కొత్తకోట, వెలుగు: తనకు చేతబడి చేయించాడనే అనుమానంతో సొంత అన్నను చంపేశాడో తమ్ముడు. ఎస్సై మంజునాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమేట గ్రామానికి చెందిన కురుమన్న(44) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఓ మంత్రగాడిని కలిసి తన సమస్యను వివరించాడు. ‘నీకు ఎవరో చేతబడి చేశారు’ అని మంత్రగాడు చెప్పడంతో కురుమన్నకు తన పెదనాన్న కొడుకు అయిన పెంటన్న(64)పై అనుమానం పెంచుకున్నాడు.
రోజూ రాత్రి పూట పొలం వద్ద ఉన్న గదిలో పడుకునే పెంటన్నను చంపాలని కురుమన్న స్కెచ్‌వేశాడు. గురువారం రాత్రి పొలం వద్ద నిద్రపోతున్న అన్నపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు అంటుకోవడం, గదిలో నుంచి పొగలు, వెలుతురు రావడంతో సమీపంలోని రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసేసరికి పెంటన్న చనిపోయి ఉన్నాడు. డెడ్‌బాడీ కాలిపోతూ ఉండగా నీళ్లు చల్లి ఆర్పివేశారు. నిందితుడు కురుమన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. పెంటన్నకు మంత్రాలు వచ్చని, తనపై చేతబడి చేశాడనే అనుమానంతో హత్య చేసినట్లు చెప్పాడు. డెడ్‌బాడీని వనపర్తి మార్చురీకి తరలించి, కేసు ఫైల్చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.