
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ వైట్ బాల్ ఫార్మాట్ కొత్త కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీలో జట్టు చెత్తగా ఆడటంతో జోస్ బట్లర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా అతని స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బ్రూక్‌కు వన్డే, టీ20 పగ్గాలు అప్పగించింది. హ్యారీ బ్రూక్‌ను ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసినప్పటికీ ఈ సీజన్ నుంచి అతను తప్పుకున్నాడు. తమ దేశం తరఫున కెరీర్‌పై దృష్టి సారించాలన్న ఉద్దేశంతో బ్రూక్ ఈ నిర్ణయం తీసుకోగా ప్రతిగా బీసీసీఐ అతడిని ఐపీఎల్‌లో రెండు సీజన్లు బ్యాన్ చేసింది.
కాగా, 2022లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన బ్రూక్.. వైట్ బాల్ జట్టులో కీలక భాగంగా మారాడు. గత సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో బట్లర్ లేకపోవడంతో బ్రూక్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. ఇప్పుడు పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టాడు. ‘ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా ఎంపిక కావడం నాకు గొప్ప గౌరవం. నా కల నెరవేరింది’ అని బ్రూక్ పేర్కొన్నాడు.