మనకు కొన్ని పదాల పట్ల అవగాహన లేదు. కానీ, అలాగే వాడేస్తాం. ‘రాష్ట్రీయత’ అంటే ‘జాతీయత’ అనే అర్థం. అలాగే సంస్కృతంలో ‘కుల’ శబ్దం ‘వంశం’గా (రక్తం పంచుకునేవారి మధ్య బంధం). హిందీ ‘జాత్’ అంటే తెలుగులో ‘కులం’ అని అర్థం. అయితే ‘క్యాస్ట్’ అనేది ‘వెబీరియన్’ పదం. ఈ పదాన్ని మొదట ఐరోపావారు సృష్టించారు. రక్తశుద్ధి, చర్మం రంగులపై ఆధారపడిన ఈ పదం తర్వాత కాలంలో సామాజిక నిర్మాణానికి పెట్టారు. ఈ పదానికి వంశ క్రమం అని అర్థం. 1417 నుంచి ఇది స్పానిష్ భాషలో డాక్యుమెంట్ అయిందని పరిశోధకులు తెలిపారు.
1901లో జరిగిన జనగణనలో భారతజాతులను వేలాది కులాలుగా వర్గీకరణ చేసిన బ్రిటీషు సెన్సెస్ కమిషనర్ సర్ రిస్లీ, అలాగే 1927లో సైమన్ కమిషన్‌లోని ఏడుమంది ఆంగ్లేయులు మొదటిసారి కులాలకు సంబంధించిన ‘గెజిట్’ విడుదల చేశారు. మన దగ్గర మనం అంతా ఒకే జాతివాళ్లం అని చెప్పేందుకు ఆధారాలున్నా.. నటించడం నేర్చుకున్నవాళ్లకు ఏం చెప్పే పరిస్థితి లేదు. అన్ని కులాలకు పుట్టుక ఒకే రకంగా ఉంటుందనేది వైదిక ప్రబోధం. ఒక కులంవారు గుడ్డులోంచి.. మరో కులంవారు గర్భంలోంచి పుట్టడం లేదు అనేది వైదిక సాహిత్యం ఘంటాపథంగా చెప్పింది. అనేక సామాజిక, రాజకీయ పరివర్తనలో భాగంగా సమాజంలో సంభవించిన మార్పుల కారణంగా మనకు మనమే కులం అనే దడి కట్టుకొన్నాం. అది మొదట అవసరాల కోసం ఓ సాంఘిక వ్యవస్థగా ఉండి తర్వాత కాలంలో ఈ రోజు రాజకీయ పార్టీల్లాగా వికృత రూపం ధరించింది. మానసికంగా వ్యక్తుల పట్ల గౌరవం లేనివారు ‘మనుర్భవ’ మనిషివికమ్ము అనే వేదాదేశాన్ని విస్మరించినవారు సామాజిక అడ్డుగోడలు నిర్మించారు. అవి తమ రక్షణ కోసం ఉన్నంతవరకు ఏ ఇబ్బందీ లేదు. కానీ, ఇతరులు స్వేచ్ఛను హరించే వైపు నడిస్తే ప్రమాదం.
ఆళ్వార్లు మొదలుకొని అంబేద్కర్ దాకా..
నదులు ఎండిపోయినప్పుడు ఎన్నో మలినాలు కొట్టుకుని వచ్చి అలాగే నదినిండా పరుచుకొని ఉంటాయి. ఓ పెద్ద వరద వచ్చి నదిలో నీళ్లు ప్రవహించగానే అపరిశుభ్రమంతా కొట్టుకునిపోతుంది. అలాగే నది ఎండిపోవడం అంటే జ్ఞాన శూన్యులైన మనుషులుగా మనం మారినప్పుడు ఏదో ప్రవాహంలా ఓ సంస్కర్త వచ్చి ఈ మాలిన్యం తొలగిస్తాడు. అప్పుడు మన హృదయం నిండా పేరుకుపోయిన మలినం తొలగిపోతుంది. ఆళ్వార్లు మొదలుకొని అంబేద్కర్ వరకు కులం విషయంలో ఇలాంటి ప్రయత్నమే చేశారు. వాళ్ల ప్రయత్నం ఇతర దేశాల్లాగా విప్లవాలు, రక్తపాతాలు సృష్టించడం కాదు. భారతీయ దృక్కోణం ఇదే. వ్యక్తుల వ్యక్తిత్వాలు అజ్ఞానంతో నిండిపోయినప్పుడు ఆ అంధకారం తొలగించి చీకటిని కత్తులతో చీల్చేయనవసరం లేదు. ఓ చిన్న దీపం వెలిగిస్తే చాలు. అదంతా పటాపంచలై వెలుగు ప్రసరిస్తుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు, కర్ణుడు ఇద్దరూ ఈ జాతి భేదాలపై తిరగబడ్డవారే. కృష్ణుడు స్వయంగా విదురుని ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాడు. ఆ విదురుడు దాసీ పుత్రుడు. అతని సత్య సంధతకు ధర్మనిష్టకు ధృతరాష్ర్టుని వెన్నులో వణుకు పుట్టేది. వాల్మీకి రాముని పాత్రకు పట్టాభిషేకం చేశాడు. అతడు వేటగాడుగా మారిన ప్రాచేతసుడు. మత్స్యగంధికి పుట్టిన వ్యాసర్షి సమస్త ‘శాస్త్ర ప్రవర్తకుడు’ భారత గ్రంథకర్త. వేద విభాజకుడు.
