
- అడ్డుకోబోయిన అన్నపై కత్తితో దాడి
- హైదరాబాద్ ఓల్డ్ మలక్ పేటలో ఘటన
మలక్ పేట, వెలుగు: తల్లి పెన్షన్ పైసల కోసం సొంత అక్కను కత్తితో పొడిచి చంపాడో తమ్ముడు. అడ్డుకోబోయిన అన్నపైనా దాడి చేశాడు. ఈ ఘటన ఓల్డ్ మలక్ పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన ప్రకారం.. ఓల్డ్‌మలక్‌పేటలోని వెంకట రమణ అపార్ట్మెంట్లో ఉండే అనసూయ(90)కు ఇద్దరు కొడుకులు సుదర్శన్(70), మదన్ రావు(63), కూతురు లక్ష్మి(68) ఉన్నారు. వీళ్ల ముగ్గురికి పెండ్లి కాలేదు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయిన అనసూయ భర్త రెండేండ్ల కింద చనిపోయాడు. అప్పటి నుంచి అనసూయకు పెన్షన్ అందుతోంది.
కాగా, బుధవారం అర్ధరాత్రి మదన్ రావు ఫుల్లుగా మద్యం తాగొచ్చి, పెన్షన్ డబ్బులు తనకే ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు. అక్క లక్ష్మి, అన్న సుదర్శన్ వారించగా, కోపంతో ఊగిపోయిన మదన్ రావు వంటగదిలోని కత్తితో లక్ష్మిని పొడిచి చంపాడు. అడ్డుకోబోయిన సుదర్శన్ పై కత్తితో దాడిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మదన్ రావును అదుపులోకి తీసుకున్నారు. పెన్షన్ డబ్బుల విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
కుటుంబంలో ఎవరికీ పెళ్లిళ్లు కాకపోవడంతో అందరూ మానసికంగా కుంగిపోయారన్నారు. మదన్ రావు గతంలో ఇలాగే అన్న సుదర్శన్‌పై దాడి చేసి గాయపరిచాడని, అతనిపై కేసు ఉన్నట్లు తెలిపారు. తాగుడుకు బానిసైన మదన్ రావు మానసిక స్థితి సరిగా లేదని, ఎప్పుడూ ఆందోళనగా ఉంటాడని తెలిసింది.