గద్వాల జిల్లాలో ఇసుక బుకింగ్ లలో బ్రోకర్ల దందా..!

గద్వాల జిల్లాలో  ఇసుక బుకింగ్ లలో బ్రోకర్ల దందా..!
  • బ్రోకర్లు బుక్ చేస్తే రెండు రోజుల్లోనే ఇసుక
  • అఫీషియల్ రీచ్ లకు తగ్గిన గిరాకీ

గద్వాల, వెలుగు: జిల్లాలో  ఇసుక  కొనుగోళ్లలో  బ్రోకర్ల రాజ్యం  నడుస్తోంది.  మీ సేవకు వెళ్లి సామాన్యులు ఇసుకను బుక్ చేసుకుంటే అది కస్టమర్ కు ఎప్పుడు చేరుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. అదే బ్రోకర్  ఇసుకను బుక్ చేసుకుంటే రెండు రోజుల్లోనే   డెలివరీ అవుతోంది.  దీంతో చేసేది లేక సామాన్యులు, ఇసుక కావాల్సినవారు బ్రోకర్లనే ఆశ్రయించి ఇసుకను బుక్ చేసుకునే పరిస్థితి నెలకొన్నది.   

ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ఇసుకను బుక్​ చేసి డంపులు పోస్తున్నారు.  బుకింగ్ చేస్తున్న మెసేజ్ ను పెట్టుకుని రాత్రి సమయాల్లో   ఇసుకను కస్టమర్లకు సప్లయ్​ చేస్తున్నారు.  అఫీషియల్ ఇసుక రీచుల నుంచి గతంలో 600 నుంచి 800 ట్రిప్పుల ఇసుక ఆన్ లైన్ లో బుకింగ్ జరుగుతుండగా ఇప్పుడు కేవలం 200 నుంచి 250 ట్రిప్పులు మాత్రమే బుకింగ్​ జరగడాన్ని బట్టి  బ్రోకర్ల జోరు అర్థమవుతోంది. 

రాత్రి అయితే ఇల్లీగల్ దందా..

ఇసుక రీచ్ ల దగ్గర ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఎస్ ఆర్ ఓ (సాండ్ రీచ్ ఆఫీసర్) ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుపుతారు. ఐదు గంటల తర్వాత ఆ రీచ్ ల దగ్గర ఎవరు ఉండరు.  ఆ తర్వాత ఇసుక మాఫియా, బ్రోకర్లు ఎంట్రీ ఇస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం వరకు ఇష్టానుసారంగా ఇసుకను తరలించి వేరే చోట డంపు చేస్తారు.  ఈ ఇసుకును  ట్రాక్టర్ కు 6,500 నుంచి 7500 వరకు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

   ఆన్ లైన్ లో ఇసుకను బుక్ చేసుకోవడం తెలియని వారు బ్రోకర్ల దగ్గరకు వెళ్లి బుక్ చేసుకుంటే ట్రిప్ పై రూ. 500 నుంచి 1000   వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక రీచ్ నుంచి గద్వాలకు ఒక ట్రిప్పు ఇసుక రావాలంటే 5750 ఆన్ లైన్ పేమెంట్ వస్తున్నది. దీంతో బ్రోకర్లు బుక్ చేస్తే అదనంగా 750 రూపాయలు వసూలు చేస్తున్నారు. దాదాపు గద్వాల టౌన్ లోనే 10 నుంచి 15 మంది బ్రోకర్లు ఇదే దందాకు చేస్తున్నట్టు తెలుస్తోంది.   మైనింగ్ ఆఫీసర్లకు ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

 అఫీషియల్ రీచులకు తగ్గిన గిరాకీ

జోగులాంబ గద్వాల జిల్లాలో వేణి సోంపూర్, చిన్న ధన్వాడ, పెద్ద ధన్వాడ, తూర్పు గార్లపాడు, మెన్నిపాడు, మద్దూరు, కేశవరం, అలంపూరు దగ్గర ప్రభుత్వం అఫీషియల్ గా ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసింది. రాత్రి వేళ ఇల్లీగల్ గా ఇసుకను డంపు చేసి సరఫరా చేస్తుండడంతో అఫీషియల్ రీచ్ లకు  ఇసుక బుకింగ్ లు తగ్గాయి. గతంలో 600 నుంచి 800 ట్రిపుల్ ఇసుక బుకింగ్ వస్తుండగా ఇప్పుడు కేవలం 200 నుంచి 250 ట్రిప్పులు మాత్రమే బుకింగ్ జరుగుతోంది.   మీ సేవలో బుక్​ చేసుకుంటే ఆలస్యం కావడంతో సామాన్యులు బ్రోకర్లను
 ఆశ్రయిస్తున్నారు.

బల్కుగా ఇసుకను బుక్ చేయనివ్వడం లేదు

బ్రోకర్ల కు బల్క్ గా ఇసుకను బుక్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక అందుబాటులో ఉండడం వల్ల బ్రోకర్లను ప్రజలు ఆశ్రయించవద్దు. ఇల్లీగల్ ఇసుక దందాపై దృష్టి పెడతాం. గతంలో 40 నుంచి 50 ట్రాక్టర్ల ఇసుక బుక్ చేసుకునే విధంగా ఉండేది ఇప్పుడు దానిని ఐదు ట్రిప్పులకు తగ్గించాం. దీంతో బ్రోకర్ల దందాకు తెర  పడుతుంది.

రమణ,  మైనింగ్ ఏడీ గద్వాల.