తెలియకుండా భూమి అమ్మారని వికలాంగురాలైన చెల్లెపై గొడ్డలితో దాడి

  •     ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఘటన 

వెంకటాపూర్( రామప్ప), వెలుగు : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో తనకు తెలియకుండా భూమి అమ్మారని కోపం పెంచుకున్న అన్న వికలాంగురాలైన చెల్లెలిపై మంగళవారం గొడ్డలితో దాడి చేశాడు. గ్రామస్తుల కథనం ప్రకారం..లక్ష్మీదేవిపేటకు చెందిన పొన్నం శ్రీహరి, రాధమ్మకు కొడుకు సమ్మయ్యతో పాటు లక్ష్మి, రమ, సారక్క అనే బిడ్డలున్నారు. ఇందులో సారక్క వికలాంగురాలు. లక్ష్మికి పెండ్లి చేసి పంపగా, రమ, సారక్క తల్లిదండ్రులతోనే ఉండేవారు. కొన్నేండ్ల కింద తండ్రి శ్రీహరి చనిపోగా తల్లి వారిని చూసుకునేది.

సమ్మయ్యకు పెండ్లి కాగా చెల్లెళ్లను, తల్లిని పట్టించుకోకుండా హైదరాబాద్​లో పని చేసుకుంటున్నాడు. దీంతో రాధమ్మ, సారక్క, రమకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో  ఇటీవల సారక్క పేరిట ఉన్న భూమిని విక్రయించారు. దీంతో కొడుకు సమ్మయ్య తనకు తెలియకుండా ఎలా అమ్ముతారని, తనకు చెప్తే కొనేవాడిని కదా అని పంచాయితీ పెట్టించాడు. పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లాడు.

హైదరాబాద్​నుంచి వచ్చిన సమ్మయ్య  మంగళవారం ఉదయం ఇదే విషయమై సారక్కతో గొడవ పెట్టుకొని గొడ్డలితో తలపై, భుజంపై కొట్టాడు. దీంతో ఆమె  తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ములుగు ఏరియా దవాఖానకు తరలించారు. వెంకటాపురం ఎస్సై చల్లా రాజు సమ్మయ్యను, ఇతడి భార్య ఇందిరను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.