పట్టణ ఉపాధి హామీ తీసుకురావాలె

కరోనా మహమ్మారి విజృంభణను కట్టడి చేయడానికి పెట్టిన లాక్ డౌన్, నైట్​ కర్ఫ్యూ, రవాణా తదితర ఆంక్షలతో కంపెనీలు, వ్యాపారాలపై ప్రభావం పడి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. వినియోగదారుల సెంటిమెంట్ కూడా తగ్గుతుండడంతో వస్తువుల డిమాండ్ కూడా క్షీణిస్తున్నట్లు చాలా స్టడీలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా పేద, మధ్య తరగతి వర్గాలపైనే పడుతోంది. ఇటు ఆదాయం కోల్పోవడం, అటు కరోనా బారిన పడుతుండటంతో చాలా మంది బాధితులు ట్రీట్​మెంట్​ కోసం ఆస్తులు అమ్మడమో లేక అప్పులు చేయడమో చేస్తూ కుదేలైపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. ఇలాంటివారిని ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. పట్టణాల్లోనూ ఉపాధి హామీని తీసుకురావాలి.

ఏడాదిన్నరగా కరోనా మహమ్మారిపై దేశం మొత్తం పోరాటం చేస్తోంది. రెండు విడతలుగా విధించిన లాక్ డౌన్లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ఎంతో మంది పనుల్లేక సొంతూర్లకు వెళ్లిపోయారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయానికి భారీగా గండి పడింది. అన్ని రంగాల్లో డిమాండ్ తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. కరోనా ప్రభావంతో 90 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడించింది. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2021- వన్ ఇయర్ ఆఫ్ కొవిడ్’ రిపోర్ట్​ ప్రకారం గతేడాది మార్చి నుంచి అక్టోబర్ వరకూ అంటే ఎనిమిది నెలల కాలంలో సగటున 22 శాతం కుటుంబాలు ఆదాయం కోల్పోయినట్లు, స్వల్ప ఆదాయ కుటుంబాలు అంత కంటే ఎక్కువే ఆదాయాన్ని కోల్పోయినట్లు పేర్కొంది. కరోనా సంక్షోభంతో 23 కోట్ల మంది పావర్టీ లైన్​ దిగువకు పడిపోయారని తెలిపింది. వీరిలో 15 శాతం గ్రామీణ, 20 శాతం పట్టణవాసులు నిరుపేదలుగా మారారని వెల్లడించింది. 

కన్స్యూమర్​ కాన్ఫిడెన్స్​ దెబ్బతింది
లాక్ డౌన్ వల్ల అంతగా ప్రభావితం కాని వ్యవసాయ రంగం గత ఏడాది ఏప్రిల్ లో 6 మిలియన్ల మందికి అదనంగా ఉపాధి కల్పించింది. కరోనా రెండో దశ గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తుండడంతో ఈ ఏడాది మార్చితో పోల్చినప్పుడు ఏప్రిల్ లో 6.2 మిలియన్ల మంది వ్యవసాయ రంగంలో ఉపాధి కోల్పోయారు. వీరిలో దినసరి కూలీలు, చిన్న వ్యాపారులే 2 లక్షల వరకు ఉన్నారు. ఆదాయ క్షీణత కన్స్యూమర్​ కాన్ఫిడెన్స్ పైనా ప్రభావం చూపిస్తోంది. ఇటీవల రిజర్వ్​బ్యాంక్​ విడుదల చేసిన లెక్కల ప్రకారం కన్స్యూమర్​ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ జనవరిలో 55.5 శాతం ఉంటే మార్చిలో 53.1 శాతానికి తగ్గిపోయింది. అదేవిధంగా రిఫినిటివ్ ఇప్సొస్ విడుదల చేసిన కన్స్యూమర్​ సెంటిమెంట్ ఇండెక్స్ ఏప్రిల్ లో 1.1 శాతం తగ్గగా, మేలో 6.3 శాతం క్షీణించినట్లు వెల్లడైంది. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ, వైద్య ఖర్చుల కోసం ఎక్కువ మంది అప్పులపైనే ఆధారపడుతున్నారు. 46 శాతం పేద, మధ్య తరగతి వారు కుటుంబ పోషణ కోసం అప్పులు చేసినట్లు హోం క్రెడిట్ ఇండియా సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. 27 శాతం మంది నెల వారీ వాయిదాలు కట్టడానికి, 14 శాతం మంది ఉపాధి లేక అప్పులు చేశారని, అత్యధికంగా స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచే అప్పులు తీసుకుంటున్నారని తెలిపింది. 

