వడ్ల పైసలు ఎగ్గొడుతున్రు.. కోట్లు కాజేసి చెక్కేస్తున్న బ్రోకర్లు

  • దళారుల చేతిలో బాధితులవుతున్న రైతులు
  • కోట్లు కాజేసి చెక్కేస్తున్న బ్రోకర్లు
  • న్యాయం చేయాలని కోరుతున్న అన్నదాతలు 

నిజామాబాద్​, వెలుగు: జిల్లా రైతుల నుంచి వడ్లు  కొన్న దళారులు ఆ పైసలను ఎగ్డొడుతున్నారు.  ఏటా ఈ ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.   ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో అసౌకర్యాలు  ఉండటం, తరుగు తీస్తుండటంతో  రైతులు చాలామంది దళారులను ఆశ్రయిస్తున్నారు.  ఇదే అదనుగా దళారులు కాంటలు పెడుతున్నారు. వేల టన్నుల్లో  వడ్లు కొని  డబ్బులు  రేపిస్తాం, మాపిస్తాం అంటూ ఆలస్యం చేస్తున్నారు.  డబ్బులు చెల్లించాలని రైతులు ఎవరైనా గట్టిగా అడిగితే వారిపై కేసులు పెట్టేందుకు కూడా ఆలోచించడం లేదు.  

మిల్లు లీజు ముసుగులో .. 

బోధన్​-బాన్సువాడ రోడ్డు పక్కన ఉండే ఓ మిల్లును లీజుకు  తీసుకొని హైదరాబాద్​కు చెందిన వ్యక్తి సుమారు రూ.5 కోట్ల విలువ వడ్లు కొనుగోలు చేసి బోర్డు తిప్పేశాడు.   రైతులకు విషయం తెలిసే సరికి మరో లీజుదారు వచ్చాడు.  బాధిత రైతులు మిల్లు వద్దకు వెళ్లి డబ్బుల కోసం ఆందోళన చేయగా పోలీసులు వచ్చి మోసగాడు వేరని,  ఇప్పడు మిల్లు నడుపుతున్న వ్యక్తి వేరని వెళ్లకపోతే కేసులు పెడతామని బెదిరించడంతో ఇప్పటికి నాలుగుసార్లు వాపసు వెళ్లారు.

డబ్బులు ఎగ్గొట్టి దుబాయ్​కి.. 

రెంజల్​ మండలంలో కూడా   రూ.3 కోట్ల విలువైన  వడ్లు  కొన్న ఓ వ్యక్తి  డబ్బులు ఎగ్గొట్టి దుబాయ్​ చెక్కేశాడు.  అతని కుటుంబీకులు తమకేమీ సంబంధంలేదని చెప్పడంతో బాధితులు ఏమీచేయలేకపోతున్నారు.  అంతకు ముందు ఎడపల్లి, బోధన్​లో ని మరో మిల్లుకు చెందిన దళారి  రూ. 4 కోట్లతో ఉడాయించాడు.  ఇలా ప్రతి సీజన్​లో జిల్లాలో ఎక్కడోచోట ఎగవేత ఘటనలు వెలుగులోకి  వస్తున్నాయి. ప్రతి సీజన్​లో కమీషన్​ ప్రతిపాదికన దళారులను  ఏర్పాటు చేసుకొని మిల్లర్లు వీలైనంత మేరకు వడ్లు  కొంటున్నారు.  పేమెంట్ల విషయంలో రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు. రైతును బట్టి పేమెంట్లు ఇస్తున్నారు.  ఆలస్యమైతే వడ్డీ ఇస్తామని నమ్మబలికి నిండా ముంచుతున్నారు.  మరి కొందరు ఉద్దేశ్యపూర్వకంగా రైతులకు టోపీ పెడుతున్నారు. లావాదేవీలకు చట్టబద్ధత లేకపోకపోవడవంతో చివరకు రైతులే బాధితులవుతున్నారు.   దళారులు  నడిపే కాంటాలపై అధికారులు  చర్యలు తీసుకొని,  న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. 

రూ. 1.30 కోట్లు హాంఫట్​..  దళారిని అడ్డుకున్న రైతులు

భీంగల్​: కిందటి ఏడాది  వడ్లను  కొని నేటికీ డబ్బులు ఇవ్వని గంప శ్రీనివాస్ అనే  దళారిని రైతులు మంగళవారం నిర్బంధించారు. భీంగల్​ మండలంలోని మూడు గ్రామాల పరిధిలో  120 మంది రైతుల నుంచి రూ.కోటి 30 లక్షల విలువ గల  వడ్లుకొని,  అతను ఇప్పటికీ  డబ్బులు ఇవ్వలేదు. కాగా ఈ ఏడాది వడ్లు కొనేందుకు గ్రామాల్లోకి రాగా.. అతన్ని భీంగల్​లో ఉదయం అడ్డుకొని, స్థానికంగా ఓ గదిలో నిర్బంధించారు.  పోలీసులు అక్కడికి చేరుకొని  రైతులను సముదాయించారు. పోలీసుల ముందు ఓ మాట, వాళ్లు వెళ్లాక మరోమాట మాట్లాడిన దళారిని రైతులు రాత్రి వరకూ వదిలిపెట్టలేదు.