మంచిర్యాల, వెలుగు: అనారోగ్యానికి గురైన చెల్లిని ఎత్తుకుని వాగు దాటించారా సోదరులు. వాగు అవతల రెడీగా ఉన్న అంబులెన్సులో హాస్పిటల్కు తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన నిట్టూరి ప్రవళిక(16)కు శనివారం మధ్యాహ్నం ఫిట్స్ వచ్చాయి. చెన్నూరు హాస్పిటల్కు తరలించేందుకు 108కు కాల్ చేశారు. అంబులెన్స్ గ్రామ శివారులో వాగు వరకు వచ్చి ఆగిపోయింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలతో వాగుకు వరద వచ్చింది. దీంతో ప్రవళికను ఆమె సోదరులు స్కూటీపై వాగు వరకు తీసుకొచ్చారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెల్లెలిని భుజాలపై ఎత్తుకొని అతికష్టంగా వాగు దాటారు. అనంతరం అంబులెన్స్ లో చెన్నూర్ హాస్పిటల్ కు తరలించారు. వాగుపై గ్రామస్తులు నిర్మించుకున్న రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో వాగు పొంగినప్పుడు చెన్నూరు వెళ్లేందుకు నానా పాట్లు పడుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అభివృద్ధి ఇదేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల కష్టాలను గాలికొదిలిన సుమన్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యాడని మండిపడుతున్నారు. ఇప్పటికైనా వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.