బ్రిటన్ రాజకీయాల్లో ఇటీవల ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మంత్రివర్గంలో ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామరన్ విదేశాంగ మంత్రిగా చేరారు. ఒక మాజీ ప్రధాని తిరిగి క్యాబినెట్ లో చేరడం అరుదైన విషయం. భారతీయులకు కామరన్ చిరపరిచితుడే కాదు అభిమానపాత్రుడు కూడా. కామరన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మెట్రోలో ఇంటికి వెళ్ళారు. రైలులో కూర్చునేందుకు ఆయనకు రైలులో సీటు కూడా దొరకలేదు. అప్పటి ఆర్థిక మంత్రి ఫిలిప్ హేమండ్ కూర్చుంటే, కామరన్ నిలుచునే ప్రయాణించిన చిత్రాన్ని సమాచార మాధ్యమాలలో చూసిన భారతీయులు ఆయన నిరాడంబరత్వాన్ని ప్రశంసించారు. భారత రాజకీయ నాయకుల నడవడికతో దాన్ని పోల్చి చూసుకున్నారు.
దేశానికి ప్రధానిగా పనిచేసినవాడిని తిరిగి విదేశాంగ మంత్రిగా పనిచేయడమేమిటి అని ఆయన అనుకోలేదు. దేశ ప్రయోజనాల కోసం కొత్త బాధ్యతలను ఆనందంగా స్వీకరించారు. అంతేకాదు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో, ప్రస్తుత ప్రధాని సునాక్ నిరుపమానమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారని విశాల హృదయంతో మనసారా అభినందించారు. ఏడేండ్ల విరామం తర్వాత, కామరన్ తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. విదేశాంగ మంత్రిగా ఉన్న జేమ్స్ క్లెవర్లీకి హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు హోం మంత్రిగా ఉన్న సుయేలా బ్రెవర్‌మాన్‌ను మంత్రివర్గం నుంచి సునాక్ తొలగించారు. మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేసే పరిస్థితులను సుయేలా స్వయంగా కొనితెచ్చుకున్నారనడం వాస్తవానికి మరింత దగ్గరగా ఉంటుంది.
రెండోసారి బర్తరఫ్
నలభై మూడేండ్ల సుయేలా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కావడం ఇది మొదటిసారి ఏమీ కాదు. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ 2022 సెప్టెంబర్ లో సుయేలాను మొదటిసారి హోం మంత్రిగా నియమించారు. పాలనా వ్యవహారాలకు సంబంధించిన భద్రతా నియమాల ఉల్లంఘనకు పాల్పడడంతో సుయేలా రెండు నెలల లోపలే ఆ మంత్రి పదవిని కోల్పోయారు. ఆమె తన వ్యక్తిగత ఇ–మెయిల్ ద్వారా ఒక ప్రభుత్వ డాక్యుమెంట్ ను మరో శాసనకర్తకు పంపారు. ఆ డాక్యుమెంట్ చూసే అర్హత ఆ శాసనకర్తకు లేదు. ఆశ్రయం కోరుతూ శరణార్థులు బ్రిటన్ దక్షిణ కోస్తాకు “దండెత్తినట్లుగా” వచ్చిపడుతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యను క్యాంటర్ బరీ ఆర్చిబిషప్ జస్టిన్ వెల్బీతోపాటు పలువురు ఇతర మతాల అధిపతులు కూడా గత ఏడాది ఖండించారు.
చాలా మంది రువాండాకు “చట్టవిరుద్ధంగా, ప్రమాదకరమైన రీతిలో లేదా పద్ధతుల” ద్వారా చేరుకుని, అక్కడ నుంచి శరణార్థులుగా అర్జీలు పెట్టుకుని బ్రిటన్ కు చేరుతున్నారని సుయేలా చెబుతున్నారు. అటువంటి వారినందరినీ ఒక విమానంలో రువాండాకు తిరిగి పంపించేస్తానని ఆమె కన్జర్వేటివ్ పార్టీ వార్షిక సమావేశంలో గత ఏడాది భీషణ ప్రతిజ్ఞ చేశారు. అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చెబుతున్నా ఆమె ససేమిరా అంటున్నారు. వివిధ పత్రికలకు ఆమె రాస్తున్న వ్యాసాలు కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమిస్తున్నాయి.
