![వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన వినేశ్ ఫొగట్](https://static.v6velugu.com/uploads/2022/09/Bronze-medal-for-Vinesh-Phogat_rTpAQ6a14y.jpg)
బెల్‌గ్రేడ్: కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ వినేశ్ ఫొగట్.. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. బుధవారం జరిగిన విమెన్స్ 53 కేజీ బ్రాంజ్ ప్లే ఆఫ్ బౌట్‌లో వినేశ్ 8–0తో జొన్నా మాల్‌మెగ్రెన్ (స్వీడన్)పై గెలిచింది. దీంతో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా తరఫున రెండు పతకాలు సాధించిన తొలి విమెన్ రెజ్లర్‌గా రికార్డు సృష్టించింది. 2019లోనూ వినేశ్ బ్రాంజ్‌ను గెలుచుకుంది. ఓపెనింగ్ బౌట్‌లో ఓటమి ఎదురైనా.. తన ప్రత్యర్థి బక్తుయన్ ఫైనల్స్‌కు వెళ్లడంతో వినేశ్‌కు రెప్‌చేజ్ ఆడే చాన్స్ వచ్చింది.
ఈ రౌండ్లో వినేశ్ 4–0తో జుల్డాజ్ ఎషిమోవా (కజకిస్తాన్)పై, తర్వాతి బౌట్‌లో లేలా గుర్బనోవా (అజర్‌బైజా)పై గెలిచి బ్రాంజ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. విమెన్స్ 57 కేజీ బౌట్‌లో సరితా మోరె 4–2తో హన్నా టేలర్ (కెనడా)పై గెలిచినా, తర్వాతి రౌండ్‌లో 0–7తో అన్హెలినా లైసర్ (పోలెండ్) చేతిలో ఓడింది. 59 కేజీ క్వార్టర్‌ఫైనల్లో మాన్షి అహ్లవత్ 3–5తో జొవితా మరియా వ్రెజిసెన్ (పోలెండ్) చేతిలో పరాజయంపాలైంది. 68 కేజీ సెమీస్‌లో నిషా దహియా 4–5తో అమి ఇషీ (జపాన్) చేతిలో కంగుతిన్నది.