ఢిల్లీ : బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు పెట్టిన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణ కోసం జులై 18వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ కేసులో నిందితుడిపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం వెల్లడించింది. బ్రిజ్ భూషణ్‌తో పాటు సస్పెన్షన్ వేటుకు గురైన రెజ్లింగ్ సమాఖ్య అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడుగా ఉన్న బ్రిజ్‌భూషణ్ ను తాత్కాలికంగా విధులను నుంచి తప్పించారు. బ్రిజ్‌భూషణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు ఇటీవల ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
ALSO READ :కేసీఆర్ కు లేఖ రాసిన తుమ్మేటి సమ్మిరెడ్డికి షోకాజ్ నోటీసు
ఈ క్రమంలోనే బ్రిజ్‌భూషణ్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురు మహిళా రెజ్లర్లతో మొదటి ఎఫ్‌ఐఆర్, మరో మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్ ఏప్రిల్ 28న దాఖలైంది. అయితే మైనర్ తండ్రి పెట్టిన కేసుకు బాధితురాలి వయసుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే బ్రిజ్‌భూషణ్ పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆయనపై నమోదైన పోక్సో కేసును తొలగించాలని కోరుతూ కోర్టులో మరో నివేదికను సమర్పించారు. ఈ పోక్సో కేసుపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది.
బ్రిజ్‌భూషణ్ ను తప్పించడంతో డబ్ల్యూఎఫ్‌ఐకి జులై 11న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. దీనిపై గువాహటి హైకోర్టు స్టే విధించడంతో ఆ ఎన్నికలు మరోసారి నిలిచిపోయాయి.