శ్రేయోభిలాషి కామరన్
అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా కామరాన్కు మంచి పేరుంది. బ్రిటన్ లో ఉంటున్న భారత సంతతికి చెందినవారు కామరన్ ను ఒక శ్రేయోభిలాషిగా చూస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి 2015లో వెంబ్లేలో ఆయన ఆతిథ్యం ఇచ్చారు. బ్రిటన్ కు ఒక భారతీయుడు ప్రధాన మంత్రి కావడాన్ని తన జీవిత కాలంలోనే చూస్తానని ఆ సందర్భంలో కామరన్ అన్న మాటలు నిజమయ్యాయి. బ్రిటన్ కు సునాక్ ప్రధాని కావడమే కాదు, ఆయన మంత్రివర్గంలోనే ఇపుడు కామరన్ పనిచేస్తున్నారు. సునాక్ కు అండగా నిలుస్తున్నారు.
కామరన్ ప్రధానిగా ఉన్నపుడు తన మంత్రివర్గంలో భిన్నత్వానికి చోటిచ్చారు. కన్జర్వేటివ్ పార్టీని నిజమైన సమ్మిళిత పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఆయన బ్రిటన్ లో ఆలయాలు, మసీదులు, గురుద్వారాలను కూడా సందర్శించేవారు. కామరన్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపడుతూనే భారత్ పర్యటనకు వచ్చారు. భారత్ తో సన్నిహిత సంబంధాలకు కృషి చేశారు. ఆయనను భారతదేశానికి తిరుగులేని మద్దతుదారుగా కొందరు భావిస్తే, చైనా అనుకూలుడుగా మరికొందరు భావిస్తారు. చైనా-, బ్రిటన్ సంబంధాలలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిన వ్యక్తిగా అభివర్ణిస్తారు.
ఇతర దేశాలకూ సంకేతం
కామరన్ ను చాలా మంది ఆధునికునిగా, మధ్యేవాదిగా, దయాళువుగా చూస్తారు. కామరన్ ను విదేశాంగ మంత్రిని చేయడం ద్వారా ఇతర దేశాలకూ ఒక సంకేతం పంపినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ కరడుగట్టిన మితవాదం వైపు నడుస్తోందని, యూరోపియన్ సమైక్యతకు వ్యతిరేకిగా ఉందని వస్తున్న విమర్శలను దీనితో తిప్పికొట్టినట్లయిందని చెబుతున్నారు. ప్రధానిగా పనిచేసిన కాలంలో వివిధ ప్రపంచ నాయకులతో సన్నిహిత స్నేహ సంబంధాలు నెరపిన కామరన్ సేవలు ప్రస్తుతం బ్రిటన్ కు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలగడంపై నిర్వహించిన రెఫరెండంలో ఓటర్లు నిష్క్రమణకే మొగ్గు చూపడంతో కామరన్ 2016లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈయూలో కొనసాగాలని కోరుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ లో ఏర్పడిన మొదటి సంకీర్ణ ప్రభుత్వానికి 2010లో కామరన్ నేతృత్వం వహించారు. ఆయన 43 ఏండ్ల వయసులో ప్రధాని అయ్యారు. “బ్రిటన్ సిసలైన అంతర్జాతీయ దేశం. మా ప్రజలు ప్రపంచమంతటా ఉన్నారు.
మా వ్యాపారాలు ప్రపంచం నలుమూలల ఉన్నాయి. అంతర్జాతీయంగా సుస్థిరత, భద్రత నెలకొనేటట్లు చేయూతనందించే విధంగా పనిచేయడం అత్యవసరమే కాదు, మా దేశ ప్రయోజనాల రీత్యా అవశ్యం కూడా” అని కామరన్ చెబుతున్నారు. బ్రిటన్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ తన ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీకన్నా ఇప్పటికీ దాదాపు 20 పాయింట్లు వెనుకబడి ఉందని వివిధ ప్రజాభిప్రాయ సేకరణల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కామరన్ పునరాగమనం కన్జర్వేటివ్ ల విజయావకాశాలను ఏమేరకు పెంచుతుందో చూడాలి.
హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యునిగా కామరన్
బ్రిటన్లో భారత్ లాగానే రెండు సభలున్నాయి. లోక్ సభ లాంటి హౌస్ ఆఫ్ కామన్స్. దీనిలో 650 మంది సభ్యులుంటారు. వారిని పార్లమెంట్ సభ్యులుగా ప్రజలు ఎన్నుకుంటారు. మన రాజ్యసభ లాంటి హౌస్ ఆఫ్ లార్డ్స్ లో సభ్యుల సంఖ్యపై పరిమితి లేదు. ప్రస్తుతం 780 మంది సభ్యులున్నారని చెబుతున్నారు. లార్డ్స్ సభ్యులంతా నియమితులయ్యేవారే. ప్రధాని సిఫార్సు మేరకు రాజు వారిని నియమిస్తారు. అలా హౌస్ ఆఫ్ లార్డ్స్ లో లైఫ్ పీర్ గా నియమితుడు కాబట్టే కామరన్ ప్రస్తుతం విదేశాంగ మంత్రి పదవిని చేపట్టగలిగారు.
