
Vodafone Idea Shares: దేశీయంగా టెలికాం కంపెనీలు గడచిన దశాబ్ధ కాలంగా భారీ ఒడిదొడుకుల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఎంట్రీ. జియో 4జీ ఎంట్రీతో యూనినార్, డొకోమో, విర్జిన్ మెుబైల్స్, ఎయిర్ సెల్ వంటి కంపెనీలు కనుమరుగయ్యాయి. ఇదే సమయంలో ఐడియా, వొడఫోన్ కలిసి పనిచేసేందుకు జతకట్టగా.. కేవలం ఎయిర్ టెల్ మాత్రమే పోరాడి అంబానీ ముందు నిలదొక్కుకోగలిగింది.
నేడు ఇంట్రాడేలో వొడఫోన్ ఐడియా కంపెనీ షేర్లు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. దీనికి కారణం ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సిటి గ్రూప్ నుంచి కంపెనీకి షేర్లకు వచ్చిన కొనుగోలు రేటింగ్. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట సమయంలో కంపెనీ షేర్లు ఒక్కోటి ఎన్ఎస్ఈలో రూ.7.35 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. స్టాక్ ధర భవిష్యత్తులో 67 శాతం పెరుగుదలను నమోదు చేయవచ్చని బ్రోకరేజ్ వెల్లడించింది.
దీంతో వొడఫోన్ ఐడియా కంపెనీ షేర్లపై సిటి గ్రూప్ తన సానుకూల ధృక్పదాన్ని కొనసాగిస్తోంది. ప్రభుత్వం కంపెనీకి చెందిన రూ.3వేల 700 కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలను ఇటీవల ఈక్విటీలుగా మార్చటంతో మెుత్తం కంపెనీలో ప్రభుత్వ వాటా భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో 'high-risk buy' రేటింగ్ సిటి గ్రూప్ అందించింది. సమీప భవిష్యత్తులో స్టాక్ ధర రూ.12 స్థాయికి చేరుకుంటుందని గట్టిగా నమ్ముతున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయాలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం కంపెనీ అధిక సంఖ్యలో వినియోగదారులను కోల్పోవటమేనని తేలింది. అయితే కంపెనీ నెట్ వర్క్ కవరేజ్ మెరుగుపడుతున్నందున నష్టాలు తగ్గుముఖం పచ్చవచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీ 4జీ సేవల విస్తరణను కొనసాగిస్తున్నందున ఈ యూజర్ల సంఖ్య పెరుగుతోందని గుర్తించబడింది. దీంతో నాలుగో త్రైమాసికంలో వొడఫోన్ ఐడియాను వీడే కస్టమర్ల సంఖ్య క్యూ3లో నమోదైన 52 లక్షల నుంచి మార్చి త్రైమాసికంలో 30 లక్షలకు తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది కంపెనీ పనితీరు మెరుగుదలను సూచిస్తుంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.