
- ఇండ్లలో దొంగతనం చేస్తున్న ఇద్దరు అరెస్ట్
మలక్ పేట, వెలుగు: ఇండ్లల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేశారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర వివరాల ప్రకారం.. షాహీన్ నగర్ కు చెందిన హాబీబ్ మహ్మద్ (37), మొఘల్ పురాకు చెందిన హాబీబ్ అలీ(49) అన్నదమ్ములు. హాబీబ్ మహ్మద్ ఇండ్లలో ప్లంబర్‌గా పనులు చేస్తూ దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు.
తమ్ముడు చోరీ చేసి తెచ్చిన సొత్తును అన్న అమ్మకాలు చేసి, నగదు వాటాలు వేస్తుంటాడు. హాబీబ్ మహ్మద్ దాదాపు 59 దొంగతనాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. కొన్ని కేసుల్లో కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్కూడా జారీ అయ్యింది.
ఇటీవల రెండు రోజుల క్రితం సైదాబాద్ లోని ఓ ఇంట్లో దొంగతనం చేసి, 145 గ్రాముల బంగారం దొంగలించాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, హాబీబ్ మహ్మద్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడిని పట్టుకుని విచారించగా, సగభాగం తన అన్న హాబీబ్ అలీకి ఇచ్చినట్టు చెప్పడంతో ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 145 గ్రాముల బంగారం, 3 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.