బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు.. ఓటమి దిశగా రిషి సునాక్ పార్టీ!

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు.. ఓటమి దిశగా రిషి సునాక్ పార్టీ!
  •     పోలింగ్ పూర్తి.. ఇయ్యాల్నే రిజల్ట్ 
  •     అర్ధరాత్రి నుంచే ఫలితాల వెల్లడి షురూ
  •     అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎదురుగాలి 
  •     ప్రతిపక్ష లేబర్ పార్టీ గెలుస్తుందన్న సర్వేలు

 లండన్: బ్రిటన్  సార్వత్రిక ఎన్నికల్లో  ప్రధాని రిషి సునాక్  కన్జర్వేటివ్  పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. ప్రతిపక్షం లేబర్  పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించనుందని పలు సర్వేలు పేర్కొన్నాయి. బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలకు గురువారం పోలింగ్  నిర్వహించారు. ఇంగ్లండ్ తో పాటు స్కాట్లండ్, వేల్స్, నార్తర్న్  ఐర్లండ్ లోని మొత్తం 650  నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా 40 వేల పోలింగ్  బూత్ లు ఏర్పాటు చేశారు. 

ఉదయం 7 గంటలకు పోలింగ్  ప్రారంభమైంది. 4.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రధాని రిషి సునాక్   (44) తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఉదయం ఓటు వేశారు. నార్త్  యార్క్ షైర్ లోని రిచ్ మండ్  నియోజకవర్గంలో (రిచ్ మండ్  నుంచే రిషి పోటీచేస్తున్నారు) అక్షతతో కలిసి పోలింగ్ బూత్ కు వెళ్లి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

 ఇక రాత్రి 10 గంటలకు (బ్రిటన్  కాలమానం ప్రకారం) పోలింగ్  ముగిసింది. ఆ వెంటనే ఎగ్జిట్  పోల్  ఫలితాలను ప్రకటిస్తారు. పోలింగ్  ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మ్యాజిక్  మార్కు 326 సీట్లు పొందిన పార్టీ అధికారంలోకి వస్తుంది. కాగా.. 14 ఏండ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.

 కీర్  స్టార్మర్ నేతృత్వంలోని లేబర్  పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, 400 సీట్లపైనే ఆ పార్టీకి వస్తాయని పలు సర్వేలు పేర్కొన్నాయి. రిషి నేతృత్వంలోని కన్జర్వేటివ్  పార్టీ ఘోరంగా ఓడిపోతుందని తెలిపాయి.