హైదరాబాద్ ఎమ్మెల్సీ ఓటింగ్ ను బాయ్ కాట్ చేసిన బీఆర్ఎస్

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఓటింగ్ ను బాయ్ కాట్ చేసిన బీఆర్ఎస్


హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దు.. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 19న గ్రేటర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేటీఆర్..ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ లో పాల్గొనకుండా  విప్ కూడా జారీ చేస్తామన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరూ ఓటుకు వెళ్లొద్దని..ఒక వేళ ఓటు వేస్తే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు కేటీఆర్.  గ్రేటర్ ఎన్నికలో బలం లేనందునే పోటీకి దూరంగా ఉన్నామని చెప్పారు కేటీఆర్. 

గ్రేటర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ,ఎంఐఎం పోటీచేస్తున్నాయి. కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉంటుంది.బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. అయితే బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే అసలు ఎవరికీ ఓటు వేయొద్దని..పోలింగ్ లోనే  పాల్గొనద్దని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో బలం లేకున్నా బీజేపీ పోటీ చేస్తుంది. దీంతో ఎంఐఎం గెలుపు ఖాయమని చెప్పవచ్చు.

మొత్తం 112 ఓట్లలో ఎంఐఎంకు  మెజారిటీ  49 ఓట్లు ఉన్నాయి. బీజేపీకి 22 ఓట్లే ఉన్నాయి.  బీఆర్ఎస్ దూరంగా ఉండటంతో ఓట్ల సంఖ్య తగ్గనుంది.దీంతో మజ్లీ్స్ పార్టీ సొంత ఓట్లతోనే ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచే అవకాశం ఉంది. 

ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా..25న  కౌంటింగ్ జరగనుంది.బీజేపీ తరపున గౌతం రావు , ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్  నామినేషన్ దాఖలు చేశారు.