హుజురాబాద్ రూరల్, వెలుగు: ఓ వ్యక్తి ఆస్తి కోసం అన్నను హత్య చేశాడు. ఇందుకు తల్లిదండ్రులు సైతం సహకరించారు. ఈ ఘటన హుజురాబాద్ మండలం రాజపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజపల్లికి చెందిన నోముల చంద్రయ్య, ఎల్లమ్మకు కుమారులు రాజు (30), అంజి ఉన్నారు. రాజు గ్రామంలోనే కూలీ పనులకు వెళ్తుండగా, అంజి హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అంజి విపరీతంగా అప్పులు చేశాడు.
ఈ క్రమంలో తల్లిదండ్రులు సంపాదించిన పొలం తనకు ఇవ్వాలని అన్న రాజుతో తరచూ గొడవ పడేవాడు. అన్నను హత్య చేస్తే ఆస్తి అంతా తనకే దక్కుతుందన్న ఆలోచనతో రాజును మర్డర్ చేయాలని ప్లాన్ చేశాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రాజుపై తల్లిదండ్రులతో కలిసి కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రాజు అక్కడికక్కడే చనిపోయాడు. శనివారం ఉదయం ముగ్గురు పారిపోయేందుకు ప్రయత్నించారు. రాజు ఎంతకూ బయటకు రాకపోవడంతో గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూసే సరికే చనిపోయి కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ తిరుమల్‌గౌడ్, ఎస్సై యూనస్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అప్పటికే హుజురాబాద్ పారిపోయిన రాజు తల్లిదండ్రులు చంద్రయ్య, ఎల్లమ్మ, తమ్ముడు అంజిని అదుపులోకి తీసుకున్నారు.