- ఫొటోలు తీసిన అక్కడి జనాలు
- శవాన్ని వదిలి పోలీసులకు లొంగిపోయిన నిందితులు
- ఆస్తి తగాదాలతో మర్డర్ చేసిన అన్నదమ్ములు
- గద్వాల జిల్లాలో పెద్ద ధన్వాడలో ఘటన
శాంతినగర్, వెలుగు : పొలం తగాదాలతో అన్న , తమ్ముడు కలిసి సోదరుడిని హత్య చేసి బైక్‌పై డెడ్‌బాడీని ఏపీకి తీసుకువెళ్తుండగా అక్కడి జనాలు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో భయపడ్డ వారు శవాన్ని అక్కడే వదిలేసి పోలీసులకు లొంగిపోయారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం...జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్‌రెడ్డి, శేషిరెడ్డి అలియాస్ అగ్గిపుల్ల, చిన్న నాగిరెడ్డి అన్నదమ్ములు. వీరి మధ్య ఏడాది నుంచి ఆస్తి తగాదాలున్నాయి. ఆదివారం ఉదయం చిన్న నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి కలిసి శేషిరెడ్డిని చంపారు. ఎవరికీ అనుమానం రాకుండా బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకుని మొహంపై షర్ట్ కప్పి తీసుకువెళ్తున్నారు.
ఏపీలోని సుంకేసుల–కొత్తకోట గ్రామాల మధ్యలో అనుమానం వచ్చిన కొందరు వీరి ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. ఇది గమనించిన అన్నాదమ్ములు ఆ రెండు గ్రామాల మధ్య డెడ్‌బాడీ పడేసి వెళ్లారు. సమాచారం అందుకున్న కోడుమూరు సీఐ, సి.బెళగల్, గూడూరు ఎస్ఐలు అక్కడికి చేరుకొని శవాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. నిందితులు అక్కడి పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. హత్య ఎక్కడ జరిగిందో తెలియరాలేదని, ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాజోలి ఎస్ఐ జగదీశ్ తెలిపారు.