
- గ్రామాలకూ గంజాయి ఘాటు!
- విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందా
హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో గంజాయి దందా మళ్లీ జోరందుకుంటోంది. యువతను మత్తులో ముంచే ఎన్నో రకాల మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గాంజాకు అలవాటుపడిన కొంతమంది మతిస్థిమితం తప్పి ఆత్మహత్యలకు పాల్పడుతుండగా.. ఇంకొంతమంది ఇతర ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. యువతను మత్తులోకి దించుతున్న గంజాయి, డ్రగ్స్. గుట్కా లాంటి మాదక ద్రవ్యాలు, గుడుంబా, గేమింగ్(బెట్టింగ్) దందాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు చేపట్టిన ‘4జీ’ యాక్షన్ పై ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
స్టూడెంట్స్టార్గెట్ గా దందా
ఏపీ-, ఒడిషా బార్డర్ నుంచి వివిధ రాష్ట్రాలకు వరంగల్ మీదుగానే గంజాయి రవాణా సాగుతోంది. అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాలకు ఓరుగల్లు సెంటర్ పాయింట్ గా కావడంతో స్మగ్లర్లు వివిధ పద్ధతుల్లో గంజాయిని తీసుకువచ్చి, ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. సిటీలోనూ స్టూడెంట్స్ ను టార్గెట్ చేసుకుని దందా సాగిస్తున్నారు. చిన్నచిన్న ప్యాకెట్లు తయారు చేసి యూనివర్సిటీలు, కాలేజీల సమీపంలోని డబ్బాలు, పాన్ షాపుల్లో అమ్ముతున్నారు. అడపాదడపా టాస్క్‌ఫోర్స్, పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న దాంట్లో ఎక్కువశాతం స్టూడెంట్స్ఉండటమే ఇందుకు నిదర్శనం. వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లతో పాటు బస్టాండ్లు గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మారాయి. లారీలు, డీసీఎంలలో స్పెషల్ క్యాబిన్లు ఏర్పాటు చేసి గంజాయిని తరలిస్తున్నారు. కారు క్యాబిన్లు, ఆర్టీసీ బస్సుల్లోనూ వీటిని సప్లై చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా సాగిస్తున్నారు.
ప్రాణాల మీదకు తెస్తున్న మత్తు
గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన ఎంతోమంది యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలకూ హాని కలిగిస్తున్నారు. గత నెల 19న జనగామ జిల్లా కొడకండ్లలో ఓ ఐదేండ్ల బాలుడిని తమ బంధువైన మహబూబ్ అనే యువకుడు కిడ్నాప్చేశాడు. అనంతరం బాలుడిని బావిలో పడేసి హత్య చేసి పరారయ్యాడు. కాగా ఈ దారుణానికి గంజాయి మత్తే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ నెల మొదటివారంలో మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది యువకులు గంజాయి మత్తులో కత్తులు, బీరు బాటిళ్లతో వీరంగం సృష్టించారు. వరంగల్ నగరం మూడో డివిజన్ పైడిపల్లి గ్రామంలో ఇటీవల ఓ యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. అతడూ గంజాయి మత్తులోనే ప్రాణాలు తీసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరుడు ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన ఓ మహిళను సొంత అల్లుడే గంజాయి మత్తులో హత్య చేసిన విషయం తెలిసిందే.
4జీ యాక్షన్ ప్లాన్ ఎక్కడ?
డ్రగ్స్ సరఫరా అరికట్టేందుకు వరంగల్ సీపీ తరుణ్ జోషి ఆధ్వర్యంలో 4జీ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఈ మేరకు గుంజాయి, గుట్కా, గుడుంబా, గేమింగ్/గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన కార్యకలాపాలపై గత ఫిబ్రవరి నెలలో జనాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత లైట్ తీసుకున్నారు. దీంతో ఆయా మత్తు పదార్థాల దందా యథేచ్ఛగా సాగుతోంది. గంజాయి రవాణా విపరీతంగా సాగుతుండగా.. గుట్కా బిజినెస్ కూడా జోరుగా కొనసాగుతోంది. సిటీతో పాటు రూరల్ ప్రాంతాల్లోనూ కొంతమంది డీలర్ల అవతారం ఎత్తి గుట్కా దందా చేస్తున్నారు. చలికాలం నేపథ్యంలో ఈ వ్యాపారం మరింత పుంజుకుందని పలువురు చెబుతున్నారు. ఇకనైనా ‘4జీ’ యాక్షన్ ప్లాన్‌ను పక్కగా అమలు చేయాలని కోరుతున్నారు.
