
- బైక్ తగులబెట్టి, కారు అద్దాలను ధ్వంసం చేసిన అన్న
- మహబూబాబాద్ జిల్లా వీరారంలో ఘటన
నర్సింహులపేట(మరిపెడ),వెలుగు: ఆస్తి తగాదాల కారణంగా తమ్ముడి కుటుంబంపై అన్న దాడికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. బాధితులు తెలిపిన ప్రకారం.. మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన చల్ల మల్సూరు, ఉపేంద్ర దంపతులకు ముగ్గురు కొడుకులు. తల్లిదండ్రులకు చెందిన 5 ఎకరాల భూమిపై పదేండ్లుగా అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొంది.
పెద్దకొడుకు సత్యనారాయణ తల్లిదండ్రులతో పాటు ఇద్దరు తమ్ముళ్లను వేధిస్తూ ఒక్కడే భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో రెండు నెలల కింద తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ముగ్గురు కొడుకులు సమానంగా పంచుకోవాలని చెప్పారు. అయితే.. మల్సూర్ రెండో కొడుకు రవి, ఉమ దంపతులు మామిడి తోటలో కాయలు కోస్తుండగా ఆదివారం సత్యనారాయణ పెట్రోల్ బాటిల్ తో వెళ్లి దాడి చేశాడు.
రవి భార్య ఉమ తృటితో తప్పించుకోగా.. పక్కనే ఉన్న బైక్ పై పెట్రోల్ పడి కాలిపోయింది. ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారు అద్దాలను కూడా ధ్వంసం చేశాడు. రాజకీయ పలుకుబడి ఉన్న అన్న నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని రవి పోలీసులకు కంప్లయింట్ చేశాడు.