హైదరాబాద్: హయత్నగర్ పరిధిలో విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన థార్ కారు స్కూటీని ఢీకొట్టడంతో అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు ప్రయాణిస్తున్న నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.
పండగకు ఊరికి వెళ్తుండగా ప్రమాదం
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అన్నాచెల్లెలు స్కూటీపై చెల్లెలి నాలుగేళ్ల కుమార్తెతో కలిసి పండగ సందర్భంగా స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో హయత్నగర్ వద్ద విజయవాడ హైవేపైకి వచ్చిన థార్ కారు వారి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నాచెల్లెలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
ప్రమాదం కారణంగా విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన థార్ కారు ఓ పోలీస్ అధికారికి చెందినదిగా సమాచారం. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. మృతుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