సమరసత తమిళనాట మొదలైంది
నాయనార్లు అరవై మూడు మంది ఉంటే ఇందులో అన్ని కులాలవారు ఉన్నారు. వీరంతా 5, 6 శతాబ్దాలకు ముందు వెనుక కాలంలో జీవించారు. వీళ్లు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, రక్తపాతాలు లేకుండా కుల సమన్వయం సాధించిన సంస్కర్తలు. ఆ తర్వాత దేవాలయాల నిర్వహణలో దళిత శూద్రులకు భాగస్వామ్యం కల్పించిన శ్రీమద్రామానుజులు తిరుకోష్టియార్ దేవాలయ శిఖరంపైకి ఎక్కి సర్వ జనులకూ అష్టాక్షరి ప్రబోధం చేయడం ఆ కాలానికి తక్కువ పనేమీ కాదు.
తమిళనాడు నుంచి మొదలైన ఈ సమరసతా ఉద్యమం కన్నడ ప్రాంతంలో మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దిలోనే అందుకొన్నాడు. ‘అనుభ వమండపం’లో అన్ని కులాలను కూర్చోబెడితే ఆంధ్ర పల్నాడులో బ్రహ్మనాయుడు ‘చాపకూడు’ పెట్టాడు. ఆ తర్వాత మహారాష్ర్టలో పండరీపురం కేంద్రంగా చంద్రభాగానదీ తీరంలో అభంగాలు, కీర్తనలు రచించిన ఎందరో భక్తశిఖామణులు మనో మాలిన్యం ఇసుమంతలేని కుల సమన్వయం సాధించారు. అలాంటివారిలో తుకారం, సక్కుబాయి, గోరోబా, జ్ఞానదేవ్ వంటి వారెందరో భక్తి ఉద్యమంలో భగవంతుడిని సామాన్యుల గుండెల్లోకి చేర్చారు. ఇందులో ఎక్కడా ఇతర కులాలపై నిందలేదు. ఎవరిపట్లా అణచివేతా లేదు.
కులం మన దృష్టిలో ఎలా..గొప్ప!
ఇటీవల వివిధ కులాలకు చెందిన వ్యక్తుల విగ్రహాల ఆవిష్కరణ జరుగుతున్నది. ఇందులో చాలా కులసంఘాల నాయకులకు ఆరాధ్యనీయుల చరిత్రలు సరిగ్గా తెలియవు. దాంట్లో కూడా రాజకీయ దృక్కోణమే ఉంది. సర్వాయి పాపన్న చరిత్ర జేఏ బోయల్ సేకరించిన మొదటి వీర గేయ గాథ. ఆయన రోమన్ లిపిలో కొంతభాగం చెప్పాడు. దీన్ని మొదట 1934లో గుండు జగన్నాథం అండ్ సన్స్, రాజమండ్రివారు అచ్చు వేశారు. సర్వాయి పాపన్న చరిత్ర తెలుగు ప్రాంతాల్లో ‘మయూరశారదగాండ్రు’ చెప్పేవారు.
అలాగే తెలంగాణలో రెడ్లలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలాంటి వీరుడు సదాశివరెడ్డి, గద్వాల ప్రాంతంలో సోమనాద్రి, పాలమూరి జిల్లాలో పండుగ సాయన్నలు ఎందరో ఉన్నారు. 1750 ప్రాంతంలోనే విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియం (లండన్)లో సర్వాయి పాపన్న చిత్రం ప్రదర్శనకు పెట్టారు. అయితే వీళ్ల స్ఫూర్తి మనకు రావాలంటే వారి చరిత్రలు రేఖామాత్రంగానైనా బయటకు రావాలి. రజకుల్లో గాడ్గే బాబా జీవితం ఊరూరా తెలియాలి.
మనదేశంలోనే దళితుల కోసం మొదటి సత్రం పండరీపురంలో కట్టించిన గాడ్గే బాబాను బాబా సాహెబ్ గురువుగా భావించేవారు. నారాయణగురు కేరళలో శంకరుని అద్వైతం ఆధునికంగా చెప్పి శూద్రకులాల్లో జ్ఞానం నింపినవాడు. ముత్తరాసి కులంలో పుట్టిన వేపురు హనుమద్దాసు కీర్తనలు తెలంగాణ స్థాయిలో నిలబడగల పుష్టి కలిగి ఉన్నాయి. మున్నూరు కాపుల్లో ఇమ్మడిజెట్టి చంద్రయ్య ఆధునిక పద్యకవి, యోగి.
