ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

హనుమకొండ, వెలుగు: పేరెంట్స్​ వదిలేసిన నవజాత శిశువుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘ఊయల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ప్రభుత్వచీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ అన్నారు. శనివారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన మొదటి ఊయలను వినయ్​ భాస్కర్​ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొంతమంది శిశువులను చెత్తకుప్పలు, మురుగుకాల్వల్లో పడేయడం చాలా బాధాకరమని, ఏ శిశువుకూ అలాంటి పరిస్థితి ఎదురవకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం 'ఊయల' కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఎవరైనా తమకు పిల్లలు వద్దనుకుంటే సాయం కోసం 1098 చైల్డ్​ హెల్ప్​ లైన్​కు కాల్​చేయవచ్చన్నారు. తొందర్లోనే మరో రెండు ఊయలలు కాజీపేట, హనుమకొండల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో లైబ్రరీ సంస్థ చైర్మన్​ అజీజ్​ ఖాన్​, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్​, ఐసీడీఎస్​ పీడీ శారద, కుడా మాజీ చైర్మన్​ యాదవరెడ్డి, జీఎంహెచ్​ సూపరింటెండెంట్​ విజయలక్ష్మి, కార్పొరేటర్లు లక్ష్మి, మానస, ఎన్​జీవో బాధ్యులు అనితారెడ్డి పాల్గొన్నారు.

ఓడీఎఫ్ ​రాష్ట్రంగా తెలంగాణ

తొర్రూరు, వెలుగు: ప్రతి ఇంటికి టాయిలెట్​నిర్మించుకోవాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా శనివారం తొర్రూరు మండలం వెలిక‌ట్టలో సంపూర్ణ  స్వచ్ఛతా  కోసం స్వచ్ఛతా రన్​ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓడీఎఫ్​రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. టాయిలెట్​నిర్మాణం మహిళల గౌరవానికి శుభోదయం అంటూ మంత్రి నినదించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్​, సీతారాములు, వెలికట్ట సర్పంచ్ పుష్పలీల, ఉప సర్పంచ్ యాకన్న, రాములు, పాల్గొన్నారు.

విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించాలి

తొర్రూరు, వెలుగు: టీచర్లు బోధనాభ్యాసన సామగ్రితో విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించాలని రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవి తెలిపారు. శనివారం తొర్రూరు డివిజన్​కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో హెచ్ఎం బీవీ రావు అధ్యక్షతన పేరెంట్స్, టీచర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేడీ చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్క టీచర్​లెసెన్​ప్లాన్​తయారు చేసుకొని బోధించాలన్నారు.  టెన్త్​క్లాస్​లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు టీచర్లు కృషి చేయాలన్నారు. ‘మన ఊరు- మన బడి’పై స్పందిస్తూ పనులను వెంటనే పూర్తి చేసేందుకు స్కూల్ మేనేజ్​మెంట్​కమిటీలు చొరవ తీసుకోవాలన్నారు. నాలుగేళ్లుగా ఒక్క రోజు కూడా లీవ్​పెట్టని సోషల్ టీచర్ స్వామిని విద్యాశాఖ జేడీ సత్కరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ జిల్లా కోఆర్డినేటర్ మహంకాళి బుచ్చయ్య, జడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్,  మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య,  వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి,  కమిషనర్ బాబు,  ఎర్రబెల్లి ట్రస్ట్ కోఆర్డినేటర్ పంజా కల్పన,  స్టాఫ్​సెక్రటరీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పేరెంట్స్​ను కోల్పోయిన తోటి స్టూడెంట్​కు చిన్నారుల సాయం

