WCL 2024: ఇర్ఫాన్ పఠాన్ vs యూసఫ్ పఠాన్.. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన క్రికెట్

WCL 2024: ఇర్ఫాన్ పఠాన్ vs యూసఫ్ పఠాన్.. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన క్రికెట్

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ ఫీల్డ్‌లో ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో డేల్ స్టెయిన్ స్లోయర్ లెంగ్త్ బాల్‌ను వేశాడు. ఈ బంతిని ఇర్ఫాన్ పఠాన్ భారీ షాట్ కు ప్రయత్నించగా..టైమింగ్ కుదరక టాప్ ఎడ్జ్ తీసుకొని గ్రౌండ్ లోనే పడింది. కష్టమైన క్యాచ్ కావడంతో ఫీల్డర్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే మరో ఫీల్డర్ డేన్ విలాస్ ముందుకొచ్చి  బంతిని నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు.

మొదటి పరుగు చేసిన ఇర్ఫాన్ పఠాన్.. రెండో పరుగు కోసం పిచ్ సగానికి పరిగెత్తాడు. అయితే అతని సోదరుడు యూసఫ్ పఠాన్ మాత్రం పరుగుకు నిరాకరించాడు. అప్పటికే సగం దూరం పరుగెత్తిన ఇర్ఫాన్ పఠాన్.. నాన్ స్ట్రైకింగ్ క్రీజుకు చేరుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో బౌలర్ స్టెయిన్ వేగంగా క్యాచ్‌ని అందుకొని రనౌట్ చేశాడు. దీంతో పఠాన్ తన సోదరుడిని గ్రౌండ్ లోనే మాటల యుద్ధానికి దిగాడు. యూసఫ్ పఠాన్ పై గట్టిగా అరుస్తూ పెవిలియన్ కు చేరాడు. ఈ రనౌట్ పై ఇర్ఫాన్. డగౌట్ కి వెళ్ళాక కూడా తన సోదరుడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  

ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ పై సౌతాఫ్రికా 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లను 156 పరుగులకే పరిమితమైంది. గొడవ పడిన సోదరులు.. యూసఫ్ పఠాన్ (54), ఇర్ఫాన్ పఠాన్ (35) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినా సెమీ ఫైనల్ కు చేరుకుంది. జూలై 12 న ఆస్ట్రేలియాతో ఈ పోరు జరగనుంది.