ఆదుకునేందుకు అనేక చర్యలు
కరోనా సెకండ్​ వేవ్​తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. కేంద్రం గరీబ్ కల్యాణ్ యోజన కింద దేశంలోని 80 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యం, గోధుమలు అందిస్తుండటం కొంత ఊరట కలిగించేదే. కేంద్రం ప్రకటించిన సాయానికి సమానమైన మొత్తాన్ని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు ప్రభుత్వం 2.07 కోట్ల రేషన్ కార్డుదారులకు రూ.4 వేల చొప్పున కరోనా సాయాన్ని అందిస్తోంది. కర్నాటక ప్రభుత్వం కూడా రూ.1,250 కోట్లతో కరోనా రిలీఫ్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లతోపాటు అసంఘటిత రంగ కార్మికులు లబ్ధి పొందుతున్నారు. లాక్ డౌన్ తో ప్రైవేట్​ స్కూళ్లు మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన 2.04 లక్షల మంది టీచర్లు, నాన్​ టీచింగ్​ సిబ్బందికి నెలకు రూ.2 వేల నగదు, 25 కిలోల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. 

జీవితానికి భరోసా కల్పించాలి
పట్టణాల్లో ఉపాధి కోల్పోయి పల్లె బాట పడుతున్న కుటుంబాలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలి. వేతన రేటును పెంచడం ద్వారా వారికి మెరుగైన ఆదాయ మార్గం చూపించాలి. వ్యవసాయ పనులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడం ద్వారా పని రోజులను, పని పొందే వారి సంఖ్యను పెంచడానికి వీలు కలుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో అత్యంత దయనీయంగా మారిన పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం పట్టణ ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టి వారి జీవితాలకు భరోసా కల్పించాలి. నగదు బదిలీ పథకం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల చేతిలో నగదు సరఫరా పెంచే చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. తద్వారా గిరాకీ పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంటుంది.

ఉపాధి పోయింది.. ఆదాయం తగ్గింది
దేశంలో దాదాపు 30 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు అంచనా. కరోనా కారణంగా ఉపాధి దెబ్బతిని ఆదాయం కోల్పోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆహార కొరత, ఆస్తుల అమ్మకాలు, అప్పుల్లో కూరుకుపోతున్నాయి. కుటుంబాల ఆదాయం తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవడమే. సీఎంఐఈ ప్రకారం.. వివిధ రాష్ట్రాలు విధించిన లాక్ డౌన్లతో అన్​ ఎంప్లాయిమెంట్​ రేటు మార్చిలో 6.5 శాతం ఉంటే ఏప్రిల్ నాటికి 7.9 శాతానికి పెరిగింది. ఈ కాలంలో 73.5 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. పట్టణ ప్రాంతాల్లో అన్​ ఎంప్లాయిమెంట్​ రేటు 9.8 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత తక్కువగా ఉండడానికి కారణం వ్యవసాయ కార్యకలాపాలు, ఉపాధి హామీ పనులు కొనసాగుతుండడమే. శ్రామిక భాగస్వామ్య రేటును చూస్తే పట్టణాల్లో మహిళలు 7.2 శాతం, మగవారు 6.6 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు 18.4 శాతం, పురుషులు 64.8 శాతంగా ఉంది. కరోనాతో పట్టణ ప్రాంతాల్లో కుటుంబాల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

- డాక్టర్ ఎం.మల్లారెడ్డి, అసిస్టెంట్​ ప్రొఫెసర్, రాజన్న సిరిసిల్ల జిల్లా