- సంగారెడ్డి జైలుకెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
- దాడిలో పాల్గొన్న కాంగ్రెసోళ్లను వదిలేసి బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నరు
- రేవంత్.. నీ పదవి ఐదేండ్లే..అప్పటిదాకా కుర్చీలో ఉంటవో.. ఉండవో?
- అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసని కామెంట్
సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు: లగచర్ల ఘట న నిందితులతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న 21 మందిని కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. పేదల భూములు గుంజుకొని రియల్ఎస్టేట్ దందా చేస్తామంటే అక్కడి ప్రజలు తిరగబడ్డారని, రేవంత్ సర్కారు అనాలోచిత ప్రయత్నాలకు నిరసన తెలిపితే దానికి రాజకీయ రంగును పులుముతున్నారని అన్నారు. నాడు ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యమని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడెలా కొడంగల్‌కు ఫార్మా పరిశ్రమ తీసుకొస్తాడని ప్రశ్నించారు. తమ భూముల జోలికి రావొద్దని 9 నెలలుగా లగచర్ల, హకీంపేట, మరో రెండు తండాల రైతులు ఆందోళన చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని, అందుకే అధికారులు వచ్చినప్పుడు మర్లబడ్డారని అన్నారు. సంఘటన జరిగిన సమయంలో అక్కడలేని వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని, దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ వాళ్లను వదిలేసి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలపైనే కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు.
పేదల ఇండ్లపై దాడులు చేశారు
సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి కొడంగల్ చక్రవర్తిగా వ్యవహరిస్తూ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని కేటీఆర్ అన్నారు. ఆయన మనుషులు టెర్రరిస్టులను కూంబింగ్ చేసినట్టు లగచర్లలో పేదల ఇండ్లపై దాడి చేశారని, చెప్పినట్టు వినకపోతే కుటుంబ సభ్యుల అంతు చూస్తామని బెదిరించారని ఆరోపించారు. పదవి ఎప్పటికీ శాశ్వతం కాదని, ఐదేండ్లు కూడా రేవంత్ సీఎం కుర్చీలో ఉంటడో? ఉండడో? అని కేటీఆర్వాఖ్యానించారు. ‘‘సన్నకారు రైతుల భూములు లాక్కొని అల్లుడికి ఫార్మా కంపెనీలు పెట్టిస్తా అంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. నేడు కొడంగల్ మర్లవడ్డది. రేపు తెలంగాణ తిరగవడ్తది. మేం అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తాం” అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సంక్షేమం మాయం.. అభివృద్ధి దూరం
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ 11 నెలల పాలనలో సంక్షేమం మాయమైందని, అభివృద్ధి దూరమైందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలం గాణ నివ్వెరపోతున్నదని, టైం వస్తే కాటేసి తీరాలని ఎదురు చూస్తున్నదన్నారు. గురుకుల స్కూళ్ల నిర్వహణను గాలికొదిలేసిందని ‘ఎక్స్’లో ఆరోపించారు.