- రెండు రోజులుగా ఇంటి ముందే శవం
- పెద్ద మనుషుల పంచాయితీ
- అందరికీ పంచుతూ పేపర్రాయించడంతో దహన సంస్కారాలు
- సూర్యాపేట జిల్లా సిరికొండలో ఆ నలుగురు సీన్ రిపీట్
మోతె (మునగాల), వెలుగు : అనార్యోగంతో అన్న చనిపోగా, ఆస్తులు పంచాకే అంత్యక్రియలు చేస్తామని తమ్ముళ్లు ధర్నాకు దిగారు. రెండు రోజులుగా శవాన్ని ఇంటి ముందే ఉంచి ఆస్తుల పంపకాలయ్యాకే దహన సంస్కారాలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందిన సత్యనారాయణ (62), భాగ్యమ్మ దంపతులు. వీరికి పిల్లలు లేరు. కుటుంబంలో గొడవల కారణంగా ఆరేండ్ల కింద భాగ్యమ్మ భర్తను వదిలేసి తోడికోడళ్ల(సత్యనారాయణ తమ్ముళ్ల భార్యలు) వద్ద ఉంటోంది. అప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్న సత్యనారాయణ మంగళవారం చనిపోయాడు. అయితే, ఆయన తమ్ముళ్లు అంత్యక్రియలు చేయకుండా ఆస్తులు పంచాలని గొడవకు దిగారు.
ALSO READ: హైదరాబాద్ లో క్వాంటమ్ ఏఐ ఆఫీస్
గ్రామంలోని మీసేవ వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్కోసం స్లాట్ బుక్ చేయించుకునే విషయంలో గొడవపడి అక్కడే మంగళవారం రాత్రి ధర్నాకు దిగారు. తమ అన్నకు దవాఖాన ఖర్చుల కోసం రూ.30 లక్షలు ఇచ్చామని, భాగ్యమ్మను ఆరేండ్లుగా సాదుతున్నామని చెప్పారు. తమకు రూ.30 లక్షలు లేదా స్లాట్ బుక్ చేసి ఎకరా పొలం రిజిస్ట్రేషన్చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే దహన సంస్కారాలు నిర్వహించేది లేదని తేల్చిచెప్పారు.
దీంతో బుధవారం మధ్యాహ్నం ఇరువర్గాల పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించి సత్యనారాయణకు ఉన్న నాలుగు ఎకరాలను అందరికీ వచ్చేట్టు పేపర్రాయించారు. వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా ఒప్పందం కుదిర్చారు. ఆ తర్వాతే అంత్యక్రియలు పూర్తి చేశారు. శవాన్ని పక్కన పెట్టుకుని ఆస్తుల కోసం అన్నదమ్ములు గొడవ పడిన తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.