- ఎమ్మార్పీఎస్ నేతలను బంధించి కుక్కలతో భయపెట్టి చిత్రహింసలు
- గుర్తింపు లేని ఫామ్ హౌజ్ ను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
శంషాబాద్, వెలుగు: ఎమ్మార్పీఎస్ నేతలను కిడ్నాప్ చేసి భయబ్రాంతులకు గురి చేసిన ఘటనలో సీజ్ చేసిన ఫామ్ హౌజ్ ను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. వివరాల్లోకి వెళితే.. నార్సింగి పీఎస్ పరిధిలోని గండిపేట రోడ్డు బృందావన్ కాలనీలో ఒక ప్లాటు వివాదంలో మాట్లాడేందుకు కొద్దిరోజుల కిందట ఎమ్మార్పీఎస్ నేతలు నరేందర్, ప్రవీణ్ వెళ్లారు. వారిని కిడ్నాప్ చేసి శంషాబాద్ లోని ధర్మగిరి సాయిబాబా ఆలయం పక్కన బ్రదర్స్ ఫామ్ హౌజ్ లో బంధించారు. అక్కడ పెంచిన కుక్కలను ఎమ్మార్పీఎస్ నేతలపైకి వదిలి తీవ్ర భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా గాయపరిచినది తెలిసిందే.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కేసు నమోదు చేసి ఫామ్ హౌజ్ ను గుర్తించి సీజ్ చేశారు. దాని యజమానికి నోటీసులు జారీ చేశారు. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో సోమవారం కూల్చివేశారు. అనంతరం మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ... ఫామ్ హౌజ్ కు ఎలాంటి పర్మిషన్లు లేవని, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసుల ఫిర్యాదుతో పరిశీలించామని తెలిపారు. భారీ పోలీసులు బందోబస్తు నడుమ జేసీబీతో ఫామ్ హౌజ్ ను నేల మట్టం చేశారు. భూ కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ హెచ్చరించారు.