విశ్వకర్మల్లో వీరబ్రహ్మేంద్రస్వామి, కుర్మల్లో మల్లన్న దేవుడు, పద్మశాలీల్లో మార్కండేయుడు .. యాదవుల్లో శ్రీకృష్ణుడు, లంబాడీల్లో సంత్ సేవాలాల్, హథీరాం బాబా, దళితుల్లో దున్న ఇద్దాసు, వైశ్యుల్లో కోమటి వెంకయ్య వంటి మహనీయుల స్ఫూర్తి ఆయా కులాలకు అందినప్పుడే ‘కులతత్వం’ పోయి సామాజిక సమరసత ఏర్పడుతుంది. ఇలాంటి సమరసత సాధించిన వ్యక్తులను ఆయా కులాలకు పరిమితం చేయకుండా వాళ్ల చరిత్రను చెప్పి సర్వజనామోదం కలిగించాలి.
ఆళ్వార్లలో అందరూ ఉన్నారు
ఆదిశంకరుడి మనీషా పంచకం అందరికీ తెలిసిందే. అలాగే ఆయన శిష్యుడైన హస్తామలకుడు చెప్పిన ‘హస్తమలకీయం’లోని 12 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో ‘నేను శుద్ధ బుద్ధ ఆత్మ స్వరూపాన్ని’ అని ఇప్పుడు మనం చెప్పే కులం చట్రంలో లేని విషయం చెప్పాడు. ఆ హస్తమలకీయానికి గురువైన శంకరుడు భాష్యం రచించాడు. అలాగే ఆళ్వార్లు పన్నెండుమందిలో నలుగురు బ్రాహ్మణులు, ఇద్దరు క్షత్రియులు, ఓ వ్యవసాయదారుడు, ఒక దళితుడు, మరో నలుగురి కులం ఏమిటో పరిశోధకులకే తెలిసిరాలేదు. వీరిలో ఒక స్త్రీమూర్తి కూడా ఉన్నారు.
కుల సమన్వయం చాలా గొప్పది
ఉత్తర భారతాన్ని ఉర్రూతలూగించిన వారిలో సంత్ తులసీదాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పరమతపీడనతో హిందూధర్మంలోని కులం కంపును ‘రామ రసాయనం’లో కడిగిన గొప్ప కవి, సంస్కర్త. ఇటీవల ఆయన ప్రతినాయక పాత్రతో చెప్పించిన డైలాగులను ‘రామచరిత మానస్’ నుంచి కట్ చేసి అతడిని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశారు కుబుద్ధులు. కేరళ నుంచి నారాయణగురు, తెలుగు ప్రాంతాల నుంచి అన్నమయ్య, వీరబ్రహ్మం, వేమన, శివరామ దీక్షితులు, బెంగాల్ నుంచి చైతన్య మహాప్రభు, గుజరాత్ నుంచి స్వామి నారాయణ, నర్సీమెహతా, అస్సాం నుంచి శంకర్ దేవ్వంటి ఎందరో మహామహులు దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి ‘కులతత్వం’ మెడలు వంచే ప్రయత్నం చేశారు. దాని ఆధునిక రూపమే దయానంద, వివేకానంద, శ్రద్ధానంద, గణపతిముని, గాంధీ, లోహియా, అంబేద్కర్ ప్రయత్నం.
ఇదంతా సంస్కరణాభిలాషనే. వాళ్లకు కల్మషం లేదు. కొందరు అందరిలోనూ ఆత్మను దర్శిస్తే మరికొందరు అందరిపట్ల సమానదృష్టి అనే స్థితప్రజ్ఞత ప్రదర్శించారు. ఇదంతా లోతుగా పరిశీలించని వారు ఏకపక్షంగా వాదన చేస్తుంటారు. దాంతో విద్వేషాలు నశించడం ఏమోగాని ఎదుటివారిని విమర్శించే కుటిలత్వమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తారు. సామాజిక సమరసత వల్లనే కుల సమన్వయం సాధించవచ్చనేందుకు గౌతమ బుద్ధుడి జీవితమే గొప్ప ఉదాహరణ.
ఆ సమన్వయ సాధనవల్లనే తన జీవితకాలంలో తాను ఆశించిన ఫలితాలను చవిచూసినవాడు బుద్ధుడు. కులం విషయంలో బసవణ్ణ,- గురునానక్ ఒకే పంథా అనుసరించారు. వారు తమ జీవితకాలంలో తాము పరివ్యాప్తం చేసి సిద్ధాంత దర్శనం చేశారు. ఇదంతా తెలియనివాళ్లు ఇప్పుడు కులాన్ని ఓ ‘రాజకీయ అవసరం’గా ఉపయోగించడం మన కళ్లముందు కనపడుతున్న చారిత్రాత్మక అవసరం.. అనవసరం.
- డా. పి. భాస్కరయోగి, సోషల్ ఎనలిస్ట్