నాందేడ్ నుంచి తెచ్చి మెట్ పల్లిలో గంజాయి అమ్మకం

నాందేడ్  నుంచి తెచ్చి మెట్ పల్లిలో గంజాయి అమ్మకం
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు 
  • వారి వద్ద 220 గ్రాముల గంజాయి స్వాధీనం

మెట్ పల్లి, వెలుగు : మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి కొనితెచ్చి మెట్ పల్లిలో అమ్ముతున్న ముఠాను జగిత్యాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. మెట్ పల్లి టౌన్ కు చెందిన లోకిని వంశీ(26), కోయల్కార్ రమేశ్(21),లోకిని విగ్నేశ్(18) ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలు చేసేందుకు ఈజీగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసి గంజాయి అమ్మేందుకు నిర్ణయించుకున్నారు.  కొన్ని నెలలుగా నాందేడ్ కు చెందిన అజహర్ వద్ద గంజాయి కొనుగోలు చేసి తెచ్చి.. 

మెట్ పల్లి ఏరియాలో రూ.500  ప్యాకెట్ చొప్పున అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం ఎస్ ఐ అనిల్ తో పాటు సిబ్బంది బండలింగపూర్ క్రాసింగ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా నిజామాబాద్ నుంచి మెట్ పల్లికి వెళ్తున్న నంబర్ లేని బైక్ ను ఆపి ముగ్గురిని తనిఖీలు చేశారు. వారివద్ద ఉన్న కవర్ లో గంజాయి దొరికింది. 

ముగ్గురిని అరెస్టు చేసి విచారించగా మెట్ పల్లి నుంచి నిజామాబాద్ రైల్వే స్టేషన్ వరకు బైక్ పై వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ లో నాందేడ్ వెళ్లి గంజాయి కొనుగోలు చేసి మెట్ పల్లిలో అమ్మేందుకు తెస్తున్నామని అంగీకరించారని చెప్పారు. నిందితులు వద్ద బైక్ , మూడు సెల్ ఫోన్లు, 220 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.