పాలకుర్తి, వెలుగు: తమతో చదువుకుంటున్న ఓ స్టూడెంట్​ పేరెంట్స్​ను కోల్పోయి విషాదంలో ఉండగా మిగతా స్కూల్​పిల్లలు చేయిచేయి కలిపి చేతనైనంత సాయం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం సీత్యా తండాలో ఈనెల 14న బాణోతు స్వర్ణ, 17న బానోతు మురళి అనే భార్యభర్తలు సూసైడ్​ చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. వారిలో పెద్ద కూతురు ఐషు స్థానిక ప్రైమరీ స్కూల్​లో 3వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఐషుకు స్కూల్​లోని 48 మంది స్టూడెంట్ల తల్లిదండ్రుల సహకారంతో సాయం అందించారు. పిల్లలంతా కలిసి రూ.2వేలు, 50కేజీల బియ్యం సేకరించి శనివారం బాధిత కుటుంబానికి అందజేశారు. వారు చేసింది చిన్న సాయమే అయినా పసి మనసుల ఔదార్యాన్ని పలువురు మెచ్చుకున్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి

ములుగు, వెలుగు : ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు పొందాలని ఎలక్షన్ చీఫ్​ ఓటర్​​రోల్​అబ్జర్వర్​ భారతీ నాయక్​ పిలుపునిచ్చారు. శనివారం ములుగు కలెక్టరేట్​లో కలెక్టర్​ ఎస్​.కృష్ణ ఆదిత్యతో కలిసి వివిధ పార్టీల ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీ నాయక్​ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ఎలక్షన్​కమిషన్​ఏటా స్పెషల్​సమ్మరీ రివిజన్​ నిర్వహిస్తోందని, ఓటరు జాబితాను సవరిస్తోందన్నారు. కలెక్టర్​ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం జనాభా 2,94,671 మందికి  2,08,140 మందికి ఓటు హక్కు కల్పిస్తూ డ్రాఫ్ట్ సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ వై.వి.గణేశ్, డీఆర్వో  కె.రమాదేవి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

కష్టపడితేనే కొలువులు
   
హనుమకొండ, వెలుగు: ఏకాగ్రతతో కష్టపడి సాధన చేస్తేనే సర్కారు కొలువులు సాధిస్తారని వరంగల్ పోలీస్​ కమిషనర్​ డా.తరుణ్​ జోషి అన్నారు. కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్​ ఉద్యోగార్థుల కోసం కేయూ గ్రౌండ్​ లో ఏర్పాటు చేసిన ఫ్రీ ఫిజికల్​ ట్రైనింగ్​ క్యాంపును  సీపీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ  హనుమకొండ, నర్సంపేట, పరకాల, జనగామ ప్రాంతాల్లో శిక్షణ తరగతులకు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ కోసం  9 సెంటర్లలో మొత్తం 5 వేలకు పైగా యుతకు ఫ్రీ ట్రైనింగ్​ ఇచ్చి, స్టడీ మెటీరియల్ అందజేశామన్నారు. అనంతరం కేయూ ఇన్​చార్జి రిజిస్ట్రార్ ప్రొ.శ్రీనివాస్ రావుతో కలసి జెండా ఊపి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీపీ వెంట అడిషనల్​ డీసీపీలు  వైభవ్ గైక్వాడ్, సంజీవ్, అనంతయ్య, నాగయ్య, కేయూ ఫిజికల్ ఎడ్యూకేషన్ ప్రిన్సిపల్ డా. భాస్కర్, డైరెక్టర్  సురేందర్, సీఐ దయాకర్  పాల్గొన్నారు. 

తహసీల్​ ఆఫీసు ఎదుట బీజేపీ ఆందోళన

కమలాపూర్, వెలుగు: కమలాపూర్​ తహసీల్​ఆఫీసు ఎదుట బీజేపీ లీడర్లు, కార్యకర్తలు శనివారం ఆందోళన చేశారు. మూడురోజుల క్రితం కమలాపూర్ ​మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డి కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తూ కార్యక్రమానికి హాజరుకాని లబ్ధిదారుల చెక్కులు రద్దు చేస్తానన్న వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి.  బీజేపీ లీడర్లతో 
మాట్లాడేందుకు వచ్చిన తహసీల్దార్ ​రాణితో ప్రోటోకాల్​ పాటించడం లేదని వాగ్వాదానికి దిగారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు అశోక్​ రెడ్డి, ఎంపీటీసీ కె.శ్రీనివాస్​, సర్పంచ్​ సీహెచ్​శ్రీనివాస్​, లీడర్లు రమేశ్, సంపత్​,  రత్నాకర్​ పాల్గొన్నారు. 

