వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఇసుక లారీలపై నిఘా పెంచాలి    

ములుగు, వెలుగు: ఇసుక క్వారీల నుంచి వెళ్తున్న లారీలపై నిఘా పెట్టాలని, ఓవర్ లోడ్ తో వెళ్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  ఓవర్ లోడ్ తో వెళ్తున్న లారీలను చెక్​పోస్టుల వద్ద రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్లు గుర్తించాలన్నారు. క్వారీల వద్ద కచ్చితంగా సీసీ కెమెరాలు అమర్చాలని, వీటి ద్వారానూ ఓవర్ లోడ్ ను గుర్తించాలన్నారు. గోదావరి నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో క్వారీలు రద్దు చేయాలని, పట్టా భూముల పర్మిషన్​ కొనసాగించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్​వో కె.రమాదేవి,  మైనింగ్ ఏడీ రామాచారి, డీసీవో సర్దార్ సింగ్ తదితరులున్నారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 12మంది లబ్ధిదారులకు మంజూరైన మొబైల్​ టిఫిన్ సెంటర్లను కలెక్టర్ ప్రారంభించారు. ఒక్కో యూనిట్ ధర రూ.7,83,000 ఉండగా 60 శాతం సబ్సిడీ, 40శాతం బ్యాంకు లోన్ ద్వారా లబ్ధిదారులకు అందజేశామన్నారు.

మీటింగ్​కు రాకుండా తమాషాలా?
ఆఫీసర్లపై ఎమ్మెల్యే అరూరి ఫైర్

హసన్ పర్తి, వెలుగు: ‘జనరల్ బాడీ మీటింగ్ మూడు నెలలకోసారి అయితది. మీటింగ్​కు రావాలని తెల్వదా? ఏం తమాషాలు చేస్తున్నారా?’ అంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆఫీసర్లపై ఫైర్ అయ్యారు. మంగళవారం హసన్ పర్తి మండలకేంద్రంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించగా.. ఆఫీసర్లు హాజరుకాకపోవడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ హాజరుకావాలని గత మీటింగ్​లో చెప్పినా.. ఎందుకు రాలేదని ఎంపీడీవోను ప్రశ్నించారు. తాను అందరికి సమాచారం ఇచ్చానని ఎంపీడీవో వివరణ ఇచ్చారు. మీటింగ్​కు రాని కొంత మంది ఆఫీసర్లకు ఎమ్మెల్యే ఫోన్ చేసి, క్లాస్ తీసుకున్నారు. ఎంపీడీవో సైతం పలువురికి ఫోన్ చేసి, మీటింగ్​కు రావాలని ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ డీఈ రాజు, ఆర్ అండ్ బీ ఆఫీసర్లు హుటాహుటిన మీటింగ్ కు వచ్చారు. హాజరు కాని ఆఫీసర్లకు నోటీసులు ఇవ్వాలని ఎంపీడీవోను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామాల్లో నెలకొన్న కరెంట్, మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే అరూరి రమేశ్​ మాట్లాడుతుంటే.. కొందరు ఆఫీసర్లు ఫోన్లలో నిమగ్నం కావడం గమనార్హం.

  • కుటుంబ పాలన అంతం చేయాలి
  • బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
  • 14వ రోజు సాగిన ప్రజా సంగ్రామ యాత్ర
  • హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