బాధితులకు న్యాయం చేయాలి
ములుగు, వెలుగు: గ్రీవెన్స్ కు వచ్చే బాధితుల సమస్యలు పరిష్కరించి, న్యాయం చేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం ములుగు కలెక్టరేట్ లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 45 అప్లికేషన్లు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్అండ్బీ శాఖ ద్వారా మంజూరైన రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. వర్షాల వల్ల కరాబ్ అయిన రోడ్లకు రిపేర్లు చేయాలన్నారు. అవసరమైన చోట్ల సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పశువులకు వ్యాక్సినేషన్ చేయాలని, మన ఊరు– మన బడి పనుల రిపోర్టు అందజేయాలని ఆదేశించారు. కాగా, గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేసిన జె.వినయ్ కుమార్ మద్రాస్ ఐఐటీలో సీటు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో స్టూడెంట్ను సత్కరించారు. అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్ వో కె.రమాదేవి, డీపీవో వెంకయ్య, సీపీవో ప్రకాష్, డీడబ్ల్యూవో ప్రేమలత, డీబీహెచ్వో విజయ్ భాస్కర్, డీఎస్వో అరవింద్ రెడ్డి తదితరులున్నారు.
‘మా భూములు మాకు ఇప్పించండి.. సారు’
పర్వతగిరి, వెలుగు: దొంగ సంతకాలతో తమ భూములు అన్యాయంగా లాక్కున్నారని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్‌నగర్ కు చెందిన 40మంది దళిత మహిళలు సోమవారం వరంగల్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్ గోపికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2001లో ఆనాటి ప్రభుత్వం పర్వతగిరి శివారులో 40 ఎకరాల భూమిని తమకు కేటాయించిందని చెప్పారు. 2005లో ఓ వ్యాపారి వచ్చి వేలు ముద్రలు తీసుకుని, తమ భూములు కౌలుకు తీసుకున్నాడని, కౌలు ముగిశాక భూములు ఇవ్వడం లేదని వాపోయారు.
అర్జీలపై నిర్లక్ష్యం చేయొద్దు..
కాశిబుగ్గ(కార్పొరేషన్), జనగామ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కు 76 అర్జీలు వచ్చాయి. కమిషనర్ ప్రావీణ్య వాటిని పరిశీలించి, సంబంధిత అధికారులకు పంపిణీ చేశారు. నిర్లక్ష్యం చేయకుండా వాటిని పరిస్కరించాలని ఆదేశించారు. ఇక జనగామ జిల్లాకేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి 106 అప్లికేషన్లు వచ్చాయి. కలెక్టర్ శివలింగయ్య వాటిని పరిశీలించి, ఆయా శాఖలకు అందజేశారు.
- డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇంకెప్పుడు?
- కలెక్టరేట్ ను ముట్టించిన ఆదివాసీలు
మహబూబాబాద్, వెలుగు: ఇండ్లు లేక ఏండ్లుగా తిప్పలు పడుతున్నామని, ప్రభుత్వం ఇస్తామన్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇంకెప్పుడు వస్తాయని ఆదివాసీలు మండిపడ్డారు. ఈమేరకు సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా మహబూబాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు. భారతీయ సర్వ సమాజ్ మహా సంఘం నాయకుడు రామ్దొర మాట్లాడుతూ... ఆదివాసీ గూడేల్లో ప్రజలు నేటికీ పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇంతవరకు రాలేదన్నారు. రోడ్లు అధ్వానంగా మారుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సమయానికి వైద్యం కూడా అందడం లేదన్నారు. గతంలో పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో బయ్యారం, గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాల ప్రజలు పాల్గొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ అభిలాష్అభినవ్ కు వినతిపత్రం ఇచ్చారు.
