ఐదేండ్ల ముందే..హార్ట్ ఫెయిల్యూర్​ను పసిగట్టొచ్చు

లండన్: హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును ఐదేండ్ల ముందే కచ్చితత్వంతో గుర్తించొచ్చని భారత సంతతి ప్రొఫెసర్​తో కూడిన బ్రిటన్ సైంటిస్టుల బృందం కనుగొన్నది. రక్తంలో ఓ ప్రొటీన్ లెవల్స్​ను బట్టి హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు ఎంత ఉందన్నది తెలుసుకోవచ్చని తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ రీసెర్చర్లతోపాటు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో ప్రొఫెసర్ ప్రదీప్ ఝుంద్ ఈమేరకు 800 మంది వాలంటీర్లపై పదేండ్లపాటు స్టడీ చేశారు.

రక్తంలో న్యూరోపెప్టైడ్ వై(ఎన్ పీవై), బీ టైప్ నాట్రీయూరేటిక్ పెప్టైడ్(బీఎన్ పీ) అనే రెండు ప్రొటీన్ల స్థాయిలను తెలుసుకుంటే హార్ట్ ఫెయిల్యూర్​తో చనిపోయే ప్రమాదం ఉన్న వ్యక్తులను ముందే గుర్తించవచ్చని కనుగొన్నారు. ‘‘ప్రస్తుతం హార్ట్ ఫెయిల్యూర్​ను గుర్తించేందుకు రక్తంలో బీ టైప్ నాట్రీయూరేటిక్ పెప్టైడ్(బీఎన్ పీ) ప్రొటీన్ స్థాయిలను లెక్కిస్తున్నారు. అయితే, ఎన్ పీవై ప్రొటీన్ స్థాయిలను బట్టి హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును ఐదేండ్ల ముందే కచ్చితత్వంతో గుర్తించవచ్చని మా స్టడీలో తేలింది” అని ప్రొఫెసర్ ప్రదీప్ చెప్పారు. 

గుండె పంపింగ్ కెపాసిటీ తగ్గితే.. 

గుండెకు రక్తాన్ని పంప్ చేసే శక్తి తగ్గిపోయినప్పుడు దానిపై విపరీతమైన ఒత్తిడి పడుతుందని, ఫలితంగా గుండె కండరాల్లోని నాడులు ఎన్ పీవై ప్రొటీన్​ను రిలీజ్ చేస్తాయన్నారు. దీనివల్ల గుండె లయ తప్పడంతోపాటు రక్తనాళాలు కుంచించుకుపోయి హార్ట్ ఫెయిల్యూర్​తో మరణించే ప్రమాదం పెరుగుతుందన్నారు. రక్తంలో ఎన్ పీవై ప్రొటీన్ స్థాయిలు ఎంత ఎక్కువగా ఉంటే.. ముప్పు అంత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించవచ్చన్నారు. భవిష్యత్తులో రక్త పరీక్షతో ఎన్ పీవై ప్రొటీన్ లెవల్స్​ను గుర్తిస్తే.. హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును నివారించే అవకాశం ఉందన్నారు. ఈ స్టడీ వివరాలు ఇటీవల ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్’లో పబ్లిష్ అయ్యాయి.