పాలకుర్తి, వెలుగు: కుటుంబ పాలన అంతానికి ప్రజలంతా కలిసి రావాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. బీజేపీతోనే ఉద్యమ ఆశయాలు నెరవేరుతాయని పేర్కొన్నారు. మంగళవారం పాలకుర్తి మండలం మైలారం క్రాస్ వద్ద 14వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. మాజీ ప్రధాని వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ పాదయాత్రకు చీఫ్ గెస్టుగా బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. బండి సంజయ్​తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. మార్గమధ్యలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అవినీతి, అక్రమ పాలన నడిపిస్తూ.. ప్రజలను అప్పులపాలు చేశారన్నారు. పాదయాత్రలో ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని ఉన్నంతంగా తీర్చిదిద్దుతుంటే.. సీఎం కేసీఆర్ తెలంగాణను భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. కాగా, బండి సంజయ్ పాదయాత్ర మైలారం క్రాస్ నుంచి విన్నూర్, వడ్డెర కాలనీ, లక్ష్మినారాయణపురం క్రాస్ మీదుగా పాలకుర్తికి చేరుకుంది. పాలకుర్తిలో సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ ఫొటోకు పూలమాల వేసి, నివాళి అర్పించారు. అక్కడి నుంచి తొర్రూర్​, శాతాపురం క్రాస్ గ్రామాల మీదుగా కడవెండి క్రాస్ వరకు సాగింది.

  • షాపులు క్లోజ్ చేయించిన పోలీసులు..

బండి సంజయ్ పాదయాత్రలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాలకుర్తిలో పాదయాత్ర ఉందని తెలిసి, పోలీసులు బలవంతంగా షాపులు క్లోజ్ చేయించారు. అప్రకటిత కర్ఫూను తలపించేలా స్థానిక రాజీవ్​ చౌరస్తాలోని షాపులను మూయించారు. చిరు వ్యాపారులను సైతం అక్కడి నుంచి తరలించారు. ఎందుకని ప్రశ్నించిన వ్యాపారులకు పోలీసులు విచిత్రంగా సమాధానం ఇచ్చారు. రాళ్ల దాడి జరిగితే దెబ్బలు తాకకుండా ఉండేందుకే షాపులు క్లోజ్ చేయిస్తున్నామని తెలిపారు. దాడి జరగకుండా ఆపాల్సిన పోలీసులే.. దాడి జరిగిన తర్వాత జరిగే పరిణామాలపై చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది.


వ్యాస రచన పోటీల్లో  స్టూడెంట్ కు అవార్డు


జనగామ, వెలుగు: ఆజాదీ కా అమృత్ మహాత్సవ్​ లో భాగంగా ఆన్ లైన్​లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్​కు చెందిన గాజులపాటి మహేశ్వరి ప్రతిభ కనబరిచింది. ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల మంది స్టూడెంట్లు ఈ పరీక్షకు హాజరుకాగా.. అందులో 75 మందిని ఎంపిక చేశారు. వీరిలో మహేశ్వరి స్టేట్​ లెవల్​ బెస్ట్ అవార్డుకు ఎంపికైంది. దీంతో ఆమెకు హైదరాబాద్​లో గవర్నర్ తమిళిసై అవార్డును అందజేశారు.

‘బీజేపీ వాళ్లే దాడి చేసిన్రు’

జనగామ అర్బన్, వెలుగు: జనగామ జిల్లా దేవరుప్పులలో బీజేపీ లీడర్లే టీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్​500 మంది గూండాలతో పాదయాత్ర నిర్వహించారని అన్నారు. ప్రజల్లో సానుభూతి పొందడానికే బీజేపీ నాయకులు ఈ కుట్రకు తెరలేపారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. బీజేపీ దాడికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.

లాయర్లకు  రక్షణ కల్పించాలి

జనగామ అర్బన్, తొర్రూరు, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోయాయని అడ్వకేట్లు మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ మెంబర్ విజయ్​రెడ్డి హత్యకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడ్వకేట్లు నిరసన తెలిపారు. జనగామ, తొర్రూరు పట్టణాల్లో కోర్టు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల వరుస హత్యలు హేయమైన చర్య అని, ఇవి న్యాయ వ్యవస్థకే భంగం కలిగిస్తాయన్నారు. అడ్వకేట్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

 

  • బీజేపీ నాయకుడిపై టీఆర్ఎస్ దాడి
  • పరకాలలో ఉద్రిక్తత
  • నేడు పట్టణ బంద్ కు పిలుపు

