
Baazar Style Retail Stock: ఇటీవలి కాలంలో రేఖా జున్‌జున్‌వాలా పేరు తిరిగి స్టాక్ మార్కెట్లలో భారీగా వినిపిస్తోంది. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే లక్షల మంది నిరంతరం ఆమె పోర్ట్ ఫోలియోలోని మార్పులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉంటారు. అయితే ప్రస్తుతం వారి సపోర్ట్ ఉన్న ఒక కంపెనీ ఐపీవోగా మార్కెట్లోకి వచ్చింది. ఇది ప్రస్తుతం ఇన్వెస్టర్లకు భారీగా లాభాలను తెచ్చిపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు బ్రోకరేజీలు వెల్లడించాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జున్‌జున్‌వాలా పెట్టుబడులు కలిగి ఉన్న బాజార్ స్టైల్ రిటైల్ కంపెనీ షేర్ల గురించి. గత ఏడాది ఈ కంపెనీ ఐపీవోతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ప్రముఖ బ్రోకరేజీ సంస్థలై జేఎం ఫైనాన్షియల్, నువామా రీసెర్చ్ ఈ కంపెనీ షేర్లపై భారీగా బెట్టింగ్ వేస్తున్నాయి. రానున్న ఏడాదిలో బాజార్ స్టైల్ స్టాక్ ధర ప్రస్తుత మార్కెట్ ధర కంటే 75 నుంచి 80 శాతం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి ద్వారా మంచి రాబడులను పొందాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది ఉత్తమ ఎంపికగా ఉంటుందని బ్రోకరేజీలు చెబుతున్నాయి.
గత ఏడాది సెప్టెంబరులో లిస్ట్ అయిన బాజార్ స్టైల్ కంపెనీ రిటైల్ వ్యాపారంలో వేగంగా స్టోర్ల ఏర్పాటుతో విస్తరిస్తోంది. నేడు మార్కెట్ల ముగింపు సమయంలో ఈ కంపెనీ షేర్ల ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.225.50 వద్ద ఉంది. కంపెనీ ప్రస్తుతం తూర్పు భారతదేశంలో వేగంగా విస్తరిస్తోంది. అలాగే టైర్-2,3 నగరాల్లోని మధ్యతరగతి, ఎగుమ మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళుతోంది. అందుకే ఈ కంపెనీ షేర్లు ప్రస్తుతం కొనదగినవిగా బ్రోకరేజీలు ఎంపిక చేశాయి. ఈ క్రమంలో నువామా కంపెనీ షేర్లకు రూ.388 టార్గెట్ ధరగా ఫిక్స్ చేస్తూ కొనుగోలు రేటింగ్ అందించింది.
Also Read :- ప్రమాదంలో బెంగళూరు టెక్కీలు.. ఇప్పుడు ఇల్లు కొనొచ్చా లేక ఆగాలా..?
2026,27 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి కంపెనీ 40 నుంచి 50 సంఖ్యలో కొత్త స్టోర్లను దేశవ్యాప్తంగా ఓపెన్ చేయవచ్చని నువామా తన అంచనాలను వెల్లడించింది. పైగా కంపెనీకి ప్రస్తుతం బలమైన స్టోర్ అమ్మకాల ట్రాక్ రికార్డు కూడా ఉండటం ఆదాయాల పెరుగుదలకు సహకరిస్తుందని బ్రోకరేజ్ చెప్పింది. ఇదే సమయంలో మరో బ్రోకరేజ్ జేఎం ఫైనాన్షియల్ బాజార్ స్టైల్ షేర్లకు టార్గెట్ ధరను 4 వందల రూపాయలుగా ఫిక్స్ చేస్తూ కొనుగోలు రేటింగ్ అందించింది. సరసమైన ధరలకు దుస్తుల నుంచి జనరల్ మర్చంటైజ్ వరకు అన్ని వస్తువులను ప్రజలకు అందిస్తూ ప్రస్తుతం బాజార్ స్టైల్ మరో డీమార్ట్ తరహా గ్రోత్ సాధించటానికి సిద్ధమౌతోంది. దీనిని తెలివైన ఇన్వెస్టర్లు ఉపయోగించుకోవచ్చు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.