
రైతుపై దళారులు ప్రతాపం చూపించారు.. రక్తం వచ్చేటట్టు కొట్టారు.. ఈ ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రైతు లేనిదే రాజ్యం లేదు.. దేశానికి వెన్నుముక.. అన్నం పెట్టే అన్నదాత.. అంటూ సంవత్సరానికి ఒక స్టేటస్ పెడుతుంటారు కొందరు.. మరి కొందరు రైతుల గురించి అప్పుడో.. ఇప్పుడో ఒక మంచి మాట మాట్లాడుతారు.. కానీ ఈ కాలంలో రైతుల గురించి రైతుల కష్టాలను గుర్తించి మాట్లాడే వారే కరువైపోయారు.. రైతులనే తక్కువ చేసి చూస్తున్నారు.. కంటిముందు రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు మరికొందరు.. రైతు కష్టాన్ని గుర్తించే వారే లేరు..
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధరను ప్రకటించకుండా మోసాలకు పాల్పడుతుంటారు దళారులు.. దళారి వ్యవస్థతతో చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో 2024 మార్చి 22న శుక్రవారం ఓ రైతుపై దళారులు ప్రతాపం చూపించారు. రైతు పండించిన పంటను రోడ్డుపై అమ్ముతుండగా.. రక్తం వచ్చేటట్టు చితకబాది.. వాళ్ల ప్రతాపం చూపించారు.
రైతు పండించిన పూలను తాండూరు పట్టణంలో రోడ్డుపై మండుటెండలో అమ్ముకుంటుండగా.. 35 మంది దళారులు అక్కడికి చేరుకొని రైతును బెదిరించి, అతడిపై దాడి చేశారు. ఆ తర్వాత అతని పంటను నేలపాలు చేశారు. తను పండించిన పంటను బహిరంగ మార్కెట్లో అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేదా అని రైతు వాపోయాడు. ఈ ఘటనతో తాండూరు పట్టణంలో కలకలం రేపింది. దాడిలో గాయపడిన రైతు పెద్దముల్ మండలం జనగామ గ్రామానికి చెందిన వ్యక్తి మాదప్పగా తెలుస్తోంది.