పరకాల, వెలుగు: పరకాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కాచం గురుప్రసాద్​పై మంగళవారం టీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో అప్పటికే కాపుకాసిన టీఆర్ఎస్ లీడర్లు.. ఆయనతో కావాలని గొడవపెట్టుకుని మరీ దాడికి దిగారు. తీవ్రంగా కొట్టి కిందపడేయడంతో చుట్టుపక్కల వ్యక్తులు ఆపారు. విషయం తెలుసుకున్న బీజేపీ లీడర్లు గురుప్రసాద్​ను వెంటనే పరకాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎస్సైలు ప్రశాంత్, శివకృష్ణ ఆసుపత్రికి చేరుకుని గురుప్రసాద్ వద్ద స్టేట్ మెంట్ రికార్డు చేశారు. తనపై టీఆర్ఎస్ కు చెందిన 18వ వార్డు కౌన్సిలర్ ఏకు రాజు, ఆ పార్టీ లీడర్లు ఏకు సుభాశ్, బొచ్చు జెమినితోపాటు మరికొంతమంది దాడి చేశారని గురుప్రసాద్ పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం ఆయన వరంగల్​లోని ఓ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

  • బీజేపీ లీడర్ల ధర్నా.. నేడు బంద్ కు పిలుపు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కాచం గురుప్రసాద్ పై టీఆర్ఎస్ దాడిని నిరసిస్తూ.. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. పోలీసులు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీగా పోలీస్​స్టేషన్​కు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. నేడు పరకాల బంద్ కు బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రజలంతా ముక్తకంఠంతో టీఆర్ఎస్ దాడులను ఖండించాలన్నారు.

  • రాష్టంలో రాక్షస పాలన
  • పాదయాత్రపై దాడి హేయమైన చర్య

ములుగు, వెలుగు: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ గూండాల దాడి హేయమైన చర్య అని ములుగు బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి విమర్శించారు. పాదయాత్రపై దాడిని నిరసిస్తూ మంగళవారం ములుగు జిల్లాకేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడులను ప్రోత్సహిస్తున్న మంత్రి దయాకర్ రావుపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని కోరారు.

హామీలను గాలికొదిలిన ఎమ్మెల్యే

నర్సంపేట, వెలుగు: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని బీజేపీ స్టేట్ లీడర్, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి విమర్శించారు. నియోజకవర్గానికి పెద్ది ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం నర్సంపేట టౌన్​లోని రాజీవ్ నగర్​, కుమ్మరికుంట, సర్వాపురం బైపాస్​ రోడ్ లో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. పట్టణంలో ఎన్నో సమస్యలు వేధిస్తున్నా.. ఎమ్మెల్యే మాత్రం మిన్నుకుండిపోతున్నారని ఆరోపించారు. బైపాస్​రోడ్డు అధ్వానంగా మారిందని, గుంతల వల్ల ప్రయాణికులకు గాయాలు అవుతున్నాయని పేర్కొన్నారు. కాగా, బండి సంజయ్​పాదయాత్రపై టీఆర్ఎస్ గూండాల దాడిని రేవూరి ఖండించారు. టీఆర్ఎస్ కు రోజులు దగ్గరపడ్డాయని, పోలీసులు సైతం చూస్తూ ఉండిపోవడం తగదని మండిపడ్డారు.

దుండగులను కఠినంగా శిక్షించాలి

స్టేషన్ ఘన్​పూర్, వెలుగు: ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవితపై జరిగిన దాడిని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఎంపీపీలు ఖండించారు. దాడి చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం స్టేషన్​ఘన్​పూర్ ఎంపీడీవో ఆఫీసు ముందు అనితతో పాటు ఏడు మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ లీడర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు.. తన సొంతూరు పెద్దపెండ్యాలలో జెండా ఎగరేసేందుకు వెళ్తుండగా.. గ్రామానికి చెందిన ముగ్గురు టీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారన్నారు. మహిళా ప్రజాప్రతినిధి అని గౌరవం లేకుండా ప్రవర్తించారని ఆరోపించారు. దీనిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు.