బ్రిటన్ నుంచి సంపన్నుల వలసలు

బ్రిటన్ నుంచి సంపన్నుల వలసలు

బ్రిటన్ నుంచి ధనికులు ఇటలీ,  పోర్చుగల్,  స్విట్జర్లాండ్ వంటి తక్కువ పన్ను ఉన్న దేశాలకు తరలి వెళ్లడం ఆర్థిక రంగంలో గణనీయమైన మార్పును సూచిస్తోంది. ఇలా  ఇతర దేశాలకు తరలిపోవడానికి ప్రధాన కారణం యూకేలో అమలవుతున్న అధిక పన్నుల భారం. 2023-24 బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పన్ను రేట్లలో మరింత పెరుగుదల ఉండడంతో సంపన్నులు తమ సంపదను కాపాడుకునేందుకు తక్కువ పన్నులు ఉన్న దేశాలకు మకాం మారుస్తున్నారు.  

యూకే పన్నుల భారంతో  ధనికుల అసంతృప్తి  రోజురోజుకూ పెరుగుతోంది.  అధిక పన్నుల భారాన్ని  యూకేలోని ధనికులు అనుభవిస్తున్నారు. ప్రత్యేకంగా  వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు అత్యధికంగా ఉండటం వారిని కలవరపెడుతోంది.  వారసత్వ పన్ను 40 శాతం వరకు ఉండటం కూడా ఈ తరలి పోవడానికి  ప్రధాన కారణంగా మారింది.  అంతేకాకుండా ఇంగ్లాండ్​ ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ పన్నును 20శాతం పెంచడానికి సిద్ధమవుతోంది.  ఇది సంపన్నులకు అదనపు భారం కానుంది.  మరోవైపు  ఇటలీ,  పోర్చుగల్,  స్విట్జర్లాండ్ దేశాల పన్నులు  ధనిక వర్గాలను ఆకర్షించేటట్టుగా  ఉన్నాయి.

ఇటలీ, పోర్చుగల్​లో  పన్ను రాయితీలు

ఇటలీలోని 'ఫ్లాట్ ట్యాక్స్ రెసిడెన్సీ స్కీమ్' యూకే  సంపన్నులను ఆకర్షిస్తోంది. ఈ పథకం కింద వారు కేవలం 100,000 యూరోల పన్ను చెల్లిస్తే సరిపోతుంది, ఇది యూకేలోని అధిక పన్నులతో పోలిస్తే తక్కువ. పోర్చుగల్  గోల్డెన్ వీసా పథకం కింద పన్ను రాయితీలు పొందేందుకు ఆహ్వానిస్తున్న దేశాలలో ఒకటి.  విదేశీ పెట్టుబడులకు ఇది తక్కువ పన్ను భారం కల్పిస్తున్నది.  కాబట్టి,  యూకే ధనికులు పోర్చుగల్ వైపు  ఆకర్షితులవుతున్నారు.

స్విట్జర్లాండ్​లోని  కొన్ని ప్రాంతాలు, పన్ను విధానాన్ని  సులభతరం చేసి  నివాస స్థలంలో పన్నులను మాత్రమే పరిగణిస్తాయి. దీంతో ధనికులు ఈ దేశంలో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు.

2022-23 కాలంలో యూకే నుంచి ధనికుల వలసల సంఖ్య 18శాతం పెరిగింది. యూకే ఆర్థిక వ్యవస్థపై ప్రభావంస్విట్జర్లాండ్​లో యూకే  నుంచి వచ్చినవారి సంఖ్య 25 శాతం వృద్ధి చెందింది.  పోర్చుగల్​లో  గోల్డెన్  వీసా దరఖాస్తులు కూడా 30 శాతం పెరిగాయి. ఈ గణాంకాలు యూకేలోని సంపదకు తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.  కాగా, ఇంగ్లాండ్​ నుంచి ధనికులు పెద్ద సంఖ్యలో  తరలిపోవడం దీర్ఘకాలంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై భారీస్థాయిలో  ప్రతికూల ప్రభావం చూపవచ్చు.  ధనికులు  ఆర్థిక వ్యవస్థకు  పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు  తీసుకురావడంతో పాటు  పన్నుల చెల్లింపు రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తారు.  ధనిక వర్గాలను  నిలుపుకోకపోతే   యూకేలో  పెట్టుబడులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీంతో యూకే  ప్రభుత్వం ప్రస్తుతం పన్నుల  రాయితీలను పరిశీలిస్తోంది. వినూత్నమైన పన్ను విధానాలు తీసుకురావడం, బ్యాంకింగ్ రూల్స్ సులభతరం చేయడం వంటి మార్గాలను ఆలోచిస్తోంది.

 యూకే నుంచి  ధనికులు తరలిపోవడం పన్ను విధానంలో మార్పులకు దారి తీస్తుంది.  ఒకవైపు ఇటలీ, పోర్చుగల్,  స్విట్జర్లాండ్ వంటి దేశాలు తమ ఆకర్షణలను పెంచుకుంటుండగా,  మరోవైపు ఈ ధనిక వర్గాల వలసలను నివారించడానికి ఆవశ్యకమైన చర్యలు తీసుకోవాలని యూకే సన్నాహాలు చేస్తోంది. 

- డా. చిట్యాల రవీందర్‌‌–