బీజేపీ జోలికొస్తే ఊరుకునేది లేదు..

ములుగు, నల్లబెల్లి, వెలుగు: బీజేపీ లీడర్ల జోలికొస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్​ రెడ్డి అన్నారు. ఎంపీ అర్వింద్​ ​ఇంటిపై టీఆర్ఎస్, జాగృతి నాయకుల దాడికి నిరసనగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్​ ఆధ్వర్యంలో శనివారం ములుగులోని జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, నియోజకవర్గ కన్వీనర్​ బలరాం, అధికార ప్రతినిధి డి.వాసుదేవరెడ్డి, మండల అధ్యక్షుడు రాకేశ్, లీడర్లు మహేందర్​, డి.రవిరెడ్డి పాల్గొన్నారు.  నల్లబెల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్​దిష్టిబొమ్మకు ఊరేగింపు చేసి సెంటర్​లో దహనం చేశారు. 

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

హసన్ పర్తి,వెలుగు : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​అన్నారు. శనివారం హసన్ పర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 76మంది కల్యాణలక్ష్మి,14మంది సీఎంఆర్ఎఫ్​లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో కార్పొరెటర్లు  జక్కుల రజిత, దివ్యారాణి, తహసీల్దార్​ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

మహిళ హత్య కేసులో ఐదుగురి అరెస్ట్​

నెల్లికుదురు/కేసముద్రం, వెలుగు: మహిళ హత్య కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్​చేశారు. సీఐ రవికుమార్ వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం వెంకటగిరికి చెందిన కత్రి సురేందర్ కు అదే గ్రామానికి చెందిన యువతితో స్నేహం ఉంది. గమనించిన యువతి తండ్రి ఆమెకు పెండ్లి చేశారు. ఆ తర్వాత కూడా సురేందర్​ ఆ యువతికి ఫోన్ చేసి మాట్లాడుతుండటంతో తన కూతురు సంసారం చెడిపోతుందని భావించిన యువతి తండ్రి, అతడిపై పగ పెంచుకున్నాడు. ఈనెల 17న సురేందర్ ​కేసముద్రం నుంచి వెంకటగిరి వెళుతుండగా కంచు మల్లేశ్, తన అన్నదమ్ములు కంచు రమేశ్, కంచు కుమార్ స్వామి, ఫ్రెండ్​ దుండి మధుకర్.. రెండు బైకులపై వెళ్లి అతడిని అడ్డగించారు. మల్లేశ్​ గొడ్డలితో సురేందర్ పై దాడి చేయగా అతను ఊళ్లోకి పారిపోయాడు. అడ్డొచ్చిన తల్లి అమృతను మల్లేశ్​ గొడ్డలితో మెడపైన నరకగా ఆమె స్పాట్​లోని చనిపోయింది.  దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు శనివారం కోరుకొండపెళ్లి క్రాస్ వద్ద నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు. 

మున్సిపల్​ కార్మికులకు వేతనాలు పెంచాలి

హనుమకొండ, వెలుగు: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్​ డిమాండ్​ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ నాలుగో మహాసభ హనుమకొండలోని అమృత గార్డెన్స్​లో శనివారం కొనసాగింది.  ఈ సభకు చీఫ్​ గెస్ట్​ గా పాలడుగు భాస్కర్​,  ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్​ మాట్లాడుతూ తెలంగాణ వస్తే   కాంట్రాక్టు వ్యవస్థ రద్దువుతుందని, కార్మికులంతా పర్మినెంట్ అవుతారని ఆశించినా నిరాశే మిగిలిందన్నారు. అంతకుముందు  సీఐటీయూ  జెండాను మున్సిపల్ సీనియర్ నాయకులు అంజయ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో  జనగాం రాజమల్లు, నాగమణి, కేవీపీఎస్​  రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు తదితరులు పాల్గొన్నారు.