
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య మాటల యుద్ధం జరిగిన మరుసటి రోజే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్కు సహయం చేయడానికి అగ్రరాజ్యం అమెరికా నిరాకరించగా.. బ్రిటన్ మాత్రం అండగా నిలిచింది. రష్యాతో యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‍కు భారీ రుణాన్ని ప్రకటించింది బ్రిటన్. ఉక్రెయిన్కు 2.26 బిలియన్ పౌండ్ల (USD 2.84 బిలియన్) రుణాన్ని ఇచ్చేందుకు బ్రిటన్ ఒప్పుకుంది. ఈ మేరకు ఛాన్సలర్ రాచెల్ రీవ్స్, ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి సెర్గి మార్చెంకో రుణ ఒప్పందంపై సంతకం చేశారు. ఇందులో భాగంగా వచ్చే వారం నాటికి ఉక్రెయిన్‌కు మొదటి విడత రుణం అందించనుంది.
ట్రంప్, జెలెన్ స్కీ చర్చలు విఫలం కావడం, ఉక్రెయిన్కు సహయం చేసేందుకు అమెరికా నిరాకరించిన నేపథ్యంలో ఉక్రెయిన్ పరిస్థితిపై చర్చించేందుకు యూరోప్ దేశాలు బ్రిటన్‌లో సమావేశం కానున్నాయి. ఈ భేటీకి హాజరయ్యేందుకు శనివారం (మార్చి 1) జెలెన్ స్కీ ఇంగ్లాండ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ ప్రధాని కీర్ స్టార్మర్ తో జెలెన్ స్కీ భేటీ అయ్యారు. రష్యాతో యుద్ధం, ట్రంప్‌తో జరిగిన చర్చలు గురించి ఇరుదేశాధినేతలు సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం ఉక్రెయిన్కు ఆర్ధిక సహయం చేసి ఆదుకోవాలని జెలెన్ స్కీ కోరగా.. అందుకు బ్రిటన్ పీఎం సానుకూలంగా స్పందించారు.
ఉక్రెయిన్ కు భారీ రుణం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే.. ఉక్రెయిన్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మద్దతు ఉపసంహరించుకుంటామని ట్రంప్ హెచ్చరించడంతో ఉక్రెయిన్కి ఐరోపా దేశాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో అండగా నిలిచి ఆర్థిక సహయం చేసిన బ్రిటన్‌కు జెలెన్ స్కీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో అద్భుతమైన సమావేశం జరిగిందని తెలిపారు.
ఉక్రెయిన్‌తో పాటు మొత్తం యూరప్ ఎదుర్కొంటున్న సవాళ్లు, భాగస్వాములతో సమన్వయం, ఉక్రెయిన్ స్థానాన్ని బలోపేతం చేయడానికి నిర్దిష్ట చర్యలు, బలమైన భద్రతా హామీలతో పాటు న్యాయమైన శాంతితో యుద్ధాన్ని ముగించడం గురించి చర్చించామని వెల్లడించారు జెలెన్ స్కీ. బ్రిటన్ చేసిన ఆర్థిక సహయాన్ని ఉక్రెయిన్‌లో ఆయుధాల ఉత్పత్తికి ఉపయోగిస్తామని తెలిపారు.
రష్యాతో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్కు తిరుగులేని మద్దతు ఇచ్చిన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజలు, ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఉక్రెయిన్ కు సహయం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా నిరాకరించిన 24 గంటల్లోనే అదే దేశానికి బ్రిటన్ భారీగా రుణం ఇవ్వడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.