‘ఫోన్ పే’తో దొరికిన దొంగలు
హనుమకొండ, వెలుగు: దారిదోపిడీకి పాల్పడిన ఇద్దరు దొంగలు ఫోన్ పే ట్రాన్సాక్షన్ తో పట్టుబడ్డారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. దారిదోపిడీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు.ఈ కేసు వివరాలను వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి సోమవారం కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాలులో వెల్లడించారు. కాజీపేట బాపూజీ నగర్‌కు చెందిన గండికోట వెంకన్న, కంది అబ్బులు ఇద్దరూ స్నేహితులు. వీరు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ముందస్తు ప్లాన్ లో భాగంగానే ఈ నెల 13న రాత్రి కేయూ పీఎస్ పరిధి వరంగల్ రింగ్ రోడ్డుపై బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపారు. చంపుతామని బెదిరించి అతడి మెడలో ఉన్న బంగారు గొలుసు, పర్సులో ఉన్న రూ.3,600 నగదు లాక్కున్నారు. మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో తన వద్ద క్యాష్ లేదని, కేవలం ఫోన్ పేలో మాత్రమే ఉన్నాయని చెప్పాడు. అయినా వదలని దుండగులు బలవంతంగా ఆయన మొబైల్ నుంచి రూ.3 వేలు ఫోన్ పే ద్వారా ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. దీంతో బాధితుడు కేయూ పోలీసులను సంపద్రించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ పే సాయంతో నిందితులిద్దరినీ గుర్తించి, విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో వారి నుంచి 20 గ్రాముల బంగారం, బైక్, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, కేయూ సీఐ దయాకర్, ఎస్సైలు సతీష్, విజయ్ కుమార్, ఏఏవో సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు నర్సింగారావు, పాషా, సంపత్, ఇతర సిబ్బందిని వరంగల్ సీపీ తరుణ్ జోషి అభినందించారు.
- ఏటూరునాగారంలో రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు
- ఇయ్యాల్టి నుంచి ప్రారంభం.. ఏర్పాట్లు పూర్తి
- 1668 మంది క్రీడాకారులు హాజరయ్యే చాన్స్
ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారంలో రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈమేరకు స్థానిక కుమురం భీం స్టేడియాన్ని ఆఫీసర్లు సిద్ధం చేశారు. ఇయ్యాల్టి నుంచి ఈ నెల 20 వరకు పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ఏరియాలతో పాటు రెండు మైదాన ప్రాంతాల నుంచి 1668 మంది క్రీడాకారులు తరలిరానున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి వీరంతా ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. అండర్–14,17 బాలబాలికలకు వాలీబాల్, ఖోఖో, ఆర్చరీ, అథ్లెటిక్స్, క్యారమ్, చెస్ తదితర పోటీల్లో ఇప్పటికే వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ క్రీడలను ప్రారంభించేందుకు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి
దయాకర్ రావులకు ఆహ్వానం పంపారు.
గుంతల రోడ్లతో తిప్పలు!
వెంకటాపురం, నెల్లికుదురు, ఎల్కతుర్తి, వెలుగు: వర్షాలకు, లారీల రాకపోకలతో రోడ్లన్నీ గుంతలమయంగా మారి తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీంతో విసిగివేసారిన ప్రజలు, వివిధ పార్టీ నాయకులు వేర్వేరు చోట్ల ఆందోళన చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలకేంద్రంలో కాంగ్రెస్ లీడర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మండలంలో రోడ్లు అధ్వానంగా ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లిగూడెం– కాచికల్లు రూట్లో రోడ్డు కరాబ్ కావడంతో సోమవారం కొందరు ప్రయాణికులు కిందపడ్డారు. దీంతో లారీలను అడ్డుకొని నిరసన తెలిపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోనూ రోడ్లు గుంతలమయంగా మారాయి. స్కూళ్లకు వెళ్లే రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి.
అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసిన కాంగ్రెస్ లీడర్లు
జనగామ, వెలుగు: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్లు ఓట్లు వేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ సభ్యుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రైతునేస్తం బీజేపీ
మొగుళ్లపల్లి, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కిసాన్ సమ్మాన్ నిధులు12వ విడత రూ.16వేల కోట్లు విడుదల చేయడం పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు మోడీ చిత్రపటాలకు క్షీరాభిషేం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మోరె రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ రైతు నేస్తమని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని పథకాల్లో కమీషన్లకు పాల్పడ్డారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు చెవ్వ శేషగిరి, బండారు రవీందర్, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రాజాగౌడ్ తదితరులున్నారు.