివాలయాలు, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. – వెలుగు ఫొటోగ్రాఫర్, నల్గొండ