ఆయన ఎగువ సభలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తారు. మంత్రి పదవి చేపట్టాలంటే ఆ రెండు సభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడై ఉండాలి. బ్రెక్సిట్ పై రెఫరెండం తర్వాత, కామరన్ 2016లో తన పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారకుండా హౌస్ ఆఫ్ లార్డ్స్ నిరోధించలేదు. కాకపోతే జాప్యం చేయగలదు. పునఃపరిశీలనకు బిల్లులను హౌస్ ఆఫ్ కామన్స్ కు తిప్పిపంపగలదు. బ్రిటన్ లో రాజ్యాంగ నిబంధనలకన్నా సంప్రదాయాలకు విలువ ఎక్కువ.
అలా, ప్రతిపక్ష నాయకుడు, ఇతర పార్టీల నాయకులు కూడా హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యునిగా ఎవరి పేరునైనా సిఫార్సు చేయవచ్చు. వారు సమావేశాలకు హాజరై తీరాలని నిబంధన లేదు. ఇష్టం మేరకు హాజరుకావచ్చు. వివిధ రంగాలకు చెందిన నిపుణులను లార్డ్స్ సభకు నియమించే విధంగా బ్రిటన్ 1958లో లైఫ్ పియరెజ్ చట్టం చేసుకుంది. అంతకుముందు, డ్యూక్, మాక్వజ్, ఇయర్, విస్కౌంట్, బేరన్ బిరుదులు పొందినవారు మాత్రమే ఎగువ సభలో సభ్యులుగా ఉండేవారు. వారి సభ్యత్వం వారసత్వంగా వారి కుటుంబ సభ్యులకు లభించేది. ఇప్పటికీ ఆ సౌలభ్యం ఉంది. లైఫ్ పీర్ లు మాత్రం తమ సభ్యత్వాన్ని వారసత్వంగా కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి లేదు.
వివాదాల బ్రెవర్‌మాన్
వరుసగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న సుయేలాను మంత్రివర్గం నుంచి తప్పించక తప్పని అనివార్యత సునాక్ ముందు నిలిచింది. ఆమె కొన్ని నెలలుగా మితిమీరిన స్వతంత్రతను ప్రదర్శిస్తూ వస్తున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న సుయేలాకు ఉద్వాసన చెప్పకపోతే అది సునాక్ బలహీనతగా ముద్రపడి ఉండేది. విచిత్రం ఏమిటంటే, సుయేలా కూడా భారతీయ సంతతికి చెందినవారే. ఆమె తండ్రి గోవాకు చెందినవారు. హోం మంత్రి పదవి నుంచి తొలగింపునకు గురైన సుయేలా మున్ముందు తాను మరిన్ని విషయాలను వెల్లడిస్తానంటూ ఒక బెదిరింపు అస్త్రం వదిలారు.
వలసలకు వ్యతిరేకి
భారత్, బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం సుయేలాకు ఇష్టం లేదు. దానివల్ల బ్రిటన్కు భారతీయుల వలస మరింత పెరిగిపోతున్నదని ఆమె ఏడాది క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. వీసా గడువు ముగిసినా రకరకాల సాకులతో బ్రిటన్లో కొనసాగుతున్నవారిలో భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉందని ఆమె వాదన. తలదాచుకునేందుకు గూడు లేనివారికి చారిటీ సంస్థలు గుడారాలు వేసి ఆశ్రయం కల్పించడం కూడా ఆమెకు గిట్టడం లేదు. ఆశ్రయం కల్పించకుండా చారిటీ సంస్థలను నిరోధిస్తూ ఒక చట్టం తీసుకురావాలని కూడా ఆమె కోరుతున్నారు. ఇల్లు లేకపోవడం “ఎంచుకున్న జీవనశైలి” అంటూ ఆమె తాజాగా చేసిన వ్యాఖ్య చాలా మందికి వెగటు పుట్టించింది.
Also Read :- నవంబర్ 24, 25న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ
- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్ జర్నలిస్ట్