- బడా లీడర్లు, పెద్ద రైతులతో కలిసి దళారుల దందా!
- భద్రాద్రికొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి, చండ్రుగొండ, పాల్వంచలో వారం కింద వెలుగులోకి..
- బటయపడితే కేసులు కాకుండా రాజీ కుదుర్చుతున్రు
- ప్రతిఏటా ఇదే తంతు.. పట్టించుకోని అధికారులు!
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులకు దళారులు నాసిరకం విత్తనాలు అంటగడుతున్నారు. బడా లీడర్లు, పెద్ద రైతులతో కలిసి ఈ తరహా మోసాలు చేస్తున్నారు. వారం రోజుల కింద జిల్లాలోని ములుకలపల్లి, చండ్రుగొండ, పాల్వంచ మండలాల పరిధిలో వెలుగులోకి వచ్చినా గుట్టుచప్పుడు కాకుండా రాజీ కుదిర్చినట్లు తెలిసింది.
తక్కువ ధర అంటూ..
రైతులకు విత్తనాలను అమ్మే ముందు గ్రో అవుట్ టెస్ట్ పూర్తి చేసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై 98శాతం కంటే ఎక్కువగా జెనిటిక్ ప్యూరిటీ ఉన్న వాటినే కొనాల్సి ఉంది. కానీ అలాంటివేవీ లేకుండా అధిక దిగుబడి విత్తనాలు తక్కువ ధరకే వస్తున్నాయంటూ నమ్మకస్తులతో దళారులు చెప్పిస్తూ పల్లెల్లో జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. విత్తన చట్టం ప్రకారం ఫెయిల్ అయిన విత్తనాలను నాశనం చేయాల్సి ఉంటుంది.
కానీ కొన్ని కంపెనీలు విత్తనాలను రీ యూజ్ చేస్తూ తక్కువ ధరకు అమ్ముతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులే టార్గెట్‌గా ఇలాంటి విత్తనాలను అమ్మి దళారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. మరో వైపు చీరాల, బాపట్ల, గుంటూరు ప్రాంతాల నుంచి లూజ్ విత్తనాలు తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ తరహా విత్తనాలు ఇప్పటికే చర్ల, ములకలపల్లి, చండ్రుగొండ, పాల్వంచ, ఇల్లెందు, గుండాల, టేకులపల్లి, బూర్గంపహాడ్, ఆళ్లపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో దళారులు అమ్ముతున్నారు.
ప్రతిఏటా మోసమే..
జిల్లాలోని రైతులను ప్రతిఏటా దళారులు మోసం చేస్తూనే ఉన్నారు. విత్తన చట్టాలకు విరుద్ధంగా తెల్ల సంచుల్లో, బ్రాండెట్ కవర్లలో నాసి రకం విత్తనాలను ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రికి రాత్రే అమ్ముతూ ఎప్పటికప్పుడు మకాం మారుస్తున్నారు. ఆ విత్తనాలు నాటి సరైన దిగుబడి రాక రైతులు మోసపోతూనే ఉన్నారు. గత యాసంగిలోనూ చాలా మంది రైతులు ఇదే తరహా మోసానికి గురయ్యారు. చండ్రుగొండ, ములకలపల్లి, ఇల్లెందు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో దాదాపు 200 ఎకరాల్లో యాసంగిలో వేసిన విత్తనాలు సరైన దిగుబడి రాకపోవడంతో రైతులు నష్టపోయారు.
చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో కొందరు రైతులు కొన్న విత్తనాలు నాసిరకం అని తెలిసి డీలర్ల వద్ద ఆందోళనలు చేశారు. దాంతో కొందరు ఆఫీసర్ల సూచనలతో రైతులకు కొంత నష్ట పరిహారం ఇచ్చి ఇటీవల రాజీ చేసుకున్న దాఖలాలున్నాయి. పాల్వంచలోని ఓ విత్తన, ఎరువుల షాప్ ముందు నాలుగు రోజుల కింద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అధిక దిగుబడి అంటూ నమ్మించి మోసం చేశారంటూ రైతులు ఆరోపించారు. గతేడాది ఆళ్లపల్లి మండలంలో నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులు అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు.
దళారులతో కుమ్మక్కై..
కొందరు ఆఫీసర్లు, డీలర్లు, దళారులతో కుమ్ముక్కై నాసిరకం విత్తనాల అమ్మకాలకు సహకరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారు. టేకులపల్లి, సుజాతనగర్ మండలాల్లో గతంలో లైసెన్స్ లేకుండా అమ్మకాలు సాగిస్తున్న విత్తనాలు, మందులు అమ్మే వ్యాపారులపై దాడులు చేసి కొంత సేపటికే అంతా సవ్వంగా ఉందనడంతో రైతులు షాక్ అయ్యారు. నాలుగేండ్ల కిందట లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్ముతున్న ఘటనలకు సంబంధించి 8 కేసులు నమోదయ్యాయి. గతేడాది రెండు మూడు కేసులునమోదయ్యాయి.
ప్రజాప్రతినిధుల ఆగ్రహం..
నాసిరకం విత్తనాలు అమ్మకం, ఏజెన్సీ గ్రామాల్లో దళారుల దందా, ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకంపై శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్‌లో పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ లీడర్లు డీఏవోను కలిసి మోసపోయిన రైతులను ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు.
టాస్క్ ఫోర్స్ టీమ్ లు ఏర్పాటు చేశాం
నాసిరకం విత్తనాల అమ్మకాలు, లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మేవారిపై చర్యలు తీసుకునేందుకు కొత్తగా రెండు టాస్క్ ఫోర్స్ టీమ్‌లు ఏర్పాటు చేశాం. పోలీస్, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ టీమ్‌లో ఉంటారు. ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విత్తనాలు, ఎరువులు అమ్మే వారిపై కేసులు నమోదు చేస్తాం. లైసెన్స్ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. రశీదులు తప్పకుండా తీసుకోవాలి.
బాబూరావు, డీఏవో, భద్రాద్రికొత్తగూడెం