
పరకాల/మల్హర్, వెలుగు : గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్‌పై వెళ్తున్న అన్నదమ్ములు చనిపోయారు. ఈ ప్రమాదం హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని కంఠాత్మకూరు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. దామెర ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం గ్రామానికి చెందిన ఉప్పుల రాజ్‌కుమార్ (25), ఉప్పుల శంకర్ (22) అన్నదమ్ములు.
రాజ్‌కుమార్ హనుమకొండలో ప్రైవేట్ జాబ్ చేస్తుండగా, శంకర్ హనుమకొండలోని హాస్టల్‌లో ఉంటూ ఐటీఐ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల టైంలో వీరిద్దరు కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన తమ ఫ్రెండ్ శివతో కలిసి బైక్‌పై నాచారం గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కంఠాత్మకూరు గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్దకు రాగానే వీరి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో రాజ్‌కుమార్ అక్కడికక్కడే చనిపోగా, శంకర్, శివ తీవ్రంగా గాయపడ్డారు.
గమనించిన స్థానికులు 108లో ఎంజీఎంకు తరలిస్తుండగా శంకర్ చనిపోయాడు. శివ ప్రస్తుతం హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. మృతుల తండ్రి చంద్రం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా అన్నదమ్ములు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో నాచారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
టిప్పర్ బోల్తా పడి ఒకరు మృతి
నిజాంపేట, వెలుగు : టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ యువకుడు చనిపోగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కర్నాటక రాష్ట్రానికి చెందిన కూలీలు 765 నేషనల్ హైవే పక్కన సైన్ బోర్డుల బిగించే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో టిప్పర్‌లో సైన్ బోర్డులు వేసుకొని వస్తుండగా నిజాంపేట శివారులోకి రాగానే టిప్పర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో రాయచూర్‌కు అంబరీశ్ (28) చనిపోగా, శివ, దుర్గేశ్, సాహు, సత్తప్ప, లక్ష్మణ్, తిప్పన్న తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారిని సిద్దిపేటలోని సర్కార్ హాస్పిటల్‌కు తరలించారు.