నిజామాబాద్, వెలుగు: నగర శివారులో మల్లారం ధాత్రి లే అవుట్ వేలం పాటను నిలిపి వేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ గేట్ వద్దే ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలు భూమయ్య, జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం రియల్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వై.ఓమయ్య, కె.రాజన్న, వై.రాజిరెడ్డి, యాదగిరి, రఘురాం ,అంజలి, రంజిత్, రమేశ్, జాఫర్, సాయిలు, అమర్, శీను పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్ నాగరాజు అన్నారు. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో వివిధ వ్యాపార సముదాయాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నేరస్తుల గుట్టు రట్టుకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్ బాబు, మూడో టౌన్ ఎస్సై శ్రావణ్, ఆర్టీసీ ఆర్ఎం ఉషాదేవి పాల్గొన్నారు.
ఎస్‌బీఐ రీజనల్ ఆఫీస్ ప్రారంభం
నిజామాబాద్ టౌన్ : నిజామాబాద్ నగరంలోని రాష్ట్రపతి రోడ్డులో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రీజనల్ ఆఫీస్‌ను ఎస్‌బీఐ సీజీఎం అమిత్ జిగ్రాన్, సీపీ కె.ఆర్ నాగరాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ జీఎం శేఖర్, నిజామాబాద్ డీజీఎం కుమార్ జేన, ఆర్ఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కాంటా వరకే రైతుల బాధ్యత
కామారెడ్డి, వెలుగు: వడ్ల కొనుగోలు సెంటర్లలో కాంటా అయిన తర్వాత రైతులతో సంబంధం లేకుండా రైస్ మిల్లలకు తరలించాలని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బీబీపేట మండలం మాందాపూర్ వడ్ల కొనుగోలు సెంటర్‌ను ఆయన పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఒక్కో సెంటర్‌లో ఒక్కో రకంగా కాంటాలు వేస్తున్నారన్నారు. ఒక సంచిలో 40 కిలోల 500 గ్రాములు తూకం వేయాల్సి ఉండగా 42 కిలోల 300 గ్రాములు తూకం వేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల 20 రోజులు గడిచినా కాంటలు కాకపోవడంతో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. వడ్లు అరబోయటానికి టార్పాలిన్లు కూడా లేవన్నారు. కాంటాలు అయిన చోట రైతుల అకౌంట్లలో వెంటనే పైసలు జమ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీలో పలువురి చేరిక
భిక్కనూరు : భిక్కనూరు పట్టణానికి చెందిన 15 మంది యువకులు సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు రెడ్డిగారి రమేశ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గేరిగంటి నర్సింహులు ఆధ్వర్యంలో పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి యువకులు పెద్ద సంఖ్యలో తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. అనంతరం మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను పరీశీలించారు. తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని అఫీసర్లను కోరారు.
బీజేపీని తరిమి కొట్టాలి
సిరికొండ, వెలుగు: మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీని తరిమికొట్టాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ నాయకుడు గాండ్ల రాజేందర్, తోట పెద్ద రాజన్న, చిమన్‌పల్లి గ్రామంలోని మాజీ ఎంపీటీసీ మాలవత్ లింబవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బాజిరెడ్డి సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుబంధు, పెన్షన్లు, 24 గంటల కరెంటు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రెసిడెన్షిల్ స్కూళ్లు లేవన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. స్వరాష్ట్రం వచ్చిన నాటి నుంచి ఆర్థికంగా ఎదగామన్నారు. కార్యక్రమంలో జట్పీటీసీ మాన్సింగ్, సర్పంచ్ రాజరెడ్డి, ఎంపీటీసీ కిషన్, రాజేందర్, గౌస్, రామస్వామి, నర్సారెడ్డి పాల్గొన్నారు.
22న సప్తహారతితో గిరి ప్రదక్షిణ
ఆర్మూర్, వెలుగు: కార్తీక మాసోత్సవంలో భాగంగా ఆర్మూర్ టౌన్‌లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22న సప్త హారతితో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు చైర్మన్ ఏనుగు శేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం టీఆర్ఎస్ నియోజవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, పురోహితులు నందీశ్వర మహారాజ్, కుమార్ శర్మతో కలిసి వాల్ పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్న విధంగా ఈసారి కూడా కొత్తగా తయారు చేయించిన రథం ద్వారా సప్తహారతితో గిరి ప్రదక్షిణ వైభవోపేతంగా నిర్వహిస్తామన్నారు. అంతకుముందు గుట్టపై రామాలయం, శివాలయం, అయ్యప్ప మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ఆశన్నగారి జీవన్‌రెడ్డి సహకారంతో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పండిత్ వినీత పవన్, పండిత్ ప్రేమ్, బి.సుమన్, పీసీ గంగారెడ్డి, బి.కిషన్, కొడిగెల మల్లయ్య, నక్కల లక్ష్మణ్, ఆనంద్ పాల్గొన్నారు.