కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగేళ్లలో రూ.7 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్ లోని 48వ డివిజన్ లో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన, కొత్తపల్లి టౌన్ హైమాస్ట్ లైట్లు, నాగుల మల్యాలలో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్మీడియాతో మాట్లాడుతూ హైవేల నిర్మాణానికి రూ.4,624 కోట్లు తెచ్చినట్లు వెల్లడించారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి రూ.154 కోట్లు మంజూరు చేయించానని అన్నారు.
కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద రూ.194 కోట్లు, అమృత్ కింద రూ. 1.17 కోట్లు తీసుకొచ్చినట్లు ఎంపీ చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులిచ్చేందుకు సిద్ధమైనా అక్కసుతో కేసీఆర్ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. అభివృద్ది చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాత్రం ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ.5 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి దివాళా తీయించారన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, డాక్టర్ పవన్ కుమార్, కార్పొరేటర్ అనూప్ పాల్గొన్నారు.