- పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వ్యాపారులు
- లైసెన్సులు లేకున్నా..దర్జాగా కొనుగోళ్లు
- మార్కెట్ ఫీజు ఎగవేత
- 2 శాతం క్యాష్ కటింగ్.. అడత్, హమాలీ పేరుతో కుచ్చుటోపీ
కుభీర్, వెలుగు : రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలకు కొందరు దళారులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా వారిని ముంచుతున్నారు. లైసెన్సులు ఉండి మార్కెట్ యార్డులోనే కొనుగోలు జరపాలని రూల్స్ఉన్నప్పటికీ.. దళారులు ఎక్కడ పడితే అక్కడ కాంటాలు ఏర్పాటు చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. కొందరు లైసెన్సులు లేకున్నా దర్జాగా కొనుగోలు జరుపుతూ మార్కెట్ ఫీజు ఎగ్గొడుతున్నారు. కొందరు దళారులు రైతుల నుంచి 2 శాతం క్యాష్ కటింగ్, హమాలీ పేరుతో ఒక క్వింటాల్‌కు మూడు కిలోల ధాన్యాన్ని కట్ చేస్తున్నారు.
ఆయా కటింగ్ల కారణంగా సోయా రైతులు క్వింటాల్‌కు సుమారు రూ.400 నష్టపోతున్నారు. మార్కెట్లో వేసి గిట్టుబాటు ధర పొందుదామనుకుంటే ఆన్లైన్లో పంట నమోదు లేకపోవడంతో గత్యంతరం లేక దళారులకు అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో సోమవారం మార్కెట్లో సోయా కొనుగోలు జరిపారు. అయితే కొనుగోలు చేయడానికి ముగ్గురు వ్యాపారస్తులు మాత్రమే ముందుకు వచ్చారు.
గవర్నమెంట్ రేట్ రూ.4982 ఉండగా రూ.4350 మాత్రమే చెల్లించారు. ఆన్లైన్లో చాలా మంది పేర్లు లేకపోవడం దళారులకు వరంగా మారింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్ ఫీజు చెల్లించకుండా అక్రమంగా కొనుగోలు జరిపే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవా లని రైతులు కోరుతున్నారు.