అక్షర ప్రపంచం నవ్వేడిపించే నవల బృహన్నల పేట

అక్షర ప్రపంచం నవ్వేడిపించే నవల బృహన్నల పేట

బృహన్నలపేట’ ఒక విభిన్నమైన విలక్షణమైన నవల. బృహన్నల కేవలం  మహాభారతంలో మాత్రమే కనిపించే ఒక అరుదైన పాత్ర. పురుషుడి ఆకారం, స్త్రీ లక్షణాల కలబోత ఈ పాత్ర. సహజంగా చేతకాని వారికి, అసమర్థులకు ఉపయోగించే పేరు. 

సమకాలీన భారతంలో స్త్రీలపై చేసే అత్యాచారాలకు ప్రజలు తక్షణ న్యాయం కోరుతున్నారు. పోలీసులు కూడా కొంతమందిని ఎన్​కౌంటర్ చేసి న్యాయం చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ప్రాణానికి ప్రాణం సమాధానం కాదు. అందుకే అవినీతి, అత్యాచారాలు తగ్గిన దాఖలాలు లేవు. కానీ, ప్రజలు ఉపశమనం పొందుతారు. ఒక ‘హత్యాచారా’నికి ప్రతిగా ఇద్దరు ముగ్గురిని చంపితే బాధితురాలికి న్యాయం ఏ విధంగా జరిగినట్టు? సమాజానికి తక్షణ ఉపశమనం కావాలి. అది న్యాయమా? కాదా? అనేది వారికి సంబంధం లేదు. ఇక్కడ మహాకవి శ్రీశ్రీ అన్న మాటలు గుర్తుకు రావడం సహజం. ‘‘న్యాయం గెలుస్తుంది. కానీ, గెలిచేదంతా న్యాయం కాదు’’.

ఈమధ్య ఢిల్లీ, హైదరాబాదుల్లో జరిగిన అత్యాచారాలు,  వాటికి కొనసాగింపుగా పోలీసులు మరుసటి రోజుకల్లా కొద్ది మందిని ఎన్​కౌంటర్ చేసి ప్రజలను ఉపశమింపచేశారు. మరి కోర్టులు, చట్టాలు ఎందుకు ఉన్నట్లు? ఏం చేస్తున్నట్లు? పోలీసులు న్యాయ నిర్ణేతలు కాదు. రాజ్యాంగం వారికి చంపే హక్కు ఇవ్వలేదు. కానీ, నేడు జరుగుతున్న ‘తంతు’ అదే. తక్షణం న్యాయం జరగకపోగా తక్షణ అన్యాయం జరుగుతున్నట్లు మనకు ఈ నవల ద్వారా నిరూపితం అవుతోంది. నిందితుడికి బాధ తెలియకుండా శిక్ష అమలవుతున్నది. 

అందువల్ల సమాజంలో అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులకు ‘శిక్ష విలువ’ తెలియడం లేదు. పరివర్తన కలగడం లేదు. పర్యవసానంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రకమైన నేరస్తులకు ఈ నవలలో ఊహకందని శిక్ష అమలు చేయడంతో మృగాళ్లు మనుషులవుతున్నారు.

‘మత్తులో ఉన్నప్పుడు కామన్న, తెలివిలోకి వస్తే వేమన్న. మత్తు నెత్తికెక్కితే భోగి, దిగిపోతే యోగి.’
ఈ తరహా చమక్కులతో నవల ఆద్యంతం హృద్యంగా సాగిపోతుంది. అందులో నాటకీకరణ శైలి సతీష్ చందర్ ప్రత్యేకత. ‘సామాజిక వ్యంగ్యనవల’గా రచయిత ముందే చెప్పారు. సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు బాధితులకు తక్షణ న్యాయం జరుగుతున్న తీరును కళ్ళకు కట్టినట్టుగానే కాదు ఉత్కంఠభరితంగా నడిపిచారు. మధ్య మధ్యలో వారి చెణుకులు ఈ నవలా భోజనానికి మసాలా లాంటివి. 
గొంతులో నాలుగు చుక్కలు స్కాచ్ పోస్తే శుంఠ కూడా శుక్రాచార్యుడు అవుతాడు.’ 
భక్తికి బుర్రను ఊపే అవసరమే కానీ వాడే అవసరం ఉండదు.’

పోలీసులు తాటవలుస్తారు, ‘థాట్’ కూడా వలుస్తారు’... ఇలాంటివి ఈ నవలలో కోకొల్లలు. 
పోయినోడు మాస్ వాడైతే భౌతిక దేహం క్లాస్ వాడైతే పార్థివదేహం’ అనడం ద్వారా జరిగే అత్యాచారాలు వాటి వెనుకనున్న కులాలు, మతాలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయని నర్మగర్భంగా తన ముందుమాటలోనే చెబుతారు సతీష్ చందర్. తక్షణ న్యాయం జరగాలంటే రేపిస్టులు దొరకాలి. దొరకకపోతే దొరికినవాడే రేపిస్టు, నేరస్తుడు అవుతాడు. న్యాయం చేయవలసిన వారు చేయకపోతే చేయకూడని వాళ్ళు చేస్తారు. అందుబాటులో లేని న్యాయం పూడ్చిపెట్టిన న్యాయం లాంటిదే.

బృహన్నలపేట’ ‘అట్ట’హాసంగా ఉన్న ఈ నవలలో 45 చాప్టర్లు ఉన్నాయి. నేరస్తులకు సరైన శిక్ష వేసేది ఎవరనేది 240 పేజీలు నడిపిస్తుంది. నవలా రచనలో  చెయ్యితిరిగిన  సతీష్ చందర్​కు ఇది 28వ రచన. సామాజిక స్పృహ ఈయన రచనల్లో ప్రతిబింబిస్తుంది. పాఠకులను ఆలోచింపజేస్తుంది. ఆనందిస్తూ ఈ పుస్తకాన్ని ‘నవల’ండి.
గమనిక: సతీష్ చందర్ నవలలో నేరస్తులకు వేసిన శిక్ష సరైనదేనని ఆర్ జి కార్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం కేసులో గౌరవ సుప్రీం న్యాయస్థానం కూడా నిరూపించింది. నేరస్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం గమనార్హం. నేరస్తులు భౌతికంగానే శిక్ష అనుభవించాలనేదే సారాంశం.

బృహన్నల పేట (సామాజిక వ్యంగ్యనవల)
రచయిత: సతీష్ చందర్
వెల: రూ.300/- , పేజీలు: 248
ప్రతులకు: 411, హిమసాయి గార్డెన్స్, స్ట్రీట్: 5, జవహర్ నగర్, హైదరాబాద్-20.  
అమెజాన్ ద్వారా కూడా  పొందవచ్చు. 

- శ్రీ శ్రీ కుమార్