
- అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోన్న అక్కా తమ్ముడు
- పిల్లలను కాపాడుకోవాలంటే ఖరీదైన వైద్యం అవసరమన్న డాక్టర్లు
- దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న బాధిత తల్లిదండ్రులు
బెల్లంపల్లి, వెలుగు: ఇద్దరు చిన్నారులకు అరుదైన ప్రాణాంతకమైన వ్యాధి రావడంతో తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా మారింది. వైద్యానికి కోట్లలో డబ్బులు కావాలని డాక్టర్లు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంపల్లి టౌన్ టేకులబస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి, కల్యాణ్ దాస్ దంపతులకు కుమార్తె సహస్ర(7), కొడుకు మహావీర్(4) ఉన్నారు. పిల్లలిద్దరూ అరుదైన ప్రాణాంతక స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ(ఎస్‌ఎంఏ) జబ్బుతో బాధపడుతున్నారు. కదలలేని స్థితికి చేరుకుంటున్నారు.
చిన్నారుల ప్రాణాలను కాపాడాలంటే ఎంతో ఖరీదైన ట్రీట్ మెంట్ చేయాల్సి ఉంటుందని, ఒక్కొక్కరికి రూ. 16 కోట్ల చొప్పున రూ. 32 కోట్లు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియడంలేదు. ప్రస్తుతం పిల్లలకు మెడిసిన్ కోసం రూ. 13 లక్షలు కావాలని వాపోతున్నారు. కల్యాణ్ దాస్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేస్తున్నాడు. ఇప్పటికే పిల్లల చికిత్స కు రూ. 10 లక్షల వరకు అప్పు చేసి ఖర్చు చేశారు. ఇప్పుడు ఖరీదైన వైద్యం చేయించాల్సి ఉండడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ పిల్లల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 8897494155 ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా అందించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.