- మహారాష్ట్రలోని పూణేలో నారాయణపేట జిల్లా వాసుల గొడవ
ధన్వాడ, వెలుగు : భూమి పత్రాలు అడిగినందుకు తమ్ముడిని అన్న చంపేశాడు. మహారాష్ట్రలోని పూణే నగరంలో ఈ ఘటన జరిగింది. మృతుడు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని బుడ్డమరి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మేకబండ తండాకు చెందిన వాడు. మేకబండ తండాకు చెందిన రామ్, లక్ష్మణ్ (42) అన్నదమ్ములు. వారు పూణేలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. వారికి వారసత్వంగా ఐదెకరాల భూమి వచ్చింది.
దీనిని తమ్ముడికి తెలవకుండా అన్న తన పేరిట మార్చుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో నిర్వహించే అభయహస్తం గ్రామసభలో దరఖాస్తు చేసుకునేందుకు లక్ష్మణ్ తన భార్యను మంగళవారం తండాకు పంపించాడు. తాను అన్న రామ్ తో మాట్లాడి భూమిపత్రాలు తీసుకొస్తానని చెప్పాడు. అదే రోజు రాత్రి లక్ష్మణ్.. అన్న రామ్ ఇంటికి వెళ్లి భూమిపత్రాలను అడగగా, నన్నే పత్రాలు అడుగుతావా? అంటూ లక్ష్మణ్ ను రామ్ రాడ్ తో కొట్టాడు.
దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. శవాన్ని పూణేలో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి కింద పడేసి, మరుసటి రోజు పోలీసుల ముందు నిందితుడు లొంగిపోయాడు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి, డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతదేహం శుక్రవారం గ్రామానికి వచ్చే అవకాశం ఉందని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు.